Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాకినాడ: ప్రపంచ బియ్యం ఎగుమతుల హబ్‌గా మారుతోందా?

Advertiesment
కాకినాడ: ప్రపంచ బియ్యం ఎగుమతుల హబ్‌గా మారుతోందా?
, మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:18 IST)
దేశంలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతుండడం వల్ల కలుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యం దిగుబడులు పెరిగిపోతున్న తరుణంలో నిల్వలు పెరగడం ప్రభుత్వాలను కలవరపరుస్తోంది. ఇప్పటికే తెలంగాణా సహా వివిధ రాష్ట్రాల్లో వరి సాగు నియంత్రణ ప్రయత్నాలు మొదలయ్యాయి. రైతులు మాత్రం వరి వేయడం మానుకుని ఇతర పంటల సాగు వైపు ఆసక్తి చూపడం లేదు. దేశంలో ధాన్యం, బియ్యం నిల్వలు పేరుకుపోతున్న ఈ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఎగుమతుల మార్కెట్ విస్తరిస్తోంది.

 
కోవిడ్ తదనంతర పరిణామాల్లో బియ్యం మార్కెట్‌కు ఆశావాహ వాతావరణం ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు. ఈ సమయంలో బియ్యం ఎగుమతులను ప్రోత్సహిస్తే అది అనేక రకాలుగా ప్రయోజనకరంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే బియ్యం ఎగుమతులు పెరిగాయి. ఈ ఎగుమతులకు కాకినాడ పోర్టు ప్రధాన కేంద్రంగా మారుతోంది. దానికి అనుగుణంగా ఇంకా మరికొన్ని మార్పులు చేస్తే కాకినాడ కి ప్రపంచ బియ్యం మార్కెట్లో ప్రత్యేక స్థానం ఖాయమనే అంచనాలు అధికార, వాణిజ్య వర్గాల్లో ఉన్నాయి.

 
కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులకు సుదీర్ఘ చరిత్ర
కాకినాడ నుంచి బియ్యం, ఇతర ఉత్పత్తులను ఎగుమతి చేయడం ఈనాటిది కాదు. కాకినాడ పోర్టు ఏర్పాటు చేయకముందే కోరింగ కేంద్రంగా 150 ఏళ్ల క్రితమే ఓ చిన్న పోర్టు ఉండేది. కాకినాడకు సమీపంలో ఉన్న కోరింగ నుంచి బర్మా సహా వివిధ దేశాలకు ఎగుమతులు జరిగేవి. కాకినాడ తీరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో సహజసిద్ధంగా ఏర్పడిన హోప్ ఐలాండ్ మూలంగా కాకినాడలో ఎగుమతులకు అనుకూలత ఉండేది.

 
తీరానికి, ఐలాండ్‌కి మధ్య ప్రాంతంలో లంగరు వేసి నౌకల్లోకి ఎక్కించడం, దించడం చేసేవారు. దాంతో యాంకరేజ్ పోర్టు ఆవిర్భవించింది. నేటికీ అక్కడి నుంచి బియ్యం ఎగుమతులు చేస్తున్నారు. కాకినాడ తీరం నుంచి బియ్యం బార్జెస్‌లో తీసుకునివెళ్లి, సముద్రంలో లంగరు వేసి ఉన్న నౌకలలో నింపుతారు. తక్కువ మొత్తంలో ఎగుమతులు చేసిన సమయంలో ఇలాంటి ప్రక్రియకు పెద్దగా ఆటంకాలు లేవు. కానీ రానురాను ఎగుమతులు పెరుగుతున్న కొద్దీ ఎగుమతులు, దిగుమతులన్నీ మ్యానువల్ గా చేయడం సమస్యగా మారుతోంది.

 
ఎగుమతుల్లో రెండో స్థానానికి ఇండియా..
వివిధ దేశాలకు చెందిన షిప్పులను కాకినాడ పోర్టుకి తరలించి, వాటిలో బియ్యం నింపి ఆఫ్రికా దేశాలతో పాటుగా బంగ్లాదేశ్, ఇతర తూర్పు ఆసియా దేశాలకు సైతం తరలిస్తూ ఉంటారు. బియ్యం ఎగుమతుల్లో థాయిలాండ్, వియత్నాం వంటి దేశాలతో ఇప్పుడు ఇండియా పోటీ పడుతోంది. దేశంలో కాండ్లా సహా వివిధ పోర్టుల నుంచి బియ్యం ఎగుమతులు సాగుతూ ఉన్నాయి. అందులో ప్రస్తుతం అగ్రస్థానంలో కాకినాడ పోర్టు ఉంది. గత ఏడాది దేశవ్యాప్తంగా 1.47 కోట్ల టన్నుల బియ్యం , నూకలు సహా ఎగుమతి చేయగా కేవలం కాకినాడ నుంచి 20 లక్షల టన్నుల బియ్యం ఎగుమతైంది.

