Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్రపోతున్న మహిళపై దాడి చేసిన పులి ఆమెను 20 అడుగుల దూరం లాక్కెళ్లింది...

Tiger
, శనివారం, 24 జూన్ 2023 (09:24 IST)
పులులు జనావాసాల్లోకి వచ్చి ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ దాడుల్లో అనేక మంది పౌరులు చనిపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో కూడా పులి దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి పరిష్కారంగా పులులను బంధించాలనే ప్రచారాన్ని అటవీ శాఖ ప్రారంభించింది. అయితే, ఈ సమస్యకు పులులను బంధించడం సరైన పరిష్కారమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత మూడు నెలల్లో సావ్లీ తాలూకాలోని కొన్ని గ్రామాల్లో నలుగురిని చంపిన ఒక పులిని అటవీ శాఖ రెస్క్యూ టీం పట్టుకుంది.

 
ఈ పులి కారణంగా సావ్లీ తాలూకాలోని బోర్మలా, చెక్ విర్‌ఖాల్, వాఘోలిబుటి గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. గతంలో అడవులు, పొలాల్లో పని చేసే వారిపైనే పులులు దాడి చేసేవి. అయితే, ఇప్పుడు గ్రామాల్లో ఇంటి ఆరుబయట నిద్రిస్తున్నవారిపై కూడా పులులు దాడి చేస్తున్నాయి. మే 27వ తేదీన విర్ఖల్ చాక్ గ్రామంలో రాత్రి పెరట్లో నిద్రిస్తున్న 57 ఏళ్ల మంద సిద్ధం అనే మహిళపై పులి దాడి చేసింది. నిద్రిస్తున్న ఆమెను పులి దాదాపు దాదాపు 20 అడుగుల దూరం లాక్కెళ్లింది. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. దాడి జరుగుతుండగా పక్క మంచంపై నిద్రిస్తున్న వ్యక్తి లేచి కేకలు వేశారు. అయినా అప్పటికే చాలా ఆలస్యం అయింది.

 
"మేమంతా గాఢ నిద్రలో ఉన్నాం. బాపు మెలకువగా ఉన్నాడు. ఈ సంఘటన రాత్రి 2 గంటలకు జరిగింది. బయట అరుపులు విని మేం లేచాం. కానీ, అప్పటికే మందాబాయి ఎక్కడా కనిపించలేదు. మేం ఆరుగురం, మాతో పాటు వీధిలోని ఇతర వ్యక్తులు ఆమె కోసం వెతికాం. రక్తంతో తడిచిన ఆమె మాకు కనిపించింది. ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి’’ అని బాధిత కుటుంబ సభ్యుడు సుమిత్ ద్వాల్కర్ చెప్పారు.

 
ఈ ఘటన తర్వాత ఆ గ్రామంలో పులి భయంతో ఆరు బయట పడుకోవడం మానేశారు. "ఇప్పుడు రాత్రిపూట ఎవరూ బయట పడుకోవట్లేదు. తెల్లవారుజామున కూడా లేవట్లేదు. ఇంతకు ముందు 4 గంటలకే నిద్రలేచేవారు. ఇప్పుడు ఎవరూ 6 గంటల వరకు లేవడం లేదు" అని ద్వాల్కర్ తెలిపారు. ఈ దాడి తర్వాత, గ్రామంలో పులి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలిపే జాగ్రత్తలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఈ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో వాఘోలి బుటి అనే గ్రామంలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది.

 
55 ఏళ్ల ప్రేమిలా రోహంకర్ మే 20వ తేదీన పొలానికి వెళ్లారు. ఆ సమయంలో పులి దాడి చేయడంతో ప్రేమిల అక్కడికక్కడే మృతి చెందారు. అటవీ శాఖ అధికారులు పులిని బంధించేవరకు, మృతదేహాన్ని తీయబోమని గ్రామస్థులు నిరసన ప్రదర్శన చేశారు. అటవీ శాఖ నిర్లక్ష్యం వల్లే తన తల్లి మరణించారని ప్రేమిల కుమారుడు అశ్విన్ రోహంకర్ ఆరోపించారు. ‘‘మా ప్రాణాలు పోతుంటే, అటవీ శాఖ మాత్రం ఏం పట్టనట్లు ప్రవర్తిస్తోంది. పులుల దాడులు పెరిగిపోతున్నాయి. వీటిని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు.

 
పొద్దున 10:30 గంటల సమయంలో మల విసర్జన కోసం మా అమ్మ పొలానికి వెళ్లారు. అక్కడే పులి దాడి చేసింది. పులి దాడి గురించి అటవీ శాఖకు సమాచారం ఇచ్చాం’’ అని ఆయన ఆరోపణలు చేశారు. మా గ్రామంలో ఇది రెండో ఘటన. అయినప్పటికీ, అటవీశాఖ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోలేదని అశ్విన్‌తోపాటు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రాణాలు తీసిన ఈ పులిని అటవీశాఖ బంధించింది. నాగ్‌పుర్‌లోని గోరెవాడ ట్రాన్సిట్ సెంటర్‌కు దాన్ని తరలించారు.

