Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖుష్బూ: ‘మా నాన్న లైంగికంగా వేధించాడని చెబితే, నేను ఆయన పరువు తీశానని విమర్శిస్తున్నారు’

Khushboo
, మంగళవారం, 7 మార్చి 2023 (12:27 IST)
"చిన్నప్పుడు నేను అనుభవించిన లైంగిక వేధింపుల గురించి బయటకు చెప్పాక, నా మనసులో బరువు తొలగిపోయినట్టు అనిపించింది" అన్నారు సినీ నటి ఖుష్బు. ఎనిమిదేళ్ల వయసులో సొంత తండ్రి తనను లైంగికంగా వేధించారని, ఆ వయసులో ఆయనను ఎదిరించే ధైర్యం లేక కుమిలిపోయానని నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ బార్ఖా దత్ నిర్వహించిన ‘వుయ్ ది ఉమెన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పై విషయాలను వెల్లడించారు.
 
ఖుష్బు గత 12 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కిందటి ఏడాది బీజేపీలో చేరారు. ఇటీవలే జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. "అమ్మాయి అయినా, అబ్బాయి అయినా చిన్న వయసులో ఎదుర్కొనే వేధింపులు జీవితాంతం వారిని పీడిస్తాయి. ఎనిమిదేళ్ల వయసులో నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించారు. ఆ వయసులో ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం లేకపోయింది. నేను ఎదురుతిరిగితే, ఆ కోపం మా అమ్మపై, నా ముగ్గురు అన్నయ్యలపై చూపిస్తారని భయమేసేది. అందుకే, అన్నీ మౌనంగా భరించాను" అని చెప్పారు ఖుష్బు.
 
తన తండ్రి భార్యాపిల్లలను కొట్టడం తన జన్మహక్కుగా భావించేవారని, సొంత కూతురిని లైంగికంగా వేధించడం కూడా తనకున్న హక్కుల్లో ఒకటి అనుకునేవారని ఆమె చెప్పారు. "మా అమ్మ మా నాన్న చేతిలో చాలా బాధలు పడ్డారు. ఎప్పుడూ ఆమెను కొడుతుండేవారు. ఆమె అన్నీ భరించేవారు. భర్త మాటకి ఎదురు చెప్పకూడదని ఆమె నమ్మేవారు. ఏది ఏమైనా భర్తే సర్వస్వం అనుకునేవారు." పదిహేనేళ్ల వయసులో తన తండ్రికి ఎదురుతిరిగే ధైర్యం తనకు వచ్చిందని ఖుష్బు చెప్పారు.
 
"మా నాన్నకు ఎదురుతిరిగితే మా అమ్మ, అన్నయ్యలను మరింత కొడతారని భయపడ్డాను. ముఖ్యంగా, మా అమ్మ నా మాట నమ్మకపోవచ్చని సందేహించాను. ఆమె పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మే స్త్రీ. అందుకే నా మాట నమ్మరని అనుకున్నా. కానీ, పదిహేనేళ్లు వచ్చాక ఇక భరించలేక నాన్నకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాను. అలా చేయడం మంచిదైంది. ఒక మహిళగా ఇంట్లో మనిషిని ఎదురించే ధైర్యం వస్తే, ఈ ప్రపంచంలో దేనినైనా సులభంగా ఎదుర్కోగలం" అన్నారామె. ఖుష్బు ఎదురుతిరిగాక, ఆమె తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. మొత్తం కుటుంబం రోడ్డున పడిపోయిందని, క్రమంగా తామే తమ కాళ్లపై నిలబడ్డామని చెప్పారు. ఖుష్బు చెప్పిన విషయాల గురించి, చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల గురించి దేశమంతటా చర్చ ప్రారంభమైంది.
 
ఈ అంశంపై బీబీసీ ఖుష్బుతో మాట్లాడింది. "ఈ విషయాన్ని బయటకు చెప్పాక నా మనసు ఎంతో తేలికపడింది. బరువు దిగిపోయినట్టు అనిపిస్తోంది. చిన్నతనంలో లైంగిక హింస చాలా క్రూరం. అది జీవితాంతం వెంటాడుతుంది. దీని గురించి నేను ఇప్పటికి మాట్లాడాగలిగానంటే, ఆ బాధ నుంచి కోలుకోవడానికి నాకు ఇంత కాలం పట్టిందని అర్థం. చాలా ఏళ్లు ఈ వేదనలోనే గడిచిపోయాయి. అది అనుభవించిన వారికే అర్థమవుతుంది. నేనిలా బహిరంగంగా మాట్లాడడం కొందరికైనా మనోధైర్యాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను.
 
