పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సులో నిమ్రితా కుమారి అనే హిందూ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించారు. షహీద్ బెనజీర్ భుట్టో మెడికల్ యూనివర్సిటీ (చండ్కా)లో ఆమె ఫైనల్ ఇయర్ విద్యార్థిని. నిమ్రితాను ఎవరో అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమెకు న్యాయం చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.
ట్విటర్‌లో #JusticeForNimrita అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులు కూడా నిమ్రితాకు న్యాయం జరగాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. ‘‘నిమ్రితా అనుమానాస్పద మరణం చాలా బాధ కలిగించింది. అసలు దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నా. మతంతో సంబంధం లేకుండా ఏ పాకిస్తానీ కోసమైనా నా హృదయం స్పందిస్తుంది’’ అంటూ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశారు.
నిమ్రితాపై అత్యాచారం జరిగిందా, లేదా అన్న విషయంపై పోలీసులు విచారణ జరిపి, వివరాలు వెల్లడించాల్సి ఉందని పాకిస్తాన్‌కు చెందిన పాత్రికేయుడు కపిల్ దేవ్ వెల్లడించారు. కాలేజ్ హాస్టల్ గదిలో నిమ్రితా మంగళవారం ప్రాణాలు లేకుండా కనిపించినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. నిమ్రితా ఎంతటికీ తలుపులు తీయకపోవడంతో, ఆమె స్నేహితులు హాస్టల్ వాచ్‌మెన్‌ను పిలిచారని 'ద ట్రిబ్యూన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొంది.
వాచ్‌మెన్ తలుపులు పగలగొట్టి చూసేసరికి నిమ్రితా మంచంపై పడి ఉన్నారని, ఆమె గొంతుకు తాడు బిగుసుకుని ఉందని తెలిపింది. ఈ కేసు గురించి లర్కానాలోని రహ్మత్‌పుర్ ఎస్‌హెచ్‌ఓ అసదుల్లాతో బీబీసీ ప్రతినిధి శుమాయిల్ జాఫ్రీ మాట్లాడారు. నిమ్రితా మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తైందని, నివేదిక రావడానికి కొంత సమయం పడుతుందని అసదుల్లా చెప్పారు.
''దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి బృందం ఏర్పాటు చేశాం. నిమ్రితా ఫోన్‌ను ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగించాం. ఆమె గది తలుపులకు లోపలి నుంచే గడియ పెట్టుంది. ఆమె గొంతుకు నాలుగు వైపులా గుర్తులు ఉన్నాయి. గదికి భద్రతాసిబ్బందితో కాపలా ఏర్పాటు చేశాం'' అని వివరించారు.
నిమ్రితాది ఆత్మహత్యా లేక హత్యా అన్నది ఇప్పుడే చెప్పలేమని పోలీసులు అంటున్నట్లు పాక్ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ''నిమ్రితాది హత్యేనని ఆమె సోదరుడు డాక్టర్ విశాల్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లైంగిక వేధింపులు, బెదిరింపులకు ఆమె గురై ఉండొచ్చని ఆయన అంటున్నారు'' అని పాక్ పాత్రికేయుడు కపిల్‌దేవ్ ట్వీట్ చేశారు.
‘‘చాలా భయంగా ఉంది. అంతేసి ఫీజులు కడుతున్నా యూనివర్సిటీల్లో భద్రత లేదు. జైళ్లలాంటి హాస్టళ్లలో ఉండి ఏం లాభం? సమాజంలోని కామానికి బలి కావాలనే తల్లిదండ్రులు మమ్మల్ని పెంచుతున్నారా?’’ అని మెహ్‌విశ్ అనే ట్విటర్ యూజర్ ప్రశ్నించారు. ‘‘కాలేజ్‌లో నిమ్రితా నా సీనియర్. ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవారు. ఆమెది ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కాదు. ఈ కేసుపై సరైన విచారణ జరగాలి’’ అని సైఫ్ ఉర్ రెహమాన్ అనే వ్యక్తి ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
''మరొక రోజు.. మరొక దుర్ఘటన. మెడికల్ కాలేజ్ భద్రత సిబ్బంది హత్య జరిగిందని చెప్పారు. ఇప్పటివరకూ ఆ విద్యా సంస్థ నుంచి ఏ ప్రకటనా లేదు'' అని అలీజా అన్సారీ అనే మహిళ ట్వీట్ చేశారు. ''సింధ్ లోలోపలి ప్రాంతాల్లో అసలేం జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ ఈ యువతికి న్యాయం జరిగేలా చేయండి'' అంటూ బుశ్రా బియా అనే వ్యక్తి ట్విటర్ వేదికగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అభ్యర్థించారు.