Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళ: 'నా మీసాలు నా ఇష్టం' అంటూ మీసం మెలేస్తున్న మహిళ

woman mustache
, శనివారం, 23 జులై 2022 (12:20 IST)
కేరళకు చెందిన షిజ నల్లగా మీసాలు పెంచారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూసి కొందరు ప్రశంసించగా, మరికొందరు ఎగతాళి చేశారు. అయితే, పొగిడినా, తిట్టినా తనేం పట్టించుకోనంటున్నారు షిజ. "నా మీసాలంటే నాకు చాలా ఇష్టం" అని 35 ఏళ్ల షిజ వాట్సాప్ స్టేటస్‌లో రాసుకున్నారు. కిందనే మీసాలతో ఉన్న ఫొటో కూడా పెట్టారు. షిజను నేరుగా కలిసినవారు, లేదా ఫేస్‌బుక్‌లో ఆమె ఫొటో చూసినవారంతా 'ఎందుకు మీసాలు పెంచుతున్నారని ' అడుగుతుంటారు.

 
"నాకిష్టం.. చాలా ఇష్టం. ఇంతకుమించి ఇంకేం చెప్పలేను" అంటారామె. కేరళలోని కణ్ణూర్ జిల్లాకు చెందిన షిజ తన పేరుకు ముందు, వెనుక ఇంటి పేరు, తండ్రి లేదా భర్త, కులం పేర్లు ఏవీ పెట్టుకోలేదు. కొంతమంది మహిళలకు ముఖంపై వెంట్రుకలు మొలుస్తాయి. ముఖ్యంగా, పెదాల పైన, గడ్డం మీద, చెంపల పైన దట్టంగా వెంట్రుకలు వస్తాయి. షిజకు కూడా చాలా సంవత్సరాలుగా పెదాల పైన దట్టంగా వెంట్రుకలు మొలిచాయి. ఇలా వెంట్రుకలు ఎక్కువగా మొలిచినవారు థ్రెడింగ్ చేయించుకుంటూ ఉంటారు. కనుబొమలు షేప్ చేసుకున్నట్టే పెదాల పైన వచ్చే సన్నని మీసాలను తొలగించుకుంటారు. షిజ కనుబొమలు థ్రెడింగ్ చేయించుకునేవారు కానీ, పెదాలపై వస్తున్న వెంట్రుకలు తొలగించుకోవాలని ఆమె ఎన్నడూ భావించలేదు. సుమారు అయిదేళ్ల నుంచి కిందటి నుంచి ఆమెకు మీసాలు దట్టంగా పెరగడం ప్రారంభమైంది. వాటిని అలాగే ఉంచుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు

 
'మీసాలతో నేను అందంగా లేనని ఎప్పుడూ అనిపించలేదు'
"ఇప్పుడు మీసాలు లేకుండా నన్ను నేను ఊహించుకోలేను. కోవిడ్ మహమ్మారి మొదలైనప్పుడు, బయటికెళ్లినప్పుడల్లా మాస్కు వేసుకోవడం నాకు నచ్చేది కాదు. ఎందుకంటే, అది నా మీసాలను కప్పేస్తుంది" అన్నారు షిజ. చాలామంది ఆ మీసాలు తీసేసుకోమని సలహాలిచ్చారు. కానీ, షిజ లెక్కచేయలేదు. "నేను అందంగా లేనని నాకెప్పుడూ అనిపించలేదు. ఇలా ఉంటే బావుంటుంది, అలా ఉండకపోతే బావుంటుంది అని నాకెప్పుడూ అనిపించలేదు" అంటారామె. మహిళలకు ముఖంపై వెంట్రుకలు అందాన్ని ఇవ్వవని, వాటిని తొలగించుకోవాలన్నది సమాజంలో ఉన్న భావన. దానికి తగ్గట్టే హెయిర్ రిమూవల్ ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తూ వచ్చింది. వెంట్రుకలు తొలగించుకోవడానికి క్రీములు, వాక్స్ స్ట్రిప్స్, రేజర్లు, ఎపిలాటర్స్ లాంటి ఎన్నో సాధనాలు మార్కెట్లోకి వచ్చాయి. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.

 
అయితే, ఇటీవల కాలంలో మహిళలు ఏటికి ఎదురీదడం ప్రారంభించారు. చాలామంది తమ ముఖ వెంట్రుకల గురించి పట్టించుకోవడం మానేశారు. వాటిని తొలగించుకునే ప్రయాస పడకుండా, తమ శరీరతత్వాన్ని అంగీకరిస్తున్నారు. షిజ లాగ కొందరు వాటిని గర్వంగా చూపిస్తున్నారు కూడా. 2016లో, బాడీ పాజిటివిటీ ప్రచారకర్త హర్నామ్ కౌర్ నిండుగా గడ్డం పెంచిన అతి పిన్న వయస్కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. తనను తాను ప్రేమించుకోవడం నేర్చుకోవాడానికి ముఖ వెంట్రుకలను అంగీకరించడం ఎంతో ముఖ్యమని హర్నామ్ కౌర్ పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు.

