Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహమ్మద్ సిరాజ్: ఆసియా కప్‌ ఫైనల్‌లో చెలరేగి ఆడిన ఈ 'హైదరాబాదీ గల్లీ క్రికెటర్' జర్నీ ఎలా సాగిందంటే..

Advertiesment
Siraj
, సోమవారం, 18 సెప్టెంబరు 2023 (15:28 IST)
ఆసియా కప్-2023 ఫైనల్లో మహమ్మద్ సిరాజ్ ప్రదర్శన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టును ముప్పుతిప్పలు పెట్టాడు సిరాజ్. లంక బ్యాటర్లు సిరాజ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకున్నారు. తన రెండో ఓవర్లలో ఏకంగా నలుగురు బ్యాటర్లను ఔట్ చేసి, శ్రీలంకను కోలుకోలేని దెబ్బ తీశాడు. అనంతరం మరో నాలుగు ఓవర్లు వేసి లంక కెప్టెన్‌తో సహా, ప్రధాన బ్యాటర్లను పెవిలియన్ పంపాడు ఇండియన్ ఫాస్ట్ బౌలర్ సిరాజ్.
 
కేవలం 7 ఓవర్లలోనే 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. సిరాజ్ ప్రదర్శనతో టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో విక్టరీ అలవోకగా మారింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ప్రదర్శన భారత అభిమానులను అలరించింది. పలువురు అభిమానులు మహమ్మద్ సిరాజ్ పాత రోజులను గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. 'నో మోర్ సిరాజ్ ఇన్ ఇండియన్ టీం' శీర్షికన అప్పట్లో ప్రచురితమైన ఓ కథనాన్ని ఉటంకిస్తూ 'వాట్ ఏ కమ్ బ్యాక్', 'పెద్ద విజయమే అత్యుత్తమ ప్రతీకారం' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సిరాజ్ గత కొన్నేళ్లుగా బౌలింగ్‌లో రాటుదేలుతూ వస్తున్నాడు.
 
గాయం కారణంగా టీమిండియా ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఏడాది కాలంగా జట్టుకు దూరమవడంతో సిరాజ్ పేస్ భారాన్ని మోశాడు. ఓ రకంగా బుమ్రా లోటును భర్తీ చేశాడనే చెప్పాలి. ‘సిరాజ్ గత కొంతకాలంగా క్రమం తప్పకుండా జట్టుతో ఉన్నాడు. ఇప్పటివరకూ బుమ్రా, షమీ పేస్ అటాక్‌ భారాన్ని మోస్తుండగా.. సిరాజ్ డిఫెన్స్ పాత్ర పోషించాడు. అయితే, ఇక్కడ అతడికి బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కింది. సిరాజ్ దాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నాడు. ఈ స్థాయిలో అత్యుత్తమ బౌలర్‌గా మారుతున్నాడు’ అని ఈ ఏడాది వెస్టిండీస్ టూర్ సందర్భంగా జియో సినిమాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ తెలిపాడు.
 
బాల్యం పూల బాటేం కాదు..
అయితే, అభిమానులు మియాన్‌గా పిలచుకునే మహమ్మద్ సిరాజ్ బాల్యం పూలబాటేం కాదు. పేద‌రికం వెక్కిరించినా వెన‌క్కి త‌గ్గ‌లేదు. పట్టుద‌ల‌తో క‌ఠోర శ్ర‌మించాడు. తండ్రి ప్రోత్సాహంతో ముందుకు సాగాడు. 2015లో హైదరాబాద్ జట్టు తరఫున రంజీ అరంగ్రేటం చేసిన సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత నేరుగా ఐపీఎల్‌‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2017‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో 23 ఏళ్ల సిరాజ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.2.6 కోట్లకు కొనుక్కుంది. అప్పటి టీం కోచ్‌ టామ్‌ మూడీ, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ల మార్గనిర్దేశనంలో ఐపీఎల్‌లో ఆడిన సిరాజ్‌ జట్టుపై తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్‌ అనంతరం నేరుగా ఇండియా-ఎ జట్టుకు ఎంపికై సత్తా చాటాడు. అనంతరం భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించి, టీం ప్రధాన బౌలర్ అయ్యాడు. ఎన్నో ఏళ్ల నిరీక్ష‌ణ‌, సాధ‌న‌తో భార‌త జట్టులో చోటు సంపాదించాడు సిరాజ్.
 
