Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వు ఆడదానివి కాదా... నీకోసం ఎవరూ బ్యాంకులో డబ్బులు వేయలేరా అని...

Advertiesment
నువ్వు ఆడదానివి కాదా... నీకోసం ఎవరూ బ్యాంకులో డబ్బులు వేయలేరా అని...
, మంగళవారం, 29 డిశెంబరు 2020 (11:21 IST)
హైదరాబాద్‌కు చెందిన వి. కవిత కరోనా సమయంలో ఒక యాప్ ద్వారా లోన్ తీసుకున్నారు. సమయానికి తీర్చలేకపోయారు. ఉదయం 7 గంటలకే ఆ యాప్ వారు ఫోన్ చేశారు. వేరే పనిలో ఉండి ఒక పది నిమిషాలు ఫోన్ చూసుకోలేదు. వెంటనే రెండవ ఫోన్ కవిత తమ్ముడి భార్య కజిన్‌కి వెళ్లింది. నిజానికి ఆ బంధువుతో ఈమెకు అంత సాన్నిహిత్యం కూడా లేదు. ఫలానా కవిత మీకు తెలుసా అని అడిగారు యాప్ వారు. అవును మా బంధువే అనగానే, ఆమె కొంత అప్పు తీసుకున్నారు. మీ నంబరు ఇచ్చారు. ఆ అప్పు మీరు తీర్చండి. అన్నారు.

 
షాక్ అయిన సదరు బంధువు విషయంలో ఇంట్లో చెబితే, ఇప్పుడు బంధువర్గం అంతా కవితను దూరం పెట్టారు. అప్పు ఇచ్చిన ఒక యాప్ నిర్వాహకులు చేసిన నిర్వాకం ఇది. సిద్ధిపేటకు చెందని కిర్ని మౌనిక ప్రభుత్వ ఉద్యోగి. వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఈ యాప్‌ల ద్వారా లోన్ తీసుకున్నారు. తీర్చడంలో ఆలస్యం అయితే ఆమె ఫోటోలను కాంటాక్టులందరికీ పంపి, ఈమె డబ్బులు తీసుకున్నారు. కనిపిస్తే మా అప్పు కట్టమని చెప్పండి అంటూ వాట్సప్‌లో ఆ అమ్మాయి ఫోటోలతో సహా పంపించారు.

 
చివరకు మౌనిక విషం తీసుకుని చనిపోయింది. ఆమె చనిపోయిన తరువాత ఆ యాప్స్ వారు ఫోన్ చేస్తే, ఇంట్లో వారు ఫోన్ ఎత్తి మౌనిక విషం తాగి చనిపోయిందని చెప్పారు. కానీ వినలేదు. ఆమెనూ, ఇంట్లో వాళ్లనూ వినలేని బూతులు తిట్టారు. ఈ యాప్‌ల వేధింపులు తట్టుకోలేక రామగుండంలో పనిచేసే విశాఖకు చెందిన సంతోష్ ఆత్మహత్య చేసుకున్నారు. తన సమస్య అంతా చెప్పి, తాను పురుగుల మందు తాగే వీడియో పెట్టి చనిపోయారు. అంతకుముందు రాజేంద్ర నగర్‌లో మరో మరణం..

 
మొబైల్ యాప్ లోన్లు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి.
భారీ వడ్డీలు, బెదిరింపులు, బరితెగించిన బూతులు.. కలగలసి, అప్పు తీసుకున్న వారికి శాపంగా మారుతున్నాయి. అత్యవసరానికి ముందూ వెనుకా చూడకుండా అప్పు ఇచ్చి, ఆ తరువాత ఉన్నదంతా గుంజే ప్రయత్నం చేస్తున్నాయి ఈ లోన్ సంస్థలు. ఇవన్నీ వాటికి చిన్న ఉదాహరణలు మాత్రమే. సాధారణంగా తెలిసిన వారు లేదా బ్యాంకుల దగ్గర అప్పు తీసుకోవడం అందరికీ తెలుసు. మొబైల్ ఫోన్ల వాడకం పెరిగిన తరువాత కొందరు వాటి ఆధారంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు.

