Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2018 సినిమా రివ్యూ: కేరళ ప్రళయంపై తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగాల వరదలో ముంచెత్తుతోందా?

2018
, శనివారం, 27 మే 2023 (13:42 IST)
కర్టెసి-ట్విట్టర్
కొన్ని కథలను చెప్పుకోకూడదు. తెరపైనే అనుభవించాలి. '2018' కూడా అలాంటి కథే. ఈ సినిమాలో నిజానికి ఎవరూ హీరోలు కారు. కానీ అన్ని పాత్రలకూ హీరోలయ్యే అవకాశం కల్పించిన దర్శకుడి పనితీరును అభినందించకుండా ఉండలేం. యథార్థ గాథలు, మనసులను మెలిపెట్టే డ్రామాలే కాదు.. ప్రకృతి విపత్తులు, విషాదాలు కూడా వెండితెరపై ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. ఆ విషాదం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను ఒక్క క్షణం తట్టిలేపుతాయి. ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర వేసిన ‘టైటానిక్’ కూడా ఓ మహా విషాదమే. 
 
ఇలా చరిత్రలోని ఎన్నో విషాదాలు వెండితెర రూపం తీసుకున్నాయి. 2018 కేర‌ళ వ‌ర‌ద‌లు కూడా అలాంటి ఒక పీడ కలే. ఆ వరదలు ఎంతో మంది జీవితాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. అంతటి విపత్కర పరిస్థితిలోనూ మనోనిబ్బరం చెదరకుండా, వరదలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన వాళ్లూ ఉన్నారు. అదే నేపథ్యంలో ‘2018’ చిత్రం ప్రేక్షకులు ముందుకొచ్చింది. మరి ఆ ప్రకృతి విలయం ఎలా తెరకెక్కింది? ఎలాంటి భావోద్వేగాలను పంచింది?
 
'ప్రళయం'లో పాత్రలు
2018లో కేరళను ముంచెత్తిన వరదల్లో కొందరు వ్యక్తులు చూపిన తెగువ, ధైర్య సాహసాలు, వారిలో కలిగిన భావోద్వేగాలు, ఊహించని విపత్తులో పరిమళించిన మానవత్వం ప్రధానాంశాలుగా సాగుతుందీ సినిమా. తుపానుకు ముందు ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చల్లని గాలి వీస్తుంది. చిన్న చినుకులతో నేల తడుస్తుంది. 2018 ప్రథమార్ధం కూడా ఇలానే చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా మొదలవుతుంది. ఒక టీవీ చానల్‌లో రిపోర్టర్‌గా పని చేస్తుంటుంది నూరా(అపర్ణ బాలమురళి). ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లే ప్రయ‌త్నాల్లో ఉన్న కుర్రాడు అనూప్ (టోవినో థామస్). రమేష్ దుబాయ్‌లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. భార్యతో తనకు కొన్ని విబేధాలు ఉంటాయి.
 
కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఉండే త‌మిళ‌నాడు గ్రామానికి చెందిన ఓ లారీ డ్రైవ‌ర్ సేతు (క‌లైయార‌స‌న్‌). మోడ‌ల్ కావాలని కలలు కంటాడు మ‌త్య్సకార కుటుంబానికి చెందిన కుర్రాడు నిక్సన్ (అసిఫ్ అలీ). టూరిస్ట్‌ గైడ్, టాక్సీ డ్రైవ‌ర్ కోషి (అజు వ‌ర్ఘీస్‌). ప్రభుత్వ కార్యాల‌యంలో ప‌నిచేసే ఓ అధికారి (కుంచ‌కో బొబన్‌). ఇలా ఒక్కొక్క పాత్రను తెరపైకి తీసుకొస్తాడు దర్శకుడు. ఒక్కో పాత్రకు ఒక్కో నేపథ్యం. సినిమా అలా సాగుతుండగా, కాసేపటికి దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ ఏమిటనే సందేహం మనకు కలుగుతుంది. ఎందుకు ఇన్ని పాత్రలను ఇన్ని ఉప కథలుగా చూపిస్తున్నాడు? వీరందరినీ ఎక్కడ, ఎలా కలుపుతాడు? ఈ కథలోకి వీళ్లంతా ఎలా వస్తారు? అనే ప్రశ్నలతోనే ఫస్టాఫ్ నడుస్తుంది.
 
వీరోచితమా? విషాదమా?
ఈ సినిమాలో అసలైన అనుభూతి ద్వితీయార్థంలో మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో ఎదురైన ఒక్కో ప్రశ్నకు సెకండాఫ్‌ మొదలైనప్పటి నుంచే సమాధానం దొరుకుతుంది. ఒక్కసారిగా వరదలు ప్రజలను చుట్టుముట్టడంతో తెర కూడా గంభీరంగా మారిపోతుంది. అందులో ఏ పాత్రలు మిగులుతాయి? ఎవరికి, ఏ ఆపద వస్తుంది? ఈ పాత్రలన్నీ బతికి బట్టగడితే బాగుంటుందనే భావన చూసే ప్రేక్షకులలో కలిగిందంటే.. ఆ గొప్పదనం నటీనటులది, ఈ క‌థ‌లో ఆడియన్స్‌ను లీనమయ్యేలా చేసిన‌ దర్శకుడిదే. ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి ఏం చేయాలి? ఒకటి, భయంతో కూలిపోవాలి. రెండు, ధైర్యంగా నిలబడాలి. కేరళ వరదల్లో కొందరు ప్రజలు ధైర్యంగా నిలబడ్డారు. అలాంటి పాత్రలనే వీరోచితంగా చిత్రీకరించాడు దర్శకుడు. అందుకే ఈ చిత్రానికి ‘ఎవ్రీవ‌న్ ఈజ్ ఏ హీరో’ అనే ఉపశీర్షిక పెట్టాడు. అన్ని పాత్రలను హీరోయిక్‌గానే చూపించాడు. ఒక్క క్షణానికి మనం వ‌ర‌ద‌ల్లో ఉన్నామా అనుకునేంత సహజంగా సన్నివేశాలను తెరకెక్కించాడు.
 
