ఇది భగత్ సింగ్ కథ. ఆయనను ఉరి తీసిన సమయం కాస్త అసాధారణమైనది. సాధారణంగా ఉదయం పూట ఉరిశిక్ష విధిస్తారు. కానీ, అది మార్చి 23వ తేదీ సాయంత్రం 7:30 గంటల సమయం. అప్పటికి పొద్దుపోయింది. లాహోర్ జైలు చీఫ్ సూపరింటెండెంట్ మేజర్ పీడీ చోప్రా, ఒక 23 ఏళ్ల యువకునితోపాటు ఆ యువకుని ఇద్దరు స్నేహితులను తీసుకొని నడుచుకుంటూ ఉరికంబం వైపు వెళ్తున్నారు. ఇదంతా చూస్తున్న డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ మొహమ్మద్ అక్బర్ చాలా కష్టంగా తన కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించారు.
ఉరికంబం వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి బహుశా అప్పటికే భారత్‌లో ప్రముఖుడిగా మారారు. ఆయనే భగత్ సింగ్. భగత్ సింగ్‌తో పాటు ఆయన స్నేహితులైన సుఖ్‌దేవ్, రాజ్‌గురు కూడా నడుస్తున్నారు. రాజకీయ ఖైదీలుగా వారు ముగ్గురూ జైలుకు చేరారు. తమను సాధారణ ఖైదీల తరహాలో ఉరి తీయవద్దని, రాజకీయ ఖైదీలైన తమను కాల్చి చంపాలని వారు ముగ్గురు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. వారి ముగ్గురిలో భగత్ సింగ్ మధ్యలో నడుస్తున్నారు. ఆయనకు ఎడమవైపు సుఖ్‌దేవ్, కుడివైపు రాజ్‌గురు ఉన్నారు. ఉరికంబం వైపు నడుస్తూ భగత్ సింగ్ పాట పాడటం మొదలుపెట్టారు. ప్రాణం పోయినా నా మనస్సులో దేశంపై ప్రేమ చావదు, మట్టిలో కలిసినా నా శరీరం నుంచి ఈ దేశపు పరిమళమే వస్తుంది అంటూ పాడగా ఆయనతో రాజ్‌గురు, సుఖ్‌దేవ్ స్వరం కలిపారు.
ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్
ఉరి వేసే ముందు భగత్ సింగ్ ఉరితాడును ముద్దాడారు. ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ భగత్ సింగ్ పుస్తకంలో సత్వీందర్ సింగ్ ఈ ఘటన గురించి ప్రస్తావించారు. ఈ క్షణాన్ని అనుభవించడం కోసమే భగత్ సింగ్ తన జీవితాన్ని దేశానికి ధారపోశారు. ఉరి తాడును స్వయంగా ఆయనే తన మెడలో వేసుకున్నారు. భగత్ సింగ్ తర్వాత రాజ్‌గురు, సుఖ్‌దేవ్ మెడల్లో కూడా ఉరి తాడును వేశారు. ఉరి తాడు మెడలో వేసుకునే ముందు భగత్ సింగ్ దాన్ని ముద్దాడారు. తర్వాత ఆయన చేతులు, కాళ్లను కట్టేశారు అని సత్వీందర్ సింగ్ తన పుస్తకంలో రాశారు. వితౌట్ ఫియర్, ద లైఫ్ అండ్ ట్రయల్ ఆఫ్ భగత్ సింగ్ అనే పుస్తకాన్ని కుల్దీప్ నయ్యర్ రాశారు.