 
ఈ ఏడాది దేశం నుంచి బియ్యం ఎగుమతులు అనూహ్యంగా పెరిగాయి. ఏకంగా 45 శాతం అధికంగా ఆఫ్రికా, ఆసియా దేశాలకు తరలిస్తున్నారు. బాస్మతి బియ్యంతో కలిపి దాదాపుగా 22 లక్షల టన్నులకు ఈసారి ఎగమతులు పెరగవచ్చని భావిస్తున్నారు. తద్వారా బియ్యం ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుతుంది. 2020లో కూడా ఎగుమతుల్లో పురోభివృద్ధి కనిపించింది. అందులో బాస్మతియేతర బియ్యం ఏకంగా 77 శాతం పెరుగుదలతో 97 లక్షల టన్నులకు పెరిగాయి. ఈ ఏడాది నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులు రెట్టింపు కాబోతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 4.85 కోట్ల టన్నుల నాన్ బాస్మతి బియ్యం ఎగుమతుల్లో ఇండియా నుంచి 1.8 కోట్ల టన్నుల ఎగుమతులు ఉంటున్నాయి.

 
లాజిస్టిక్స్ సమస్య..
ఇండియా నుంచి బియ్యం ఎగుమతులకు మరింతగా అవకాశం ఉన్నప్పటికీ లాజిస్టిక్స్ సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. కంటైనర్ల కొరతతో పాటుగా వెసల్స్ మెయింటెన్స్ కూడా ఎగుమతిదారులకు భారం అవుతోందని ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి నివేదించింది. కేవలం యాంకరేజ్ పోర్ట్ నుంచి మాత్రమే ఎగుమతులు జరగడం వల్ల లోడింగ్ సమస్యతో తీవ్ర ఆలస్యం జరుగుతోందని వారు విన్నవించిన నేపథ్యంలో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నుంచి కూడా బియ్యం ఎగుమతులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి లభించింది.

 
దాంతో ఒక్కసారిగా కాకినాడ నుంచి అవకాశాలు మెరుగుకావడంతో దేశీయ ఉత్పత్తుల ఎగుమతికి మార్గం సుగమం అయ్యింది. ఈ ఏడాది కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు 4లక్షల మిలియన్ టన్నులకు పెరిగే అవకాశం ఉందని ఇండియన్ రైస్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీవీ కృష్ణారావు బీబీసీకి తెలిపారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి మాత్రమే ఎగుమతులు చేయాలంటే అది చాలా భారం అవుతోందని, ముఖ్యంగా అద్దెకు తీసుకున్న షిప్పులు పోర్టుకి రావడం, ఇక్కడ ఎగుమతి, దిగుమతుల్లో జాప్యం కారణంగా వాటిని వెయిటింగ్ లో ఉంచాల్సి వస్తోందని , దాని వల్ల అదనపు భారం అవుతోందని ఆయన అన్నారు.

 
టన్ను బియ్యానికి థాయిలాండ్ లో సుమారు 540 యూఎస్ డాలర్లు, వియత్నాంలో 510-515 యూఎస్ డాలర్ల మధ్య ఖరీదు చేయాల్సి వస్తుండగా ఇండియాలో మాత్రం అదే పారాబాయిల్డ్ రకం బియ్యం 402- 408 యూఎస్ డాలర్లకే కొనుగోలు చేసే అవకాశం ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు. కానీ షిప్పులు వెయిటింగ్ మూలంగా రోజుకి అదనంగా సుమారు రూ. 25లక్షలు ఖర్చవుతోంది. దానివల్ల బియ్యం మార్కెట్లో ఇండియాకు అవకాశాలున్నప్పటికీ సకాలంలో షిప్పింగ్ చేయలేకపోవడం పెద్ద సమస్య అవుతోందని కృష్ణారావు అన్నారు.