 
మొబైల్ యాప్‌లో మీ వివరాలు నమోదు చేసుకుంటే అప్పు ఇస్తారు. తరువాత తీర్చాలి. అంతా బానే ఉంది. కానీ అప్పు దొరకడం ఎంత సులువో, తీర్చడం అంత నరకం. పైన చెప్పిన ఉదాహరణలే కాదు. ఎందరో ఇలాటి లోన్లకు ఇబ్బందులు పడి నరకం చూసిన వారు ఉన్నారు. కాస్త చదువుకుని ఫోన్ వాడడం తెలిసి, అత్యవసరాల కోసమని తీసుకుని, తీర్చడంలో ఆలస్యం అయినందుకు వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంతకీ ఈ లోన్లతో వచ్చే సమస్య ఏంటి?

 
కొండలా పెరిగిపోయే వడ్డీ
సాధారణంగా బయట అప్పులు తీసుకుంటే వంద రూపాయలకు నెలకు వడ్డీ రూపాయి, రూపాయిన్నర నుంచి మొదలవుతుంది. కానీ వీరి వడ్డీలకు లెక్క ఉండదు.. పత్రం ఉండదు. వడ్డీ మీద వడ్డీ, రోజుల వడ్డీ, వారం వడ్డీ, అసలుపై జరిమానా, వడ్డీపై జరిమానా పడుతూనే ఉంటుంది. ఎక్కడైనా వడ్డీ నెలకు లెక్కిస్తే ఇక్కడ రోజులు, వారాలు, నెలకు ఇలా అన్ని రకాలుగా లెక్కిస్తారు.

 
ప్రొసెసింగ్ ఫీజు
ఇక బ్యాంకులు, బ్యాంకేతర ఫైనాన్స్ కంపెనీలు అప్పు ఇచ్చేప్పుడు ప్రొసెసింగు ఫీజులు వసూలు చేస్తాయి. అది అప్పును బట్టి ఉంటుంది. ఎంతున్నా ఒక శాతం కూడా ఉండదు. అంటే ఐదు లక్షల అప్పు తీసుకున్నా మహా అయితే 5 వేలు కూడా ఆ చార్జీ ఉండదు. కానీ ఈ లోన్ అలా కాదు. 5 వేల రూపాయల అప్పుకు 4 వేల రూపాయల ప్రొసెసింగ్ చార్జీ తీసుకుంటారు.

 
మరి అయినా జనం ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఎటువంటి ఆదాయ పత్రాలూ అడగకుండా, సిబిల్ స్కోర్ (అప్పలు సరిగా తీరుస్తున్నారా, ఆర్థిక పరిస్థితి బావుందా? అని తేల్చే ప్రమాణం)తో సంబంధం లేకుండా అప్పు ఇస్తున్నాయి కొన్ని యాప్స్. అన్ని ఆదాయ పత్రాలూ చూసి, సిబిల్ స్కోర్ చూసి ఇచ్చి, పద్ధతిగా వసూలు చేసుకునే యాప్స్ కూడా లేకపోలేదు. కానీ వాటికి పదిరెట్లు ఇలాంటి దోపిడీ యాప్స్ కూడా మొబైల్‌లో అందుబాటులోకి వచ్చాయి. సులువుగా, తొందరగా డబ్బు చేతికి వస్తూండడంతో అర్జెంటు ఉన్న వారు వాటిపై ఆధారపడుతున్నారు.

 
జీఎస్టీ పేరుతోనూ
సాధారణంగా అన్ని రకాల సేవలపై ప్రభుత్వానికి జీఎస్టీ (పన్ను) కడతాం. కానీ ఈ యాప్‌లు వాస్తవంగా జీఎస్టీ కింద నమోదు కావు. అప్పు తీసుకునే వారి దగ్గర జీఎస్టీ వసూలు చేస్తారు కానీ, ఆ పన్ను ప్రభుత్వానికి చెల్లించరు. అంటే అసలు జీఎస్టీ పరిధిలో లేకుండా, జీఎస్టీ కింద నమోదు కాకుండా ఆ పేరుతో కూడా వసూలు చేసేస్తారు. నిజంగా జీఎస్టీ వసూలు చేస్తే, వసూలు చేసే వారి జీఎస్టీ నంబరు కూడా చెప్పాలి. కానీ ఈ యాప్స్ అలా చెప్పవు.