మనకు తెలిసినవారే, పరిచయం ఉన్నవారే 90 శాతం లైంగిక వేధింపులకు పాల్పడతారని డాటా చెబుతోంది. పిల్లలపై, మహిళలపై జరిగే లైంగిక వేధింపుల గురించి నేను చాలా ఏళ్ల నుంచీ గొంతు విప్పి మాట్లాడుతున్నాను. ఆ బాధ, వేదన నేను అనుభవించాను. అందుకే, మరింత గట్టిగా ఈ సమస్యపై గొంతు విప్పుతున్నాను. లైంగిక వేధింపుల గాయాలు మానిపోవచ్చు, మచ్చ జీవితాంతం ఉండిపోతుంది" అన్నారు ఖుష్బు. "మన సమాజంలో ఒక సమస్య ఉంది. ఒక స్త్రీ తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడితే, తిరిగి ఆమెనే అనేక ప్రశ్నలు అడుగుతారు. మిమ్మల్ని వేధించడానికి, మీరేం చేశారు? ఎలాంటి దుస్తులు ధరించారు? మీరెందుకు అక్కడికి వెళ్లారు? మీరు అతనితో ఏం మట్లాడారు? మీరు ఎందుకు నోరు తెరిచారు? లాంటి అసభ్యకరమైన ప్రశ్నలు అడిగి మరింత వేధిస్తారు.
 
పురుషుడిని ఏ మాత్రం తప్పు పట్టరు. మా నాన్న గురించి నేను పంచుకున్న విషయాలపై సోషల్ మీడియాలో నన్ను ప్రశ్నిస్తున్నారు. ఆయన్ను బలిపశువును చేశానని అంటున్నారు. నేను పడ్డ వేదన ఎవరికీ అక్కర్లేదా?" అని ఆమె ప్రశ్నించారు. "ట్విట్టర్‌లో ఒక ప్రొఫెసర్.. 'మీరు మీ నాన్నకు చెడ్డపేరు తీసుకొచ్చారు. ఇప్పుడు సమాజం ఆయన గురించి ఏమనుకుంటుంది? మీ పిల్లలు తమ తాత గురించి తప్పుగా అనుకోరా?' అని నన్ను నిలదీస్తున్నారు. ఇప్పటికీ ఈ సమాజానికి పురుషుడి పరువు గురించే చింత. ఇది చాలా దారుణం. సమాజంలో విద్యావంతులు కూడా ఇలాగే ఉన్నారు. అందుకే ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నాను. లైంగిక వేధింపుల గురించి మాట్లాడటానికి బాధితులెవరూ సిగ్గుపడకూడదు. తప్పు చేసే మగావాడే సిగ్గుపడాలి. అందుకే ఈరోజు నేను నా జీవితంలో చేదు అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడాను" అన్నారామె.
 
తప్పు గురించి, తప్పు చేసిన వారి గురించి నిర్భయంగా బయటకు చెప్పాలని ఖుష్బు అన్నారు. "పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి బయటకు మాట్లాడితే, ఆ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం ఇక్కడ లోతుగా ఉంది. పదిహేనేళ్ల వయసులో నేను ఎదురుతిరిగాను. ఆ తరువాత నేను సొంతంగా కాళ్లపై నిలబడి సమాజంలో గౌరవప్రదమైన జీవితం జీవిస్తున్నాను. మా నాన్నను ఎదురించడం నా జీవితానికి మేలే చేసింది. ఆయన తన తప్పులకు శిక్ష అనుభవించాడు. చివరి రోజుల్లో ఓ అనాథగా మిగిలిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు మా అన్నయ్యలు కూడా చూడ్డానికి వెళ్లలేదు." తల్లిదండ్రులు పిల్లల మాట వినాలని, వారికి అండగా నిలబడాలని ఖుష్బు అన్నారు.
 
"తమ పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యారని తెలిస్తే, తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చి కేసు పెట్టాలి. పోక్సో చట్టం ఉంది. ఈ విషయాలలో సామాజిక సంస్థలు, సోషల్ మీడియా కూడా తోడు నిలుస్తుందని, మద్దతిస్తుందని ఆశిస్తున్నా. ఇన్నేళ్ల తరువాత నాపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడడానికి నాకు ధైర్యం వచ్చింది. నా పిల్లలు నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చారు. నా భర్త నాకు తోడుగా నిలబడ్డారు. కానీ, నాకు లభించిన మద్దతు అందరికీ లభిస్తుందని చెప్పలేం. అయితే, కాలం మారుతోంది. సమాజంలో కొంత మార్పు వస్తోంది. ఇంకా రావాలి" అన్నారు ఖుష్బు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాట్‌జీపీటీ ఎఫెక్ట్‌: ఉద్యోగాలు ఫసక్..?