స‌హజత్వమే బలం
ఈ కథలో తెరపై చాలా పాత్రలు కనిపిస్తాయి. వారి పేర్లు కూడా తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి తెలియకపోయినా ఆ పాత్రలు మాత్రం గుర్తుండిపోతాయి. తోటి జ‌వాన్లు మ‌ర‌ణిస్తుంటే భ‌య‌ప‌డి ఆర్మీ నుంచి పారిపోయి వ‌చ్చిన అనూప్.. ఎయిర్ లిఫ్టింగ్‌లో తన ధైర్యసాహసాలు చూపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. చేపలు పట్టుకునే కుటుంబానికి తన కూతురిని ఇవ్వనన్న ఓ తండ్రిని విప‌త్తు సమయంలో అదే చేపలు పట్టుకునే కుటుంబం రక్షించడం ఆలోచింపజేస్తుంది. ఏ కథ అయినా మనసుకు హత్తుకుపోవాలంటే భావోద్వేగాలు పండాలి. 2018లో ఆ భావోద్వేగాలు వరదై పొంగాయి.
 
ఇందులో కనిపించిన ఎక్కువ మంది నటీనటులు తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఎప్పుడూ చూడనివారే. అయినా, వారు పండించే ఎమోషన్స్ ప్రేక్షకులను కదిలిస్తాయి. వారి కంటితడి ప్రేక్షకులను కదిలిస్తుంది. అనూప్ పాత్రకు టోవినో థామస్ తన నటనతో ప్రాణం పోశారు. అంత భీకర వరదల‌ను రిపోర్ట్ చేసే సాహసవంతురాలైన రిపోర్టర్ పాత్రలో అపర్ణ నటన బాగుంది. లాల్‌‌కు చాలా కీలకమైన పాత్ర దక్కింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే మత్సకార నాయకుడిగా ఆయన పాత్ర గుర్తుండిపోతుంది. మిగిలిన‌ వాళ్లంతా తెలుగు ప్రేక్షకుల‌కు ప‌రిచ‌యం లేని న‌టులే అయినప్పటికీ, సినిమా పూర్తయ్యే సరికి రిజిస్టర్ అయిపోతారు. అన్ని పాత్రలను సహజంగా తీర్చిదిద్దడమే ఈ సినిమా బలం.
 
మనమే వరదల్లో చిక్కుకున్నామా అనిపించేలా...
ఇది సర్వైవల్ థ్రిల్లరే కానీ, కల్పితం కాదు. కేరళ వరదలు అని టైప్ చేస్తే నెట్‌లో బోలెడు వీడియోలు వస్తాయి. చరిత్ర ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. ఇలాంటి నేపథ్యంలో సినిమా తీసి మెప్పించడం అంత తేలికేమీ కాదు. కానీ, ఈ విషయంలో దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ పనితీరుకు ఫిదా అయిపోతాం. సినిమా చూస్తున్నపుడు మనం కూడా ఆ వరదల్లో చిక్కుకున్నామా అని చాలా సార్లు అనిపిస్తుంది. ఎటు చూసినా నీరు, వరద, హోరు గాలి.. ఇదంతా తెరపై క్రియేట్ చేయడం అంత తేలిక కాదు. కానీ చాలా సహజంగా వరదలని వెండితెరపై సృష్టించారు. ఇలాంటి సినిమాలు చేసినవారు.. ఏ టెక్నాలజీ వాడి ఇలాంటి దృశ్యాలు కళ్లకు కట్టినట్లు చూపించగలిగారో తెలుసుకోవాలన్న కుతూహలం కూడా కలుగుతుంది. దర్శకుడి ఎమోషన్స్‌‌కు అఖిల్ జార్జ్ కెమెరా పనితనం చక్కగా కుదిరింది. నోబిన్ పాల్, విలియం ఫ్రాన్సిస్ అందించిన నేపథ్య సంగీతం మరో రేంజ్‌లో ఉంది. సెకండాఫ్ అంతా వరద శబ్దమే వినిపిస్తుంది కానీ ఎక్కడా చిరాకుగా అనిపించదు. దృశ్యానికి అనుగుణంగా సంగీతం చక్కగా అమరింది.
 
నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సినిమా అంతా వర్షం కురుస్తూనే ఉంటుంది. వాగులు పొంగుతుంటాయి. డ్యాములు తెరుచుకుంటాయి. ఎక్కడ చూసినా నీరు, ఎక్కడ చూసినా వరద. సముద్రం పొంగి మీద పడుతున్న బీభత్సం. అంతటి జల ప్రళయంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లి, భావోద్వేగాల వరదలో ముంచెత్తి వదిలే సినిమా 2018.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణ కాశీ పుష్కరిణిలో అభిషేకం.. స్విమ్ చేసిన ఈవో.. నెటిజన్ల ఫైర్