ఆచారం... సాంప్రదాయం.. ఇవి మన దేశ సంస్కృతిలో ప్రధానంగా వినిపించే మాటలు. ఈ రెండు పదాల మాటున ఎన్నో అమానవీయ సంఘటనలు బహిరంగంగా సాగుతున్నాయి. చంద్ర మండలానికి, ఎవరెస్టు శిఖరాలను మహిళలు అధిరోహిస్తున్నారని సంబరపడే మన సమాజంలోనే స్త్రీ శరీరంలో జరిగే అతి సహజమైన ప్రక్రియను ముట్టు, అంటు అంటూ ఊరికి దూరంగా పంపేస్తున్న సంఘటనలు నేటికీ సాగుతున్నాయి.
ఇంతకీ.. ఆ దురాచారం ఎక్కడ సాగుతోంది...? అనుకుంటున్నారా..? అనంతపురం జిల్లా కేంద్రం నుంచి సుమారు 150 కిలోమీటర్ల మేర దూరంలోని మారుమూల ఉన్న గ్రామం గంతగొల్లహట్టి. రొళ్ల మండలంలోని ఈ గ్రామం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. కేవలం అభివృద్ధి మాత్రం... మన ఆధునిక సమాజానికి వేల కిలో మీటర్ల దూరంలో ఉంది. సాంప్రదాయం, ఆచారం పేరుతో సాగుతున్న అమానవీయ సంఘటనలు చూస్తే మనమూ ఈ సమాజంలోనే బతుకుతున్నామా... అని అనుమానం రాకమానదు.
స్త్రీ శరీరంలో జరిగే అతి సహజమైన ప్రక్రియ నెలసరి. ఇదే ఇక్కడి స్త్రీల పాలిట శాపం.. అది ఇక్కడ ఒక నేరంలా చూస్తారు. అంతేకాదు. ఎక్కడైనా ఒక మహిళ ప్రసవం జరిగితే తమకు వారసుడు పుట్టాడని పండుగ చేసుకుంటారు. కాని ఇదే గ్రామంలో గర్భిణీ మహిళను ప్రసవానికి ముందే ఊరు దాటిస్తారు. రొళ్ల మండలంలోని గంతగొల్లహట్టి గ్రామంలో దాదాపు 120 నివాసాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఊరుగొల్ల, కాడుగొల్ల అనే రెండు కులాలున్నాయి. అందులో కాడుగొల్ల కులంలో ఉన్న ఆచారం నాగరిక ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తోంది.
ఆచారం పేరుతో సాగుతున్న ఈ దురాచారం మహిళలను మానసికంగా, శారీరకంగా తీవ్ర క్షోభకు గురిచేస్తున్నాయి. ఈ ఊరిలో నెలసరి వచ్చిందంటే చాలు మహిళలు గ్రామం దాటాలి. అదే బాలింతలైతే దాదాపు 3 నెలలు ఊరి బయట పొలిమేరలో ఉండాలి. చదువుకుంటున్న ఆడపిల్లలను రజస్వల అయితే ఆ సమయంలో ఆ ఐదు రోజులు ఊరిబయటే ఉంచుతారు. ఊరి బయట ఆ రోజుల్లో నరకం అనుభవిస్తూ గడపాలి. వంట కూడా వాళ్లే చేసుకొని తినాలి. ఊరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో బడి ఉంది.
కానీ నెలసరి సమయంలో బాలికలు ఊరిలోకి వెళ్లకూడదు కాబట్టి, చుట్టూ పొలిమేర మీదుగా 11 కిలోమీటర్లు నడుచుకుంటూ బడికి వెళ్లి రావాలి. వాళ్లతో గ్రామస్థులెవరూ మాట్లాడకూడదు. ఒకవేళ వారితో ఎవరైనా మాట్లాడినా, తాకినా వాళ్లు కూడా ఊరిలోకి రాకూడదు. ఇక వాళ్లు ఉండే నివాసం చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురి కాక తప్పదు. ఊరి బయట దిక్కుమొక్కు లేకుండా ఒక చిన్న గుడిసెలో ఉంటారు. అక్కడ విద్యుత్ సదుపాయం కూడా ఉండదు. రాత్రి-పగలు అనే తేడా లేకుండా చీకట్లోనే కాలం గడపాలి.
నెలలు నిండుతున్నాయనగానే ఆ ఇంటివాళ్లు ఊరి బయట వెదురు బొంగులతో ఒక గుడిసెనో, గుడారాన్నో తయారు చేస్తారు. ప్రసవించగానే ఆ గుడారంలో తల్లీబిడ్డలను వదిలేస్తారు. పసి బిడ్డతో కలిసి ఆ తల్లి ఆ గుడిసెలోనే 3 నెలలు ఉండాల్సిందే. ఇంట్లో అప్పుడే పుట్టిన అరుపులు కేకలతో సందడిగా ఉండాల్సిన సందర్భంలో ఆ మహిళ బిడ్డను వెంట వేసుకుని ఈ నరకంలో ఉండాలి.
ఇక్కడ ఇంకా అసహజం ఏంటంటే... వాళ్లని ఎవరూ తాకకూడదు. పనిలో ఎవరూ సాయం చేయకూడదు. వాళ్లే వండుకోవాలి. బట్టలు ఉతుక్కోవాలి. బిడ్డని చూసుకోవాలి. వారికి ఎవరూ తోడు ఉండకూడదు. తర్వాత గుడికి వెళ్లి పూజ చేశాకే గ్రామంలో అడుగుపెట్టాలి.