 
డీప్ వాటర్ పోర్టు నుంచి కూడా బియ్యం ఎగుమతులకు అనుమతిరావడంతో ఈ ఏడాది కనీసంగా 1 మిలియన్ టన్నుల బియ్యం ఈ పోర్టు నుంచి తరలించబోతున్నారు. యాంకరేజ్ పోర్టు తో పాటుగా డీప్ వాటర్ పోర్టు నుంచి కూడా ఎగుమతులు జరగడంతో కాకినాడ తీరం దేశంలోనే బియ్యం ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించేందుకు అవకాశం వస్తోంది.

 
కాకినాడ నుంచి పెరిగిన ఎగుమతులు
2021 ఫిబ్రవరిలో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతులకు అనుమతి ఇచ్చే సమయంలో యాంకరేజ్ పోర్ట్ కార్మిక సంఘాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. షిప్పులను డీప్ వాటర్ పోర్టుకి తరలిస్తే తమ ఉపాధికి సమస్య అవుతుందనే వాదన తీసుకొచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం షిప్పుల వెయింటింగ్ మూలంగా బియ్యం ఎగుమతుల్లో జాప్యం నివారణ కోసం డీప్ వాటర్ పోర్టు నుంచి కూడా అనుమతినిచ్చింది. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో బెర్తులు ఖాళీగా ఉండగా, యాంకరేజ్ పోర్టులో షిప్పులు వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితిని అధిగమించే లక్ష్యంతో కేంద్ర లాజిస్టిక్స్ , వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

 
తాజా నిర్ణయం మూలంగా కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులు రెట్టింపయ్యేందుకు దోహదపడింది. కేవలం యాంకరేజ్ పోర్టు నుంచి మాత్రమే ఎగుమతులు జరిగే సమయంలో 2 మిలియన్ టన్నుల బియ్యం మాత్రమే కాకినాడ నుంచి ఎగుమతి అయ్యింది. కానీ ప్రస్తుతం దానిని రెట్టింపు చేసి 4 మిలియన్ టన్నులకు చేర్చడానికి అవకాశం వచ్చిందని పోర్టు అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామం పరిశ్రమ వర్గాలను సంతృప్తి పరుస్తోంది. ప్రభుత్వం అనుమతిస్తే కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులు ఒక్కసారిగా 6 మిలియన్ టన్నులకు పెరిగే అవకాశం ఉంది. దాని ద్వారా దేశానికి విదేశీ మారకద్రవ్యం వస్తుంది. దేశంలో అనేక చోట్ల నిల్వ ఉండిపోతున్న బియ్యం అంతర్జాతీయ మార్కెట్లో సులువుగా అమ్మకం చేసుకోవచ్చు.

 
‘‘ప్రస్తుతం యూపీ, బిహార్, చత్తీస్‌గఢ్, మహరాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ధాన్యం బియ్యం రూపంలో కాకినాడ నుంచి ఎగుమతి అవుతోంది. దాదాపు 25 దేశాలకు పైగా ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. అంతర్జాతీయంగా కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితులతో బియ్యం మార్కెట్ కి అవకాశాలు పెరిగాయి. మనం ఉపయోగించుకుంటే దేశానికి మేలు జరుగుతుంది’’ అన్నారు రైస్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి జి. బ్రహ్మానందరెడ్డి.

 
అదనపు బెర్తులు నిర్మిస్తాం..
కాకినాడ పోర్ట్ నుంచి బొగ్గు, ఫెర్టిలైజర్, ఎడిబుల్ ఆయిల్, గ్రానైట్, అల్యూమినియం వంటివి ఎక్కువగా ఎగుమతి, దిగుమతులు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం బియ్యం ఎగుమతులు పెరుగుతుండడం వల్ల పోర్ట్ కార్యకలాపాలు మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అదనపు బెర్తులు సైతం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాకినాడ సీ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో ఎం. మురళీధర్ బీబీసీతో అన్నారు.

 
‘‘ భవిష్యత్తులో మరింత సులువుగా బియ్యం ఎగుమతులు బల్క్ గా ఎక్స్ పోర్ట్ చేసేందుకు కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పటికే ఫెర్టిలైజర్, సుగర్ వంటివి అదే పద్ధతిలో జరుగుతున్నాయి. దానివల్ల మరింత వేగంగా కార్యకలాపాలు సాగుతాయి. కాబట్టి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వస్తే మరింత మెకనైజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తాం’’ అని మురళీధర్ అన్నారు.

