Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారును అడ్డగించి, తుపాకి గురిపెట్టి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు

Advertiesment
కారును అడ్డగించి, తుపాకి గురిపెట్టి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు
, శనివారం, 12 అక్టోబరు 2019 (18:06 IST)
తాను రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ విమానాశ్రయంలో దిగేలోగా, తన బాయ్‌ఫ్రెండ్ సెర్గీ అక్కడ వేచిచూస్తుంటాడని అనస్తాసియా అనుకుంది. కానీ, అతడు రాలేదు. "నాకు చాలా అర్జెంటు పని ఉంది. నేను రాలేకపోతున్నాను. నా ఫ్రెండు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు" అని ఆమెకు మెసేజ్ చేశాడు. అలాగే, ఓ వ్యక్తి కారులో వచ్చి ఆమెను పికప్ చేసుకున్నాడు.

 
మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనగా, ఊహించని షాక్! లోపల ఎవరు ఉన్నారో గుర్తించలేని విధంగా నల్లని అద్దాలున్న ఓ మినీ బస్సు దూసుకొచ్చి వారి కారును అడ్డగించింది. ఆయుధాలు పట్టుకుని, మాస్కులు ధరించిన కొందరు వ్యక్తులు బస్సులోంచి దూకి, కారు డ్రైవర్‌ను పక్కకు లాక్కెళ్లారు. ఆ కారులో ఉన్న అనస్తాసియాకు తుపాకీ గురిపెట్టారు. వారిలో డిటెక్టివ్‌లా ఉన్న ఒక మహిళ... కారు డిక్కీలోంచి ఓ తెల్లని పౌడర్ ప్యాకెట్‌ను బయటకు తీశారు.

 
తుపాకులు పట్టుకుని ఉన్న పురుషులు అనస్తాసియాను చుట్టుముట్టారు. "నిషేధిత పదార్థాలను రవాణా చేస్తున్నట్లుగా మీ మీద అనుమానాలు ఉన్నాయి. అందుకే మిమ్మల్ని పట్టుకున్నాం" అన్నారు. అనస్తాసియా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. "మీరు చెబుతున్నది అంతా అబద్ధం. మీరు అనుకుంటున్నది నేను కాదు" అంటూ ఆమె ఆందోళనగా అన్నారు.

 
"మరి, మీరు కాకపోతే ఇంకెవరు? నాటకాలు ఆడింది ఇక చాలు" అంటూ ఓ వ్యక్తి గట్టిగా అరిచాడు. అలా అరుస్తూనే... అతడు ఒక చిన్న గులాబిరంగు డబ్బాను చూపిస్తూ... "మరి, ఇదేంటి?" అన్నాడు. ''నాకేమీ తెలియదు. వదిలేయండి" అంటూ భయంతో ఆమె వణుకుతోంది. ఉన్నట్టుండి... అతగాడు మోకాలిపై వంగి, ముఖానికి మాస్కు తీసేసి "నన్ను పెళ్లి చేసుకో!" అంటూ బిగ్గరగా అరిచాడు.

 
భిన్నమైన పద్ధతిలో ప్రపోజ్ చేసి అనస్తాసియా మనసు దోచుకోవాలన్న ఆలోచనతో సెర్గీ రోడ్కింగ్ ఆడిన నాటకం అదంతా. ఈ విషయం కారు డ్రైవర్‌కు కూడా ముందే తెలుసు. మాస్కు ధరించిన వారు వచ్చి కారును అడ్డుకోగానే భయపడిపోయినట్లుగా అతడు నటించాడు అంతే.

 
ఖరీదైన ట్రీట్
రష్యాలో ఇలాంటి ప్రాంక్‌ షోల కోసం ఏర్పాట్లు చేసే ప్రత్యేక బృందాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాల్లో నటించేవారు అద్దెకు దొరుకుతారు. ఇలా పోలీసుల పేరుతో వచ్చి నాటకీయంగా ప్రపోజ్‌ చేయాలంటే, ఒక భద్రతా దళం సభ్యుడితో పాటు, అరగంట ఫోటో షూట్‌కు కలిపి కనీసం 700 రూబుల్స్‌ (రూ.770) ఖర్చవుతుంది. ఇక బృందంలో అందరూ భద్రతా సిబ్బందే ఉండాలనుకుంటే 60,000 రూబుల్స్ (సుమారు రూ.66,000) దాకా ఖర్చవుతుంది.