 
మీసాలు ఆమెలో ఓ భాగం
షిజకు మీసాలు పెంచడం సమాజానికి సందేశం ఇవ్వడం కాదు. తనలో, తన వ్యక్తిత్వంలో అదీ ఓ భాగం, అంతే. "నాకు నచ్చింది నేను చేస్తాను. నాకు రెండు జన్మలుంటే, అప్పుడు ఇతరుల కోసం జీవిస్తాను" అంటున్నారు షిజ. షిజకు ఈ వైఖరి, ఆత్మవిశ్వాసం రావడానికి కొంత కారణం, ఆమె ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు. ఒక దశాబ్ద కాలంలో ఆమెకు ఆరు సర్జరీలు జరిగాయి. వక్షోజాల్లో గడ్డ, అండాశయంలో తిత్తి (సిస్ట్) తొలగించేందుకు సర్జరీలు చేయాల్సివచ్చింది. అయిదేళ్ల క్రితం ఆమెకు గర్భాశాయం తొలగించారు. అదే ఆమె చేయించుకున్న చివరి సర్జరీ. "సర్జరీ చేయించుకుని ఇంటికి వచ్చిన ప్రతీసారీ అనుకుంటాను, మళ్లీ ఎప్పుడూ ఆపరేషన్ గదిలోకి అడుగుపెట్టకూడదని" అన్నారు షిజ.

 
ఇన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నప్పుడే, ఉన్న ఒక్క జీవితాన్ని తనకు నచ్చినట్టు గడపాలని నిర్ణయించుకున్నారామె. చిన్నప్పుడు తాను చాలా సిగ్గరినని, తమ గ్రామంలో సాయంత్రం ఆరు దాటిన తరువాత మహిళలెవరూ బయటికొచ్చేవారు కాదని ఆమె చెప్పారు. భారతదేశంలో అత్యంత ప్రగతిశీల రాష్ట్రాలలో కేరళ ఒకటి అయినప్పటికీ, ఆ రాష్ట్రంలో పితృస్వామ్య పోకడలు పోలేదు. మహిళలు ఒంటరిగా ప్రయాణించడం లేదా ఒంటరిగా జీవించడం అక్కడ సమ్మతం కాదు. షిజకు పెళ్లయి, భర్తతో పాటు పక్క రాష్ట్రం తమిళనాడుకు వెళ్లిపోయాక ఆమెకు కొత్త స్వేచ్ఛ వచ్చినట్టయింది.

 
"నా భర్త ఆఫీసుకు వెళ్లి సాయంత్రం లేటుగా ఇంటికొస్తారు. సాయంత్రం వేళ నేను ఇంటి గుమ్మంలో కూర్చుని కాలక్షేపం చేస్తుంటాను. లేదా పక్కనే ఉన్న దుకాణానికి నడిచి వెళ్లి కావలసిన సరుకులు తెచ్చుకుంటాను. రాత్రి అయినా, నేను ఒక్కర్తినే దుకాణానికి వెళ్లినా ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. నా సొంతంగా పనులు చేసుకోవడం నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది" అని షిజ చెప్పారు. ఇదే ఆత్మవిశ్వాసాన్ని తన టీనేజీ కూతురికి కూడా అందివ్వాలని ఆమె ప్రయత్నిస్తున్నారు.

 
'మీసాలు ఉంచుకోవాలో, తీసేయాలో అన్నది నా ఇష్టం'
షిజ కుటుంబం, స్నేహితులు ఆమె మీసాలు పెంచడాన్ని అడ్డుకోలేదు. మద్దతుగా నిలిచారు. ‘మా అమ్మకి మీసాలు బావుంటాయి’ అని షిజ కూతురు అంటూ ఉంటుంది. అయితే, వీధిలో నడుస్తున్నప్పుడు పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తారని షిజ చెప్పారు. "మగవాళ్లకే మీసం ఉంటుంది, ఆడవాళ్లకి ఎందుకు ఉంటుంది? అంటూ నవ్వుతారు. ఎగతాళి చేస్తారు" అని ఆమె చెప్పారు. గత కొన్నేళ్లల్లో షిజ చాలాసార్లు స్థానిక వార్తల్లోకెక్కారు. ఈమధ్యే ఒక వార్తా సంస్థ తనపై ప్రచురించిన కథనాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిందని, దానిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగిందని షిజ చెప్పారు. 'కనుబొమలు షేప్ చేయించుకుంటున్నప్పుడు, మీసాలు తీయించుకోడానికేమి?' అని ఒకరు ప్రశ్నించారు.

 
"అది నా ఇష్టం కాదా? నేనేం ఉంచుకోవాలనుకుంటున్నానో, ఏం తీసేయాలనుకుంటున్నానో నా ఇష్టం కదా" అంటున్నారామె. ఇలాంటి కామెంట్లకు షిజ స్నేహితులు గట్టిగా జవాబిస్తుంటారు. కానీ, తాను మాత్రం వాటిని లెక్కచేయనంటున్నారు ఆమె. "కొన్నిసార్లు నవ్వుకోడానికి ఆ కామెంట్లన్నీ చదువుతుంటాను" అన్నారు షిజ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిక్కడపల్లిలో గన్​ఫైర్ ​: వ్యక్తి మృతి