ముందుగా ఎవరిని ఉరి తీయమంటారు అని తలారి వారిని అడిగారు. అందరికంటే ముందు నన్ను ఉరి తీయండి అంటూ సుఖ్‌దేవ్ సమాధానం ఇచ్చారు. తలారి ఒకరి తర్వాత ఒకరికి ఉరిని బిగించారు. ముగ్గురి శరీరాలు చాలా సమయం పాటు ఉరికంబానికి వేలాడుతూ ఉన్నాయి అని ఆ పుస్తకంలో కుల్దీప్ రాశారు. దీని తర్వాత వారు ముగ్గురూ మరణించినట్లు అక్కడున్న డాక్టర్ ధ్రువీకరించారు. ఈ ముగ్గురు ఉద్యమకారుల ధైర్యానికి ఎంతో ప్రభావితుడైన అక్కడున్న ఒక జైలు అధికారి, వారి మృతదేహాలను చూడటానికి తిరస్కరించారు. దీంతో వెంటనే ఆయన్ను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురి అంతిమ సంస్కారాలను జైల్లోనే చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ, వారి చితి నుంచి వచ్చే పొగలను చూసి జైలు బయట ఉన్న ప్రజలంతా ఆగ్రహావేశాలకు లోనవుతారని భావించి ప్రణాళికను మార్చారు. వారి అంతిమ సంస్కారాలను సట్లెజ్ నది ఒడ్డున చేయాలని నిర్ణయించారు.
రాత్రికిరాత్రే జైలు వెనుక గోడను కూల్చేశారు. అక్కడి నుంచి ఒక ట్రక్ జైలులోకి వచ్చింది. వారి ముగ్గురి భౌతికకాయాలను లాక్కుంటూ తీసుకొచ్చి ట్రక్‌లో వేశారు. మన్మథ్‌నాథ్ గుప్తా తన పుస్తకం- హిస్టరీ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీ మూవ్మెంట్లో ఇలా రాశారు. సట్లెజ్ నది ఒడ్డున ఇద్దరు పూజారులు వారి శవాల రాక కోసం ఎదురు చూస్తున్నారు. వారి ముగ్గురి శరీరాలను చితిపై ఉంచి నిప్పు అంటించారు. తెల్లవారుతుండటంతో చితి మంటలను ఆర్పేసి సగం కాలిన వారి శరీరాలను సట్లెజ్ నదిలోకి విసిరేశారు. తర్వాత ఆ ప్రాంతాన్ని చౌకీ నంబర్ 201గా గుర్తించారు. పోలీసులు, పూజారులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత, గ్రామస్థులు నదిలో దిగి సగం కాలిపోయిన శరీర భాగాలను నీటిలో నుంచి బయటకు తీశారు. తర్వాత వాటికి సరైన సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలను నిర్వహించారు అని మన్మథ్‌నాథ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.
గాంధీజీకి వ్యతిరేకంగా నిరసనలు
నిజానికి మార్చి 24న భగత్ సింగ్‌ను ఆయన స్నేహితులను ఉరి తీయాలి. కానీ, నిర్ణయించిన సమయానికి 11 గంటల ముందే వారిని ఉరి తీశారు. ఈ విషయం బయటకు పొక్కగానే భారత ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిలాయి. ఈ ఉరితీతలు బ్రిటిష్ లేబర్ ప్రభుత్వం చేసిన అత్యంత పాశవిక పని అని న్యూయార్క్‌లోని డెయిలీ వర్కర్ పత్రిక వ్యాఖ్యానించింది. ఆ రోజుల్లో మహాత్మా గాంధీ, కరాచీ పర్యటనలో ఉన్నారు. ఈ ఉరితీతలకు పరోక్షంగా మహాత్మా గాంధీ కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. దీని గురించి సత్వీందర్ సింగ్ ఇలా రాశారు. గాంధీజీ రైలు కరాచీ స్టేషన్‌కు రాగానే నిరసనకారులు చేతుల్లో నల్ల రంగు పూలు పట్టుకొని నిరసన తెలిపారు. భారత భవిష్యత్ కోసం లార్డ్ ఇర్విన్‌తో జరిపిన చర్చల్లో భగత్ సింగ్ ఉరిని ఆపేయాలనే నిబంధనను మహాత్మా గాంధీ జోడించలేదంటూ గాంధీపై ఆరోపణలు వచ్చాయి.
