Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పాకిస్తాన్ నుంచి ఎవరైనా కశ్మీర్‌కు వెళ్ళి జిహాద్ చేస్తే కశ్మీరీలే నష్టపోతారు' - ఇమ్రాన్ ఖాన్

Advertiesment
'పాకిస్తాన్ నుంచి ఎవరైనా కశ్మీర్‌కు వెళ్ళి జిహాద్ చేస్తే కశ్మీరీలే నష్టపోతారు' - ఇమ్రాన్ ఖాన్
, గురువారం, 19 సెప్టెంబరు 2019 (21:24 IST)
కశ్మీర్‌కు వెళ్లి భారత ప్రభుత్వంపై పోరాడాలనుకునే పాకిస్తానీల వల్ల కశ్మీరీలకే నష్టం జరుగుతుందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ ఓ సాకు కోసం చూస్తోందని, పాకిస్తానీలు అక్కడికి వెళ్తే వారికది దొరికినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ పాత్రికేయ సమావేశంలో ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 
''పాకిస్తాన్ నుంచి ఎవరైనా కశ్మీర్‌కు వెళ్లి జీహాద్ చేయాలనుకుంటే ముందుగా నష్టపోయేది కశ్మీరీలే. భారత ప్రభుత్వం అక్కడ తొమ్మిది లక్షల మంది సైనికులను మోహరించింది. పాకిస్తానీలు అక్కడికి వెళ్తే.. కశ్మీరీలు తమ వైపే ఉన్నారని, పొరుగుదేశం నుంచి ఉగ్రవాదులు వస్తున్నారని సాకు చూపించి భారత్ అక్రమాలకు దిగుతుంది'' అని ఇమ్రాన్ అన్నారు.

 
''పాకిస్తాన్ ఉగ్రవాదులను పంపుతుందని చెబుతూ భారత్ ప్రపంచం దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తుంది. అందరి చూపు మనవైపు మళ్లుతుంది. భారత్‌పై ప్రస్తుతం ఒత్తిడి పెరుగుతోంది. ఇక్కడి వాళ్లు ఏం చేసినా.. పాకిస్తాన్‌తోపాటు కశ్మీర్‌కు శత్రువులవుతారు'' అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ విషయంలో భారత్ తీరును ఐరాస వేదికగా గట్టిగా ఎండగడతామని ఆయన అన్నారు.

 
''భారత్‌ ఇప్పుడు ఓ రాజకీయ వర్గం ఆక్రమణలో ఉంది. వారి విధానమే ద్వేషపూరితం. పాలన సాధారణంగా లేదు. కశ్మీర్‌లో కర్ఫ్యూ తొలగించకుండా వాళ్లేమీ చేయలేరు. ఆర్టికల్ 370ని కూడా పునరుద్ధరించాల్సి ఉంటుంది. నేను ఐరాస సర్వసభ్య సమావేశంలో మాట్లాడేందుకు వెళ్తున్నా. అక్కడ కశ్మీర్ అంశంపై మునుపెన్నడూ లేని రీతిలో గళం వినిపిస్తానని దేశానికి మాటిస్తున్నా'' అని ఇమ్రాన్ చెప్పారు.

 
పాకిస్తాన్‌లో హిందువులపై ఇటీవల జరిగిన దాడుల గురించి కూడా ఇమ్రాన్ స్పందించారు. ''సింధ్‌లోని ఘోట్కీలో హిందూ వర్గానికి వ్యతిరేకంగా జరిగిన చర్యలను ఖండిస్తున్నా. దీని వెనుక కుట్ర ఉంది. ఐరాస సర్వసభ్య సమావేశంలో నేను మాట్లాడనున్న నేపథ్యంలో కావాలనే వీటిని చేశారు. మన రాజ్యాంగం అందరినీ సమానంగా చూస్తుంది. ఇస్లాం కూడా ఇలాంటివాటిని అనుమతించదు'' అని అన్నారు. అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్లకు, అమెరికాకు మధ్య శాంతి చర్చలు నిలిచిపోవడంపై ఇమ్రాన్ విచారం వ్యక్తం చేశారు.

 
''ఈ చర్చల్లో పాకిస్తాన్ పాల్గొనలేదు. వార్తల ద్వారానే మనకు ఈ విషయం తెలిసింది. చర్చలు ఆగిపోతాయని తెలిసుంటే, ఇంకా గట్టిగా ప్రయత్నించేవాళ్లం'' అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో సోమవారం తాను భేటీ అవుతున్నానని, శాంతి చర్చల కోసం పూర్తి ప్రయత్నాలు చేస్తానని ఇమ్రాన్ చెప్పారు. పాకిస్తాన్‌లోని ప్రతిపక్ష పార్టీలు బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.

 
''ప్రతిపక్షాల గొంతు వినిపించని సమాజంలో ప్రజాస్వామ్యం సరిగ్గా నడవదు. నేషనల్ అసెంబ్లీలో కశ్మీర్‌పై ఉమ్మడి సమావేశానికి పిలిస్తే బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. జైలుశిక్ష అనుభవిస్తున్న ప్రతిపక్ష నేతలిద్దరినీ బయటకు తీసుకురావాలని, ముషారఫ్‌కు ఇచ్చినట్లు ఎన్ఆర్ఓ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ నాయకులు దేశాన్ని కొల్లగొట్టారు. ఒత్తిడి తెచ్చినంత మాత్రాన క్షమించేది లేదు'' అని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ఇమ్రాన్ రెండు రోజుల పర్యటన కోసం సౌదీకి గురువారం పయనమవుతున్నారు. అనంతరం అమెరికాకు వెళ్లి, ఐరాస సర్వసభ్య సమావేశంలో మాట్లాడతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ యువ జంట, పోలీసు జీపులో ఎక్కిస్తే మన్మథుడు 2 సీన్ చూపించారు...