 
పెరుగుతున్న దాడులు
చంద్రాపూర్ జిల్లాలో పులి దాడి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. మానవ ఆవాసాల్లో పులుల ఉనికి కూడా పెరిగింది. కొద్ది రోజుల క్రితం గడ్చిరోలి నగరంలోని అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉన్న ప్రాంతంలో ఒక పులిని పట్టుకున్నారు. చంద్రాపూర్‌లోని ట్రాన్సిట్ సెంటర్‌లో దాన్ని ఉంచారు. దాడులు పెరగడంతో పులులను పట్టుకునేందుకు అటవీశాఖ గాలింపు చర్యలు చేపట్టింది. అటవీశాఖ రెస్క్యూ టీమ్ ఇప్పటివరకు 12 పులులను బంధించింది. ఈ పులులను వివిధ ట్రాన్సిట్ కేంద్రాల్లో ఉంచారు. చంద్రాపూర్‌లోని ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌లో ఒకేసారి రెండు పులులకు ఉంచే సామర్థ్యం ఉంది. కానీ, కొన్నిసార్లు ఎక్కువ సంఖ్యలో పులులను చికిత్స కోసం ఇక్కడకు తీసుకొస్తుంటారు. ఈ కేంద్రం సామర్థ్యం తక్కువగా ఉండడంతో ఇక్కడి నుంచి గోరేవాడలోని ట్రాన్సిట్ కేంద్రానికి పులులను పంపిస్తారు.

 
‘‘ఇక్కడ రెండు పులులును మాత్రమే ఉంచవచ్చు. కానీ, కొన్నిసార్లు మేం నాలుగైదు పులులను చూసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఎక్కువగా మనుషుల మాంసాన్ని తినేవే ఉంటాయి. పులులను బంధించినప్పుడు వాటి ఉగ్రరూపం చూడొచ్చు. రాత్రిపూట బోనులో వాటి కదలిక భయంకరంగా ఉంటుంది. వాటికి చికిత్స చేసి గోరెవాడకు పంపిస్తాం’’ అని చంద్రాపూర్ ట్రాన్సిట్ కేంద్రానికి చెందిన ఉద్యోగి ఉమేశ్ ధనోడే చెప్పారు.

 
విదర్భలో పెరిగిన పులుల సంఖ్య
విదర్భలో పులుల సంఖ్య పెరుగుతోంది. గణాంకాల ప్రకారం, మహారాష్ట్రలోని 18 టైగర్ రిజర్వ్‌లు, అభయారణ్యాలలో 390 పులులు ఉన్నాయి. కానీ, వాస్తవ అంచనా ప్రకారం ఈ పులుల సంఖ్య 403 నుంచి 490 వరకు ఉండవచ్చు. తడోబా, బ్రహ్మపురి అడవుల్లోనే పులుల సంఖ్య 140కి చేరింది. పులుల సంఖ్య పెరగడం వల్ల దాడులు పెరిగాయా అని తడోబా ఏరియా డైరెక్టర్‌ జితేంద్ర రామ్‌గావ్‌కర్‌ను బీబీసీ అడిగింది. దీనిపై జితేంద్ర రామ్‌గావ్‌కర్ మాట్లాడుతూ, ‘‘అటవీ ప్రాంతంలో నివసించే జనాభా ఎక్కువగా అడవిపైనే ఆధారపడుతుంది. అలాంటి ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతాయి" అని ఆయన అన్నారు.

 
అటవీ శాఖ ప్రచారం
అటవీ శాఖ గణాంకాల ప్రకారం.. గత నాలుగేళ్లలో తడోబాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 33 పులులను బంధించాలని అటవీశాఖ ఆదేశాలు జారీ చేసింది.
అందులో ఈ నాలుగేళ్లలో 21 పులులను బంధించారు. వీటిని వేర్వేరు ట్రాన్సిట్ కేంద్రాల్లో, జనసంచారం లేని మూసివేసిన పార్కుల్లో ఉంచారు. మహారాష్ట్రలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, గోరేవాడ ట్రాన్సిట్ సెంటర్‌లో వాటి సామర్థ్యం కంటే ఎక్కువ పులులు ఉన్నాయి. గత నాలుగేళ్లలో పులుల దాడిలో 104 మంది ప్రాణాలు కోల్పోయారు. పులుల సంఖ్య పెరుగుతుండగా, పులుల మరణాల రేటు కూడా పెరుగుతోంది. గత ఆరేళ్లలో 129 పులులు చనిపోయాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 23 పులులు వేటకు గురికాగా, ప్రమాదవశాత్తు 10 పులులు మరణించాయి. విద్యుత్ షాక్ కారణంగా 18 పులులు చనిపోయాయి.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెల్‌స్పన్ ఆదర్శప్రాయమైన సహకారానికి తెలంగాణలో రెండు ప్రత్యేక అవార్డులతో గుర్తింపు