జవహార్‌లాల్ నెహ్రూ వీరి ఉరితీతను తీవ్ర పదజాలంతో ఖండించారు. రెవల్యూషనరీస్ అండ్ ద బ్రిటిష్ రాజ్ అనే పుస్తకాన్ని శ్రీరామ్ బఖ్షీ రాశారు. భగత్ సింగ్ చూపిన ధైర్యాన్ని, ఆత్మబలిదానాన్ని నేను ఆరాధిస్తాను. ఆయనకు ఉన్నటువంటి ధైర్యం చాలా అరుదైనది. వైస్రాయ్ తన మనసును ఒక మాట అడగాలి. ఒకవేళ భగత్ సింగ్ ఆంగ్లేయుడు అయితే, ఇంగ్లండ్ కోసం భగత్ సింగ్ ఇలాంటి పనినే చేస్తే వైస్రాయ్‌గా తానేం చేసేవాడో ఒకసారి వైస్రాయ్ ఆలోచించుకోవాలి అని నెహ్రూ వ్యాఖ్యానించినట్లు శ్రీరామ్ పుస్తకంలో రాశారు.
వారపత్రికలో ఉద్యోగం
20వ శతాబ్దపు తొలి నాళ్లలో దేశవ్యాప్తంగా ఆంగ్లేయులపై తిరుగుబాటు వ్యాప్తి చెందింది. భగత్ సింగ్ చిన్నాన్న అజీత్ సింగ్, తండ్రి కిషన్ సింగ్ ఇద్దరూ గదర్ పార్టీ సభ్యులు. 1907 సెప్టెంబర్ 28న భగత్ సింగ్ జన్మించారు. అదే రోజున భగత్ సింగ్ తండ్రి, చిన్నాన్న బ్రిటిష్ జైలు నుంచి విడుదలయ్యారు. తొలుత భగత్ సింగ్‌కు భగన్‌లాల్ అనే పేరు పెట్టారు. 1923లో ఆయన లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో చేరారు. చదువులో భగత్ సింగ్ ముందుండేవారు. ఆయనకు ఉర్దూ, హిందీ, గుర్ముఖీ, ఇంగ్లిష్, సంస్కృతం భాషల్లో మంచి పట్టు ఉంది. 1924లో పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆయనపై కుటుంబీకులు ఒత్తిడి తెచ్చారు. తల్లిదండ్రులను ఒప్పించలేక లాహోర్‌లోని తన ఇంటిని వదిలి భగత్ సింగ్ కాన్పూర్‌కు వెళ్లారు. అక్కడ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గణేశ్ శంకర్ విద్యార్థికి చెందిన వారపత్రిక ప్రతాప్లో పని చేయడం మొదలుపెట్టారు. ఆ పత్రికలో బల్వంత్ పేరుతో ఆయన వ్యాసాలు రాశారు. కాన్పూర్‌లో ఆయనకు ఇతర స్వాతంత్ర్య సమరయోధులు బటుకేశ్వర్ దత్తా, శివ వర్మ, బీకే సిన్హా వంటి వారితో పరిచయం ఏర్పడింది.
భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్‌ల స్నేహం
అజయ్ ఘోష్ అనే రచయిత- భగత్ సింగ్ అండ్ హిజ్ కామ్రేడ్స్ అనే పుస్తకాన్ని రాశారు. నాకు బటుకేశ్వర్ దత్తా ద్వారా భగత్ సింగ్ పరిచయం జరిగింది. అప్పుడు ఆయన పొడుగ్గా, చాలా సన్నగా ఉండేవారు. పాత దుస్తులు వేసుకునేవారు. మౌనంగా ఉండేవారు. ఆయన ఒక మందబుద్ధి గల పిల్లాడిలా కనిపించేవారు. ఆయనలో కొంచెం కూడా ఆత్మవిశ్వాసం కనిపించలేదు. తొలి పరిచయంలో ఆయన నాకు కాస్త కూడా నచ్చలేదు. ఆయన వెళ్లిపోయిన తర్వాత నేను బటుకేశ్వర్ దత్తాతో ఇదంతా చెప్పాను. రెండేళ్లలో భగత్ సింగ్ వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చింది. ఆయన మంచి వక్త అయ్యారు. ఆయన ఎంత గొప్పగా, నిజాయతీగా, ప్రభావవంతంగా మాట్లాడేవారంటే ఆయన చెప్పినట్లుగా ప్రజలు నడుచుకునేవారు. 1924లో ఆయన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో సభ్యుడిగా చేరారు. ఆ సంఘానికి చంద్రశేఖర్ ఆజాద్ నాయకుడు. అలా భగత్ సింగ్ ఆయనకు చాలా దగ్గర అయ్యారు అని ఆ పుస్తకంలో వివరించారు.
లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారం
1927లో కాకోరీ ఘటనకు సంబంధించి భగత్ సింగ్ తొలిసారి జైలుకు వెళ్లారు. కాకోరి ఘటనను సమర్థిస్తూ విద్రోహి అనే మారుపేరుతో ఆయన ఒక కథనాన్ని రాశారు. లాహోర్‌లో జరిగిన దసరా వేడుకల్లో బాంబులు వేశారనే ఆరోపణలు కూడా ఆయనపై వచ్చాయి. కానీ, సత్ప్రవర్తన కారణంగా ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. అదే ఏడాది సైమన్ కమిషన్ భారత్‌కు వచ్చింది. లాలా లజపతి రాయ్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనల సందర్భంగా లాఠీ చార్జ్ చేయాలంటూ ఎస్పీ జేఏ స్కాట్ ఆదేశించారు. ఆయన దూరం నుంచే లాలా లజపతి రాయ్‌ను చూశారు. తర్వాత ఆయన్ను లాఠీతో కొట్టడం మొదలుపెట్టారు. రక్తపు మడుగులో స్పృహ కోల్పోయేంత వరకు ఆయనను లాఠీతో కొడుతూనే ఉన్నారు. మాపై పడే ప్రతీ లాఠీ, బ్రిటిష్ సామ్రాజ్యపు సమాధిపై మేకుగా మారుతుంది అంటూ స్పృహ కోల్పోయే ముందు లాలా లజపతి రాజ్ గట్టిగా అరిచారు.
నిరసనకారులపై పోలీసుల చర్యను నెహ్రూ ఖండించారు. దీన్నొక అవమానకర చర్యగా ఆయన పిలిచారు. సెప్టెంబర్ 17న లాలా లజపతి రాయ్ కన్నుమూశారు. 1928 డిసెంబర్ 10న దేశంలోని ఉద్యమకారులందరూ లాహోర్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి భగవతీచరణ్ వోహ్రా భార్య దుర్గాదేవీ నాయకత్వం వహించారు. లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఈ సమావేశంలోనే నిర్ణయించారు. లాలాజీ మరణాన్ని భారత్ మౌనంగా సహించబోదని ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే భగత్ సింగ్, ఆయన స్నేహితుల ఉద్దేశం.
సాండర్స్‌పై కాల్పులు
ఎస్పీ స్కాట్‌ను చంపే పనిని భగత్ సింగ్, సుఖ్‌దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, జై గోపాల్‌లకు అప్పగించారు. స్కాట్‌ను ఎక్కడ చంపాలో కూడా వారు నిర్ణయించుకున్నారు. దీనికి రెండు రోజుల ముందే అంటే డిసెంబర్ 15నే వారు ఆ ప్రదేశానికి వెళ్లారు. ఎరుపు రంగు బార్డర్‌తో భగత్ సింగ్ ఒక పోస్టర్‌ను తయారు చేశారు. దానిపై స్కాట్‌ను చంపేశాం అని రాశారు. ఆయన చేతులతో రాసిన ఈ పోస్టర్‌నే తర్వాత లాహోర్ కుట్ర కేసులో సాక్ష్యంగా ఉపయోగించారు. పోలీస్ స్టేషన్‌కు స్కాట్ రాగానే ఆ విషయాన్ని తమ ముగ్గురికి చెప్పాలనే బాధ్యతను జై గోపాల్‌కు అప్పగించారు. స్కాట్ కార్ నంబర్ 6728. ఈ కారు నంబర్‌ను గుర్తు పెట్టుకోవాలని వారు జై గోపాల్‌కు చెప్పారు.
ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, జై గోపాల్ ఇంతకుముందెప్పుడూ స్కాట్‌ను చూడలేదు. ఆ రోజు స్కాట్ పోలీస్ స్టేషన్‌కు రాలేదు. స్కాట్ ఆ రోజు సెలవులో ఉన్నారు. తన అత్తగారు ఇంగ్లండ్ నుంచి లాహోర్‌కు వస్తుండటంతో స్కాట్ ఒకరోజు సెలవు తీసుకున్నారు. అప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి అసిస్టెంట్ ఎస్పీ జేపీ సాండర్స్ బయటకు రావడంతో అతన్ని స్కాట్‌గా జై గోపాల్ భావించారు. ఈ సమాచారాన్ని భగత్ సింగ్, రాజ్‌గురూలకు పంపించారు. మధ్యాహ్నం సమయంలో పోలీస్ స్టేషన్ బయటకు వచ్చిన సాండర్స్ తన మోటార్ సైకిల్‌ను స్టార్ట్ చేస్తుండగా రాజ్‌గురు తన జర్మన్ మౌజర్ పిస్టల్‌తో కాల్పులు జరిపారు.
వద్దు, వద్దు, అతను స్కాట్ కాదు అని భగత్ సింగ్ అరుస్తూనే ఉన్నారు. కానీ, అప్పటికే అలస్యం అయింది. రాజ్‌గురు కాల్పులు జరిపారు. కిందపడిపోయిన సాండర్స్‌పై భగత్ సింగ్ కూడా కాల్పులు జరిపారు.
చానన్ సింగ్‌పై కూడా కాల్పులు
ముందు నిర్ణయించుకున్న పథకం ప్రకారం భగత్ సింగ్, రాజ్‌గురు ఇద్దరూ డీఏవీ కాలేజీ వైపు పారిపోయారు. వారు పారిపోయేందుకు చంద్రశేఖర్ ఆజాద్ సహకరించారు. రెమినిసెన్సెస్ ఆఫ్ ఫెలో రెవల్యూషనరీస్ అనే పుస్తకాన్ని స్వాతంత్ర్య సమరయోధుడు శివ వర్మ రాశారు. సాండర్స్‌ను చంపి భగత్ సింగ్, రాజ్‌గురూలిద్దరూ పారిపోతున్నప్పుడు వారిని ఒక హెడ్ కానిస్టేబుల్ చానన్ సింగ్ వెంటాడారు. ఆజాద్ అరుస్తున్నప్పటికీ ఆయన ఆగకపోవడంతో రాజ్‌గురూ ఆయన్ను కూడా కాల్చారు. ఆ సమయంలో హాస్టల్ కిటికీ నుంచి చాలా మంది ఈ ఘటనను చూశారు. వారిలో ఒకరు ఫైజ్ అహ్మద్ ఫైజ్. తర్వాతి కాలంలో ఫైజ్ ఒక గొప్ప కవి అయ్యారు అని రాశారు. తర్వాత రోజు నగరంలోని గోడలపై సాండర్స్ చనిపోయారు అనే పోస్టర్లు అంటించి కనిపించాయి. సాండర్స్ హత్య తర్వాత నగరంలోని ప్రతీ మూలలో పోలీసులను మోహరించారు. వారికి లాహోర్ నుంచి బయటకు రావడం కష్టమైపోయింది.
దుర్గ సహాయంతో లాహోర్ నుంచి బయటకు
సాండర్స్‌ను చంపడానికి ముందు భగత్ సింగ్ జుట్టు కత్తిరించుకున్నారు. భగత్ సింగ్ కొత్త అవతారం గురించి పోలీసులకు తెలియదు. వారు జుట్టు, గడ్డం ఉన్న ఒక సిక్కు యువకుని కోసం వెతుకుతున్నారు. సాహెబ్‌ల తరహాలో దుస్తులు ధరించి రైలులో వెళ్లాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నారు. దుర్గా బాబీ ఆయన భార్య రూపంలో ఆయనతో పాటు ప్రయాణిస్తారు. మల్వీందర్‌జీత్ సింగ్ తన పుస్తకం భగత్ సింగ్ ద ఎటర్నల్ రెబెల్లో ఇలా రాశారు.