బాక్సింగ్ డే టెస్టులో అరంగ్రేటం..
2017లో న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్ కోసం ఇద్దరు కొత్తముఖాలకు చోటు దక్కింది. వారిలో ఒకరు ముంబై ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ కాగా, మరొకరు హైదరాబాద్ లెఫ్టార్మ్ మీడియం పేసర్ మహమ్మద్ సిరాజ్. ఇక 2019లో వ‌న్డే, 2020లో టెస్టుల్లోకి అరంగ్రేటం చేశాడు మియాన్. ఆస్ట్రేలియాపై సిరాజ్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. బాక్సింగ్ డే మ్యాచ్‌గా పిలిచే ఆ మ్యాచ్ 2020 డిసెంబర్ 26న జరిగింది. ఈ టెస్టులో సిరాజ్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిచింది. ఆ తరువాత ప‌రుగులు ఇవ్వ‌డం త‌ప్ప‌.. వికెట్లు తీయడం రాద‌ని విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నాడు సిరాజ్. అయినా వాటిని లెక్క చేయ‌కుండా క‌ఠోర‌శ్ర‌మ‌ను న‌మ్ముకున్నాడు. శ్ర‌మించి క‌చ్చిత‌మైన బౌలింగ్ చేయ‌డంపై ప‌ట్టుసాధించాడు. మంచి పేస‌ర్‌గా మార్కులు సంపాదించాడు. టెస్ట్ క్రికెట్‌లో మంచి ఫామ్ కనబరిచాడు. దీంతో వ‌న్డే క్రికెట్లో మ‌ళ్లీ అవ‌కాశం వ‌చ్చింది. అప్ప‌టి నుంచి వెనుదిరిగి చూడలేదు. బుమ్రా లేని లోటు తీర్చుతూ టీమిండియా ప్రధాన బౌలర్ అయ్యాడు.
 
తండ్రి మరణించినా
ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తున్న వేళ 2020లో ఆసీస్‌తో సిరీస్‌ కోసం టీమిండియా జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు సిరాజ్. అయితే సిరీస్ సమయంలో (నవంబరు)లో అతని తండ్రి మరణించారు. కానీ, సిరాజ్ మాత్రం జట్టుతో పాటు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయారు. అంతేకాదు.. జట్టులోని కీలక బౌలర్లు గాయపడితే తన కంటే తక్కువ అనుభవం ఉన్న మిగతా పేస్ బౌలర్లను ముందుకు నడిపిస్తూ బౌలింగ్ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు.
 
బ్యాటింగ్ నుంచి బౌలింగ్‌కి
1994లో జన్మించిన సిరాజ్‌కు క్రికెట్ అంటే చాలా ఆసక్తి అయినా, ఏదైనా అకాడెమీలో చేరి ఆట నేర్చుకునే తాహతు లేదు. కారణం.. అతని తండ్రి మహమ్మద్ గౌస్ ఓ ఆటో డ్రైవర్. సంపాదన ఎక్కువ లేదు. తన స్నేహితులకు టెన్నిస్ బాల్‌తో బౌలింగ్ చేస్తూ సిరాజ్ బౌలింగ్ మెలకువలు తెలుసుకున్నాడు. మొదట బ్యాటింగ్‌ అంటే ఇష్టమున్నా, క్రమంగా బౌలింగ్‌పై దృష్టి సారించాడు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ 2015లో హైదరాబాద్ రంజీ టీమ్‌లో చోటు సంపాదించుకున్నాడు. మొదటి సీజన్‌లోనే అద్భుతమైన బౌలింగ్ గణాంకాలతో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. తొమ్మిది మ్యాచ్‌లలో 18.92 సగటుతో 41 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్‌లో అత్యుత్తమ బౌలర్లలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కులాంతర వివాహం చేసుకుందనీ.. సోదిరిని వెంటాడి గొడ్డళ్ళతో నరికి చంపిన సోదరులు