 
నకిలీ లీగల్ నోటీసులు
డబ్బు కట్టడం ఆలస్యం అయితే ఫోన్‌కి నకిలీ లీగల్ నోటీసులు వస్తాయి. మీరు కట్టనందుకు త్వరలో మీపై చర్యలు తీసుకుంటాం అనీ, తీసుకుంటున్నాం అనీ, కోర్టుకు రావాలనీ ఇలా ఏవేవో రాస్తారు, అవన్నీ నకిలీవే. అయితే ఇలాంటి నోటీసులనే అప్పు తీసుకున్న వారి బంధుమిత్రులకు కూడా పంపుతారు. దాంతో అవగాహన లేని వారు బాగా భయపడతారు.

 
వసూలు - పరువు
ఈ యాప్స్ వారు లోన్ ఇచ్చిన తరువాత వారు చెప్పిన గడవులో తిరిగి తీర్చాలి. లేకపోతే గడవు రోజు ఉదయం 7 గంటల నుంచే నిరంతరం అంటే పదుల సంఖ్యలో ఫోన్లు చేస్తారు. బెదిరింపుగా మాట్లాడతారు. ఒకవేళ పొరబాటున గడవు ఒక రోజు దాటిందా? అంతే సంగతులు. బూతులు తిడతారు. అడుక్కుతెచ్చుకో కానీ డబ్బు కట్టు అంటూ తిట్లందుకుంటారు.

 
ఇదంతా మొదటి దశ. రెండో దశలో బంధువులకు ఫోన్లు చేస్తారు. ఫలానా వారు మిమ్మల్ని రిఫరెన్సుగా పెట్టారు, డబ్బు కట్టండని వారిని బెదిరిస్తారు. దీంతో ఆ బంధువులకూ, ఈ అప్పు తీసుకున్నవారికి ఉన్న సంబంధాలు చెడిపోతాయి. అలా చాలా మందికి చేస్తారు. చివరగా అప్పు తీసుకునేప్పుడు ఇచ్చిన ఫోటోలను వాట్సప్ గ్రూపుల్లో పెడతారు. అప్పు తీసుకున్న వారి స్నేహితులు, బంధువుల నంబర్లతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి, అందులో తీసుకున్న వారి ఫోటో పేరు పెట్టి, ఫలానా వారు దొంగ అనో, డబ్బు ఎగ్గొట్టే వారనో పోస్టులు పెడతారు.

 
అంతేకాదు. మీరంతా తలకు వంద రూపాయల చొప్పున చందా వేసుకుని వారి అప్పు తీర్చండంటూ పరువు తీస్తారు. ''మేం అప్పు తీర్చం అనడం లేదు. నేను చిన్న వ్యాపారిని. కరోనా సమయంలో తప్పక లోన్ తీసుకున్నా. కనీసం డబ్బు కట్టడానికి బ్యాంకుకు వెళ్లడానికి గంట సమయం పడుతుంది అన్నా వినరు. నువ్వు ఆడదానివి కాదా? నీకు పిల్లల్లేరా? నీకోసం ఎవరూ బ్యాంకులో డబ్బులు వేయలేరా? అని అడుగుతారు వారు. చాలా అసభ్యంగా బూతులు మాట్లాడతారు'' అని చెప్పారు కవిత.

 
నంబర్లు ఎలా దొరుకుతాయి?
ప్రతీ స్మార్ట్ ఫోన్లోనూ కొత్తగా ఏదైనా యాప్ వేస్తే ఆ యాప్ కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. సాధారణంగా కొత్త యాప్ వేసిన వారు టకటకా ఆ పర్మిషన్లన్నీ ఓకే కొట్టేస్తారు. ఆ యాప్ మన ఫోన్లో ఉన్న ఏ ఫోటోలను చూడవచ్చు, తీసుకోవచ్చు అనేది ఆ పర్మిషన్ల సారాంశం. ఇలానే అప్పుతీసుకునే వారు ఆ యాప్ వేసుకున్న వెంటనే తమ ఫోన్లోని కాంటాక్టు నంబర్లు అన్నీ ఆ యాప్ యాజమాన్యం తీసుకునేలా ఒక బటన్ నొక్కుతారు.