 
తన ప్రేయసి అనస్తాసియా మనసు దోచుకునేందుకు సెర్గీ రోడ్కింగ్ 30,000 రూబుల్స్ (రూ.33,000) ఖర్చు చేశారు. నిజానికి, పూర్తిగా భద్రతా సిబ్బందితో కలిసి ఈ పని చేయాలని ఆయన అనుకున్నారట. అందుకోసం ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్‌ఎస్) అధికారులను కూడా సంప్రదించారు. కానీ, వాళ్లు రాలేదు.

 
దాంతో, వేరే వ్యక్తులకు డబ్బులిచ్చి తీసుకొచ్చారు. ఎంత ఖర్చు అయినా వెనకాడకూడదని నిర్ణయించుకున్నానని సెర్గీ రోడ్కిన్ చెప్పారు. తను 2010లో స్నేహితుల కోసం ఇలాంటి పనులు చేశానని 36 ఏళ్ల సెర్గీ చెప్పారు. ఇలా భిన్నంగా ప్రపోజ్‌ చేయాలకునేవారికి ప్రాంక్ షోలు చేయడాన్నే ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. 'స్పెట్స్‌నాజ్ షో' పేరుతో వ్యాపారం మొదలుపెట్టారు.

 
2014లో తొలి షో నిర్వహించారు. ఆ తర్వాత ఏడాది కాలంలోనే రష్యా వ్యాప్తంగా పలు చోట్ల ఫ్రాంచైజీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 14 ఫ్రాంచైజీలు ఉన్నాయి. అతనికి పోటీదారులు కూడా ఉన్నారు. ఇదంతా నిజమేనేమో? అన్నట్లుగా ఎదుటివారిని నమ్మించేలా నటించేందుకు... ఈ షో నటీనటుల్లో మాజీ పోలీసు అధికారులు, మాజీ సైనిక సిబ్బంది కూడా ఉంటారు. అయితే, ఈ షోలు రోజూ ఉండవు. కాబట్టి, ఇతర పనులు చేసుకుంటూ, అప్పుడప్పుడు ఈ షోలలో నటిస్తుంటారు.

 
మాదకద్రవ్యాల ముఠాను పట్టుకుంటున్నట్లుగా ఉండే షోలను తమ క్లయింట్లలో ఎక్కువ మంది అడుగుతుంటారని సెర్గీ చెప్పారు. అయితే, పోలీసులు కూడా ఇలాంటి ప్రాంక్‌ షోల తరహాలో కొన్నిసార్లు అమాయకులను వేధింపులకు గురిచేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇటీవల, రష్యన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇవాన్ గోలునోవ్ వద్ద మాదక ద్రవ్యాలు దొరికినట్లు పోలీసులు ఆరోపించారు.

 
కానీ, పోలీసులు కావాలనే కుట్రపూరితంగా తనను కేసులో ఇరికించారని సదరు జర్నలిస్టు అన్నారు. దాంతో, తర్వాత సరైన సాక్ష్యాధారాలు లేనందున అతనిపై ఉన్న అభియోగాలను పోలీసులు వెనక్కి తీసుకుని, వెంటనే విడుదల చేశారు. "ఇలాంటి చిలిపి పనులు మంచిది కాదు. ఈ ప్రాంక్ షోల వల్ల పోలీసుల రోజువారీ విధులపై ప్రభావం పడే ప్రమాదం ఉంది" అని మనస్తత్వవేత్త పోలినా సోల్డాటోవా అభిప్రాయపడ్డారు.

 
"అప్పుడు చాలా భయపడ్డాను. అంతకుముందు ఎప్పుడూ నాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదు. సెర్గీ మీద చాలా కోపం వచ్చింది. కానీ, కాసేపటికే ఆ కోపం తగ్గిపోయింది" అని అనస్తాసియా చెప్పారు. ఇలాంటి ప్రాంక్ షోలను అందరూ ఆటపట్టించేవిగా చూడరని, ఇలాంటి చేష్టల కారణంగా బంధాలు తెగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని మానసిక నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స‌భ్య‌స‌మాజం సిగ్గుప‌డేలా క‌ట్టుబాట్లు, న‌ర‌కం అనుభ‌విస్తున్న‌మ‌హిళ‌లు, ఎక్క‌డ?