ఏంటి ఆ ఆచారం.. ఏంటీ పద్దతి.. మనం ఎక్కడ జీవిస్తున్నాం.. అంటే... ఇది దైవాజ్ఞగా భావించాలని ఊరి పెద్దలు చెబుతారు. అందుకే ఈ కట్టుబాట్లను వారి మాటల్ని ఎదిరించలేక ఎంత కష్టమైనా భరిస్తున్నారు గ్రామంలోని మహిళలు.
ప్రభుత్వమైనా మా బాధను అర్థం చేసుకుని ఇక్కడ సౌకర్యాలు కల్పించాలి అని వారు కోరుతున్నారు. ఇంత దుర్భరమైన పరిస్థితుల ఎదుర్కొంటున్నా ఆచారాలను మాత్రం ప్రశ్నించగలిగిన స్థితిలో వారు లేరు. ఆ సాహసం చేయలేరు. కాకపోతే బయట గడిపే ఆ రోజుల్లో కాస్త కనీస సౌకర్యాలు ఉండేట్టు చూడండని వేడుకుంటున్నారు. తమ ఊరి అమ్మాయిలు, బాలింతలు ఉండేందుకు ప్రభుత్వం గదులు నిర్మించాలని, అందులో కరెంటు, నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. మహిళలు ఈ విషయంలో బాధపడుతున్నా.. తరాల నుంచి కొనసాగుతున్న ఆచారాల మీద నమ్మకంతో తప్పక పాటించాల్సి వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.
అసలు ఈ గ్రామంలోనే ఈ సాంప్రదాయం ఉందా.. అంటే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. ఇక ఈ గ్రామంలోని కొన్ని అంతర్లీనమైన కొన్ని విషయాల్లోకి వెళ్లాలి. కాడుగొల్ల కులస్థులది హిందూ మతం. వీళ్లు ఎత్తప్ప స్వామి, చిక్కన్న స్వామిలను ఎక్కువగా పూజిస్తారు. గంతగొల్లహట్టి గ్రామంలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయ పూజారి ఎప్పుడూ చెప్పులు వేసుకోరు. ఎంతదూరమైనా కాలినడకనే వెళ్తారు కానీ బస్సు, బైకు, కారు ఏవీ ఎక్కరు.
మరోవైపు పాలు, పెరుగు కూడా ఎవరికీ విక్రయించారు. కనీసం కోడి కూతలు అక్కడ వినపడవు. కోడి మాంసాన్ని కూడా ఈ గ్రామస్థులు భుజించారు. జిల్లాలోని రొళ్ల, మడకశిర, గుడిబండ, అమరాపురం, అగలి మండలాల్లో దాదాపు 40 వేల మంది ఉంటారు. రొల్లగల్ల హట్టి, రత్నగిరి గొల్ల హట్టి, నసేపల్లి గొల్ల హట్టి, మదుడి గొల్ల హట్టి, డొక్కలపల్లి గొల్ల హట్టి, కెంకెర గొల్ల హట్టి, జంగమవీర గొల్ల హట్టి గ్రామాల్లో గొల్లలు ఎక్కువగా ఉన్నారు. ప్రధాన వృత్తి గొర్రెల పెంపకం. మగవాళ్లు ఏడాదిలో 5 నెలలు మాత్రమే గ్రామంలో ఉంటారు.
మిగతా 7 నెలలు స్థానికంగా గొర్రెలకు మేత దొరక్క కర్ణాటక వెళ్తారు. దాదాపు ఈ కులస్థులంతా అంటు, ముట్టు అనే దురాచారం పాటిస్తారని చెబుతున్నారు. ఇది ఈనాటి కథ కాదు... ఎప్పుటి నుంచో ఈ అసాంఘిక ఆచారం కొనసాగుతుందో కనీసం ఈ కులస్థులు కూడా చెప్పలేని పరిస్థితి. మరి ఇన్ని రోజుల నుంచి మహిళలు అనుభవిస్తున్న ఈ బాధ బయటి ప్రపంచానికి తెలియదా.. అంటే ఎందుకు తెలియదు.. ఇదే గ్రామాల్లోకి అధికారులు వస్తుంటారు.
అంతెందుకు ఓట్లు వేయించుకునే ప్రజాప్రతినిధులు కూడా వస్తుంటారు. కాని ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు మాత్రం ప్రయత్నించరు. ఎందుకూ అంటే అది వారి ఆచారం, వారి కట్టుబాట్లు అంటారు.
మరి ఊరి బయట గుడిసెల్లో, చిమ్మ చీకట్లో, బాత్రూంలు, నీటి సౌకర్యం కూడా లేకుండా గడపడం కూడా ఆచారామేనా అంటే మాత్రం ఏ అధికారి సమాధానం చెప్పడు. ఏ ప్రజాప్రతినిధి తల పైకి ఎత్తి చెప్పలేడు. ఎంతో సున్నితమైన ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలకే ప్రభుత్వాలు ధైర్యంగా పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నప్పుడు... కేవలం అంధ విశ్వాసంతో పాటిస్తున్న ఈ దురాచారాలను రూపుమాపలేమా? అధికారులు.. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.