 
దీంతో అప్పు తీసుకున్నవారి ఫోన్లోని కాంటాక్టు నంబర్లనీ వారికి చేరిపోతాయి. అసలు ఇలా ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారన్న విషయం అప్పు తీసుకునే వారికి కూడా తెలియదు. ''మా బంధువులకు కాల్ వెళ్లినప్పుడు నేను మొదట ఆశ్చర్యపోయాను. కానీ తరువాత ఆలోచిస్తే అర్థమయింది. యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడే వారు నంబర్లు తీసుకున్నారని. ఇప్పుడు నా కుటుంబం మొత్తం నన్ను దూరం పెడుతోంది'' అంటూ కన్నీరు పెట్టుకున్నారు కవిత. నిజానికి ఈ యాప్‌లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది అన్న విషయంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. అయితే ఫోన్లు చేసి వేధించే కాల్ సెంటర్ల వారిని మాత్రం ఇప్పటికే పోలీసులు ట్రాక్ చేయగలిగారు. ఆ కోణంలో విచారణ సాగుతోంది.

 
అప్పు తీర్చమని అడగడం తప్పా?
అప్పు తీసుకున్నప్పుడు తీర్చాల్సిందే. కానీ తీర్చే విధానాలు, నిబంధనలు పాటించాలి. వడ్డీ లెక్క ప్రకారం ఉండాలి. దేనికి ఎంత చార్జీయో చెప్పాలి. ఆ చార్జీలు పరిమితులకు లోబడి ఉండాలి. తీర్చడానికి గడవు ఇవ్వాలి. కానీ ఈ సంస్థలు ఆ నిబంధనలను ఏమీ పాటించవు. అదే ఇక్కడి సమస్య. ఈ యాప్స్ విషయంలో మరో కోణం కూడా ఉంది. గతంలో కొన్ని యాప్స్ నుంచి సాధారణంగా క్రెడిట్ కార్డు రేటుకు అప్పు తీసుకుని కట్టిన వారూ ఉన్నారు.

 
అయితే ఆ యాప్స్ అంత ఘోరంగా ప్రవర్తించలేదని వాటి నుంచి లోన్ తీసుకున్న ఒక వ్యక్తి చెప్పారు. అయితే వందల సంఖ్యలో ఇలా అప్పులిచ్చే సంస్థలు ఉండగా, అతి కొన్ని మాత్రమే నిబంధనలను పాటిస్తున్నాయి. మిగతవాన్నీ వేధించేవే అని ఒక పోలీసు ఉన్నతాధికారి బీబీసీకి చెప్పారు.

 
చట్టాలు ఏం చెబుతున్నాయి?
దేశంలో బ్యాంకులను నియంత్రించే సంస్థ ఆర్బీఐ కూడా ప్రస్తుతానికి లోన్ యాప్స్ విషయంలో ఎటుంటి నిబంధనలూ రూపొందించలేదు. ఇప్పటికే అమల్లో ఉన్న ఆర్థిక చట్టాలూ, బ్యాంకింగ్ నిబంధనలు, ఐపిసి, ఐటీ చట్టాల ఆధారంగా వాటిపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. తెలంగాణ సైబరాబాద్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో వ్యక్తులను ప్రశ్నించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసులు నమోదు చేశారు. ఇటువంటి కేసులను డీల్ చేయడం కోసం ఒక ప్రత్యేక ఎస్ఓపీ విడుదల చేశారు అక్కడి పోలీసులు.

