Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేప చెట్లకు వింత వ్యాధి, ఎండాకాలంలో వేప చెట్టు నీడ ఉండదా? 10 ప్రశ్నలు

వేప చెట్లకు వింత వ్యాధి, ఎండాకాలంలో వేప చెట్టు నీడ ఉండదా? 10 ప్రశ్నలు
, శనివారం, 19 ఫిబ్రవరి 2022 (14:51 IST)
రాయలసీమ, తెలంగాణల్లోని కొన్ని ప్రాంతాల్లో వేప చెట్లకు వింత వ్యాధి సోకుతోంది. వేప చెట్లు మాడిపోయినట్టుగా అయిపోతున్నాయి. ఈ వ్యాధి ఆందోళనకరంగా వ్యాపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చిందనీ, వేప చెట్లే అంతరించిపోతాయంటూ చర్చలూ సాగాయి. ఇంతకీ ఈ వ్యాధి ఏంటి? దాని వల్ల వచ్చే నష్టాంలేంటి అనే అంశంపై బీబీ ప్రశ్నలకు, వృక్ష శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బి సదాశివయ్య సమాధానం ఇచ్చారు.

 
1.ఈ కొత్త వ్యాధితో వేప చెట్లు అంతరించిపోతాయా?
లేదు. వేప జాతి అంతరించదు. కానీ వ్యాధి తీవ్రత వల్ల కొన్ని చెట్లు చనిపోవచ్చు.

 
2.ఈ వ్యాధి ఎందుకు వస్తుంది?
ఫామాప్సిస్ అజాడిరక్టా అనే ఒకరకమైన ఫంగస్ (శిలీంధ్రం) వల్ల వస్తుంది. ఈ జబ్బు వచ్చాక చెట్టు ఆకులు, చిగుళ్లు, కొమ్మల నుంచి ఎండిపోయినట్టుగా ముదురు ఇటుక రంగులో ఉంటూ కిందకు పాకుతుంది. అందుకే దీన్ని డై బ్యాక్ డిసీజ్ అంటారు. ఇది శిలీంధ్రం వల్లే వస్తుంది కానీ, మస్కిటో డీ బగ్ అనే ఒక రకమైన కీటకం కాటు వేసిన చోట, శిలీంధ్రం వ్యాపిస్తుంది. ఇంకొన్ని శిలీంధ్రాలు కూడా వ్యాపిస్తున్నప్పటికీ, ఫామాప్సిస్ అజాడిరక్టా కీలకం. 1980లలో ఉత్తరాఖండ్ లో దీన్ని గుర్తించారు. ఇది వర్షాకాలం ప్రారంభంలో పెరుగుతుంది. ఆగస్టులో పెరిగి అక్టోబర్ నవంబర్ లో బాగా ఎక్కువ అవుతుంది. ఎండలు ప్రారంభం అయ్యాక తగ్గుతుంది.

 
3.ఎలా వ్యాపిస్తుంది?
ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. శిలీంధ్ర రేణువులు గాలి ద్వారా వ్యాపిస్తాయి. అలాగే ఒక చెట్టుపై వాలిన కీటకాలు మరో చెట్టుపై వాలినా వస్తుంది. వర్షపు నీరు ఒక చెట్టు నుంచి జారి మరో చెట్టపై పడినప్పుడు కూడా వస్తుంది. చెట్టు పెద్దదా చిన్నదా, వయసు ఎంత అనే దాంతో నిమిత్తం లేకుండా వ్యాపిస్తుంది.

 
4.ఈ వ్యాధి రావడం ఇదే మొదటిసారా?
2007, 2008 ప్రాంతాల్లో కర్నూలు, అనంతపురం, తమిళనాడు, కర్ణాటకల్లో బాగా వ్యాపించింది. ఆ తరువాత 2018 ప్రాంతంలో వనపర్తి, గద్వాల ప్రాంతాల్లో బాగా వచ్చింది. ఇప్పుడు మళ్లీ విస్తరిస్తోంది. ఈ వ్యాధి ఒకసారి వచ్చిన చెట్టుకు కూడా మళ్లీ మళ్లీ సోకే అవకాశం ఉంది.

 
5.వ్యాధి వచ్చిన చెట్టు చనిపోతాయా?
చిన్న చెట్లు అంటే ఏడాది లేదా రెండేళ్ల వయసున్న చెట్లు చనిపోయే అవకాశాలు ఎక్కువ. వాటికీ వైద్యం చేసి బతికించవచ్చు. పెద్ద చెట్లకు ప్రమాదం కాస్త తక్కువ.

 
6.వేప అంటే ఔషధం అనుకుంటాం కదా, మరి వేపకూ జబ్బులు వస్తాయా?
వేప చెట్టుకు దాదాపు 20-25 రకాల జబ్బులు వస్తాయి. కాకపోతే అవి ఎక్కువ ప్రభావం చూపవు. దీంతో వాటిని పెద్ద పట్టించుకోరు. తాజా శిలీంధ్ర వ్యాధి కూడా కేవలం వేప చెట్లకే వస్తుంది.

 
7.ఆ జబ్బు వచ్చిన చెట్టు పుల్లలతో పండ్లు తోముకోవచ్చా?
జబ్బు చేసినంత మేరకు కొమ్మ/పుల్ల విరిచేసి మిగిలిన భాగాన్ని వాడుకోవచ్చు. ఆ శిలీంధ్రం వల్ల మనిషికి ఏ ఇబ్బందీ ఉండదు.

 
8.ఈ వ్యాధిని నివారించడం ఎలా?
వ్యాధి సోకిన భాగాలపై గోరింతాకు (మైదాకు) పూత పూయడం, లేదా గోరింతాకు నీరు పిచికారీ చేయడం ద్వారా తగ్గుతుంది. మోనో క్రోటోఫాస్, బాబిస్టీన్ అనే పంగిసైడ్ కూడా వాడవచ్చు. చిన్న చెట్లు అయితే జబ్బు వచ్చినంత మేర కొమ్మలు కత్తిరించి కాల్చేయాలి. అలాగే జబ్బు వచ్చిన చెట్లకు వీలైనన్ని నీళ్లు ఇవ్వాలి. ఎక్కువ నీరు పెడితే తొందరగా కోలుకుంటుంది. చెట్టు ఎండిపోయింది అని కొట్టేయకూడదు. అయితే పెద్ద చెట్లకు పురుగు మందులు పిచికారీ చేసే క్రమంలో ఆ మందు ఇతర చెట్లు, జీవులపై పడి సీతాకోకచిలుకల వంటి కీటకాలు చనిపోయే ప్రమాదం ఉంది.

 
9.ఈ వ్యాధి వస్తే వేప చెట్లకు నష్టం ఏంటి?
వేప పూత తగ్గుతుంది. దాంతో కాయ తగ్గుతుంది. ఒక్కోసారి చనిపోవచ్చు.

 
10.ప్రభుత్వం ఏమైనా చేస్తుందా?
దీనిపై వ్యవసాయ శాఖ స్పందించాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తతో గొడవపడి ప్రియుడితో వచ్చేసిన వివాహిత, గంజాయి బిజినెస్ పెట్టి....