కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులకు ప్రభుత్వమే కారణమని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ... ''ఏమిటీ కుంచిత మనస్తత్వం? కోడెల మరణంతో ప్రభుత్వ వేధింపులు ప్రజల దృష్టికి వెళ్ళేటప్పటికి కొడుకే కోడెలను హత్య చేసారని కేసు పెట్టించారు. అతను విదేశాల్లో ఉండబట్టి సరిపోయింది కానీ లేదంటే అన్యాయంగా అతని మీద హత్యా నేరం మోపేవాళ్ళు కదా? ఏంటీ క్రిమినల్ మెంటాలిటీ?
తెదేపా పథకాలను రద్దు చేసారు. మేము చేపట్టిన ప్రాజెక్టులను ఆపేసారు. మా పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇది చాలదన్నట్టు మా ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా నాలుగు నెలలుగా పక్కన పెట్టింది ప్రభుత్వం. వాళ్ళు చేసిన తప్పేంటి?
ఒకవైపు కోడెల అంత్యక్రియలపై ఆంక్షలు పెట్టి, మరోవైపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటున్నారు. ఇదంతా తమ దుశ్చర్యలను కప్పిపుచ్చుకోడానికే. వీళ్ళు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలకు ఈ ప్రభుత్వ నిజస్వరూపం తెలిసింది.
కోడెలను కడసారి చూసుకోడానికి కూడా వీలు లేకుండా ఆయన అభిమానులను ఇబ్బంది పెట్టడానికి నరసరావుపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ పెట్టింది ప్రభుత్వం. అంతేకాదు 30 పోలీస్ యాక్ట్‌ను కూడా అమలుచేస్తున్నారు.
పల్నాటి పులి అని పిలువబడ్డ ఒక సీనియర్ రాజకీయ నేతకే ఇలాంటి పరిస్థితి తెచ్చారంటే ఇలాంటి ఉన్మాదంతో కూడుకున్న పాలనలో రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఎంతమందిని చంపుకుంటూ పోతారు? కోడెల తప్పు చేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారు. ఈ ప్రభుత్వ హత్యమీద సీబీఐ విచారణ జరగాలి." అని డిమాండ్ చేశారు.