 
చైనా పాత్ర
ఈ యాప్‌ల విషయంలో చైనా దేశ సంస్థల పాత్ర గురించి ఇంకా స్పష్టత రావాల్సిన ఉంది. టెక్నాలజీ పరంగా చైనా దేశంలోని సర్వర్లను వాడుకోవడం ఒక ఎత్తు, డబ్బు కూడా చైనా ఆర్థిక సంస్థలు ఇస్తున్నాయనేది మరో వాదన. ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. డిసెంబరు 25న సైబారాబాద్ పోలీసులు ఈ యాప్‌లకు సంబంధించిన ఒక చైనా దేశస్థుడు సహా నలుగురిని అరెస్టు చేశారు.

 
కుబెవొ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి హెడ్‌గా చైనా దేశస్థుడితో పాటూ మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు సైబరాబాద్ పోలీసులు డిసెంబరు 25న వెల్లడించారు. దిల్లీ ప్రధాన కేంద్రంగా స్కైలైన్ ఇన్నోవేషన్స్ టెక్నాలజీస్ పేరుతో ఈ సంస్థ నమోదయింది. అందులో జిషియా జాంగ్, ఉమాపతి (అజయ్) అనే వాళ్లు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థ దాదాపు 11 లోన్ యాప్స్‌ను తయారు చేసింది. భారీగా వసూళ్లు చేస్తోంది. ఇక బెదిరింపులు వంటివి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ సంస్థ ప్రతినిధులు పోలీసు కష్టడీలో ఉన్నారు.

 
ఆర్బీఐ ఏం చెబుతోంది?
రిజర్వ్ బ్యాంకు దగ్గర నమోదైన బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), వివిధ రాష్ట్రాల చట్టాల ప్రకారం నడిచే సంస్థలు మాత్రమే ప్రజలకు అప్పు ఇవ్వగలవు. అందువల్ల ఆన్ లైన్, మొబైల్ యాప్‌ల ద్వారా అప్పు ఇస్తోన్న సంస్థ పూర్వాపరాలు పరిశీలించాలి. అనధికారిక యాప్‌లకూ, గుర్తు తెలియని వారికి మీ గుర్తింపు పత్రాలు ఇవ్వకూడదు. ఇటువంటి యాప్‌లపై పోలీసులు లేదా https://sachet.rbi.org.in వెబ్ సైట్ ద్వారా ఆర్బీఐకి గానీ ఫిర్యాదు చేయాలి.

 
ఒకవేళ ఇప్పటికే ఆర్బీఐలో నమోదైన సంస్థలు ఆన్‌లైన్‌లో అప్పు ఇస్తే ఆ విషయం, సదరు సంస్థలు ముందుగానే చెప్పాలి. అలాగే ఆర్బీఐ కింద నమోదయిన సంస్థల పేర్లు ఆర్బీఐ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది రిజర్వు బ్యాంకు.

 
నిపుణులు ఏమంటున్నారు?
''ఫిన్ టెక్ కంపెనీల (ఫైనాన్స్ + టెక్నాలజీ) విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై చర్యలకు ఆర్బీఐ సన్నద్ధం అవుతోంది. తక్షణం అప్పు వస్తుంది కదా అని వాటికి జోలికి వెళ్లడం సరికాదు. ఇప్పుడు ఎంత పరిస్థితి వచ్చింది అంటే కేవలం సంస్థలే కాదు, వ్యక్తులు కూడా గ్రూపుగా ఏర్పడి ఈ యాప్స్ ద్వారా లోన్ ఇస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ లోన్, అంటే మీ దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే, మీరు కూడా లోన్ ఇవ్వొచ్చు.

 
గతంలో క్రెడిట్ కార్డుల కంపెనీలు వచ్చినప్పుడు ఇలాంటి సమస్య ఎదురైంది. అప్పు ఇస్తున్నారు కదా అని తీసుకోవద్దు. నిజంగా మీకు అవసరం ఉంటే నమ్మకమైన బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఆర్బీఐ గుర్తింపు పొందిన ఫైనాన్స్ కంపెనీల నుంచి మాత్రం లోన్ తీసుకోవాలి'' అని బీబీసీతో చెప్పారు ఆర్థిక రంగ నిపుణులు కుందవరపు నాగేంద్ర సాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2021లో బ్యాంకు సెలవులు ఇవే... జనవరిలో 14 రోజుల హాలిడేస్