 
'యాంకరేజ్ పోర్టు కార్మికుల ఉపాధిని కాపాడాలి'
సుదీర్ఘ చరిత్ర కలిగిన కాకినాడ యాంకరేజ్ పోర్టులో ఎగుమతులు, దిగుమతుల ప్రక్రియలో కార్మికులది కీలక పాత్ర. సుమారుగా 2వేల మందికి ఇక్కడ ఉపాధి లభిస్తోంది. బార్జెస్ నిర్వాహకులు కూడా దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎగుమతులు పెరిగినందున తమకు ఆదాయం కూడా పెరిగిందని పోర్టు కార్మికుడు ఎం.రాజు బీబీసీకి తెలిపారు. అయితే డీప్ వాటర్ పోర్ట్ నుంచి కార్యకలాపాలు పెంచుతున్న తరుణంలో తమ ఉపాధికి ఢోకా లేకుండా చూడాలని కోరుతున్నారు.

 
‘‘కరోనా తర్వాత రాబడి పెరిగింది. బార్జెస్ మీద లోడింగ్, అన్ లోడింగ్ కలిపి 10 గంటల వరకూ సమయం పడుతుంది. ఒడ్డున లోడ్ చేసుకుని వెళ్లి, షిప్పు దగ్గర వాటిని ఎక్కిస్తాం. నెలకు రూ. 10వేలకు తగ్గకుండా ఆదాయం వస్తోంది. డీప్ వాటర్ పోర్ట్ కి కొన్ని షిప్పులు మళ్లిస్తున్నారు. భవిష్యత్తులో మాకు ఇబ్బంది రాకుండా చూస్తే మంచిది’’ అని రాజు అభిప్రాయపడ్డారు. పోర్టులో కార్మికుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని షిప్పులను డీప్ వాటర్ పోర్టుకి మళ్లించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోందని స్థానికులు కూడా అభిప్రాయపడుతున్నారు.

 
'సమస్యలు పరిష్కరిస్తాం'
కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి నెలకు 33వేల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. అదే థాయిలాండ్ లో అయితే 11రోజుల్లోనే అదే మొత్తంలో ఎగుమతులు చేసేందుకు అవకాశం ఉంటుంది. దాని వల్ల దేశీయంగా బియ్యం అందుబాటులో ఉన్నప్పటికీ ఎగుమతుల్లో ఆలస్యం మూలంగా ఇండియా వెనుకబడిపోతుందనే నిర్ణయానికి యంత్రాంగం రావడంతో జరిగిన మార్పుల మూలంగా కాకినాడ డీప్ వాటర్ పోర్టు నుంచి ఎక్స్ పోర్ట్స్ వేగవంతమవుతున్నాయి.

 
ఎగుమతులను మరింత పెంచే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కూడా కొన్ని చర్యలు తీసుకుంటోంది. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతులకు ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకోవాల్సి ఉందని, కానీ యాంకరేజ్ పోర్టులో ఉన్న ఒప్పందాల కారణంగా కొంత సమస్య ఏర్పడుతోందని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ జె. లక్ష్మీషా బీబీసీతో అన్నారు.

 
‘‘ కార్మికుల ఉపాధికి ఢోకా లేకుండా, ఎగుమతుల కోసం షిప్పులు వేచి చూడాల్సిన పరిస్థితి రాకుండా సమన్వయం చేస్తున్నాం. దాని ద్వారా ఈకాలంలో కొంత ఫలితం వచ్చింది. భవిష్యత్తులో కాకినాడ నుంచి మరింతగా ఎగుమతులు పెరగడానికి అన్ని అవకాశాలున్నాయి. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రయత్నాలు చేస్తున్నాం. స్థానిక నేతల తోడ్పాటు తీసుకుని కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలన్నీ పరిష్కరిస్తాం’’ అన్నారు లక్ష్మీ షా.

 
కార్మికుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని షిప్పులు మరింత ఎక్కువగా డీప్ వాటర్ పోర్టుకి మళ్లించడం ద్వారా బియ్యం ఎగుమతుల ప్రక్రియ వేగవంతం చేసే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. తమ ఉపాధికి ఢోకా లేకుండా చేయాలని కార్మికులు కోరుతున్న తరుణంలో భవిష్యత్తులో కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులు మరింతగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్రయంబకేశ్వర్‌లో మున్సిపల్ వ్యర్థాలు.. మహారాష్ట్రకు రూ.కోటి అపరాధం