భగత్ సింగ్ ఒక ఓవర్‌కోట్, టోపీ ధరించారు. ఆయన కోటు కాలర్‌ను కూడా పైకి ఉంచారు. తన ముఖం కనిపించకుండా దుర్గా బాబీ కుమారుడు సాచిని ఆయన ఎత్తుకున్నారు. భగత్ సింగ్, దుర్గా బాబీ ఇద్దరూ ఫస్ట్ క్లాస్ కూపేలో ఉన్నారు. వారి నౌకర్ రూపంలో రాజ్‌గురు ప్రయాణిస్తున్నారు. వారిద్దరి వద్ద లోడ్ చేసిన రివాల్వర్లు ఉన్నాయి అని ఆయన పుస్తకంలో చెప్పారు. లఖ్‌నవూ స్టేషన్‌లో దిగిన భగత్ సింగ్ కొన్ని గంటల పాటు వెయిటింగ్ రూమ్‌లో గడిపారు. అక్కడి నుంచి రాజ్‌గురు మరోవైపుకు వెళ్లగా భగత్ సింగ్, దుర్గా బాబీ ఇద్దరూ కలకత్తాలో ఆగారు. అక్కడ దుర్గా బాబీ భర్త భగవతీచరణ్ వోహ్రా వారి కోసం ఎదురుచూస్తున్నారు.
సెంట్రల్ అసెంబ్లీలో బాంబు వేయాలని నిర్ణయం
కలకత్తాలో కొన్ని రోజులు ఉన్న తర్వాత భగత్ సింగ్ ఆగ్రాకు వెళ్లారు. అక్కడ హీంగ్ కీ మండీ ప్రాంతంలో రెండు ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. ఆగ్రాలోనే భగత్ సింగ్, ఆయన సహచరుల సమావేశం జరిగింది. అందులో సాండర్స్‌ను చంపడం గురించి పెద్ద రభస జరిగింది. ఈ హత్య, తాము ఊహించినంత అలజడిని కలిగించలేదని సమావేశంలోని వారంతా భావించారు. హత్య తర్వాత పెద్ద సంఖ్యలో ఆంగ్లేయులు భారత్ నుంచి వెళ్లిపోతారని వారంతా ఆశించారు. ఆ రోజుల్లో అసెంబ్లీలో రెండు బిల్లులపై చర్చ జరగాల్సి ఉంది. ఒకటేమో పబ్లిక్ సేఫ్టీ బిల్, మరొకటి ట్రేడ్ డిస్ప్యూట్ బిల్. ఈ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టే రోజు, అంటే ఏప్రిల్ 8వ తేదీన భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్తా ఖాకీ చొక్కాలు, షార్ట్స్ ధరించి సెంట్రల్ అసెంబ్లీలోని ప్రేక్షకుల గ్యాలరీకి చేరుకున్నారు. ఆ సమయంలో అసెంబ్లీలో విఠల్‌భాయి పటేల్, మొహమ్మద్ అలీ జిన్నా, మోతీలాల్ నెహ్రూ వంటి అగ్ర నాయకులు ఉన్నారు.
భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్తాలకు జీవిత ఖైదు
ఈ ఘటన గురించి కుల్దీప్ నయ్యర్ ఇలా రాశారు. భగత్ సింగ్ చాలా జాగ్రత్తగా అసెంబ్లీలో ఎవరూ లేని ప్రాంతంలో ఒక బాంబు వేశారు. బాంబు పేలగానే హాల్ మొత్తం చీకటి ఆవరించింది. బటుకేశ్వర్ దత్తా రెండో బాంబును వేశారు. అప్పుడు ప్రేక్షకుల గ్యాలరీ నుంచి అసెంబ్లీలోకి కరపత్రాలు ఎగురుతూ పడ్డాయి. అక్కడున్నవారికి ఇంక్విలాబ్ జిందాబాద్, శ్రామిక వర్గం వర్ధిల్లాలి అనే నినాదాలు వినిపించాయి. ఆ కరపత్రాల్లో చెవిటి వారికి వినిపించాలంటే పెద్ద స్వరం అవసరం అని రాశారు. ఇదంత జరిగాక కూడా భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్తా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించలేదు. ముందు అనుకున్నట్లుగానే పోలీసులకు పట్టుబడాలని వారు నిర్ణయించుకున్నారు. అక్కడే సాండర్స్‌ను హత్య చేసిన పిస్టల్‌ను పోలీసులకు భగత్ సింగ్ సరెండర్ చేశారు.
ఇద్దరిని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు. భగత్ సింగ్‌ను ప్రధాన పోలీస్ స్టేషన్‌కు బటుకేశ్వర్ దత్తాను చాందినీ చౌక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిద్దరిని వేర్వేరుగా విచారించి నిజానిజాలు తేల్చాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. అసెంబ్లీలో ఘటనకు గానూ భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్తాలకు జీవిత ఖైదు విధించారు. కానీ, సాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్, రాజ్‌గురూ, సుఖ్‌దేవ్‌లకు ఉరిశిక్ష వేశారు.
లాహోర్‌లో సంతాప నిరసనలు
భగత్ సింగ్‌ను ఉరితీయడానికి కొన్ని రోజుల ముందు వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌కి పండిత్ మదన్ మోహన్ మాలవీయ టెలిగ్రామ్ పంపారు. అందులో భగత్ సింగ్‌కు విధించిన ఉరి శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని డిమాండ్ చేశారు. కానీ, ఈ డిమాండ్‌ను వారు పట్టించుకోలేదు. భగత్ సింగ్‌ను ఉరి తీసిన మరుసటి రోజు లాహోర్ అంతటా ఆందోళనలు జరిగాయి. ఆయన మృతికి సంతాపంగా నీలా గుంబంద్ స్మారకం నుంచి ర్యాలీని చేపట్టారు. మూడు మైళ్ల దూరం సాగిన ఈ ర్యాలీలో వేల మంది హిందు, ముస్లిం, సిక్కులు పాల్గొన్నారు. పురుషులు తమ చేతికి నల్ల పట్టీ ధరించగా మహిళలు నల్లటి చీరలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనార్కలీ బజార్ వద్దకు చేరుకుంది. అప్పుడే ముగ్గురు అమరవీరుల చితాభస్మాన్ని తీసుకొని భగత్ సింగ్ కుటుంబం ఫిరోజ్‌పూర్ నుంచి లాహోర్ చేరుకుందనే ప్రకటన వచ్చింది.
లాహోర్‌కు భగత్ సింగ్ అస్థికలు
మూడు గంటల తర్వాత పూలతో అలంకరించి మూడు శవపేటికలు కూడా ఆ ర్యాలీలో భాగమయ్యాయి. అక్కడున్న ప్రతీ ఒక్కరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ సందర్భంగా ఒక ఉర్దూ పత్రిక ఎడిటర్ మౌలానా జఫర్ అలీ ఒక కవిత చదివారు. భగత్ సింగ్‌ను ఉరి తీసిన జైలులో పనిచేసే వార్డెన్ చరత్ సింగ్ ధీమ్ తన గది వైపు నడుచుకుంటూ వెళ్తూ వెక్కి వెక్కి ఏడ్చారు. తన 30 ఏళ్ల కెరీర్‌లో ఆయన చాలా మందిని ఉరి తీయడం చూశారు. కానీ, ఎవరూ కూడా భగత్ సింగ్, ఆయన స్నేహితులు ఎదుర్కొన్నంత ధైర్యంగా చావును ఎవరూ స్వీకరించలేదు. భగత్ సింగ్ మరణించిన 16 ఏళ్ల 4 నెలల 23 రోజుల తర్వాత భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది.