Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌‌లో ఇసుక ఉచితమేనా? ఇతర ఖర్చుల మాటేమిటి? రోజుకు ఎన్ని టన్నులు తీసుకెళ్లొచ్చు, ఏయే పత్రాలు ఉండాలి

Sand

బిబిసి

, శనివారం, 13 జులై 2024 (12:58 IST)
ఆంధ్రప్రదేశ్‌‌లో ఇసుక విధానం మారింది. 2016 నుంచి 2019 వరకు అమలు చేసిన ఇసుక విధానాన్ని మళ్లీ తీసుకొచ్చారు. దీన్ని ‘ఉచిత ఇసుక’ విధానం అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ‘ఉచిత ఇసుక’ విధానం తీసుకొచ్చింది. ఆ తరువాత 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం, పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానం తీసుకొచ్చింది. ఇసుక తవ్వకాలను కాంట్రాక్టర్లకు అప్పగించింది. కాగా, ఇటీవల చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో మరోసారి ‘ఉచిత ఇసుక’ విధానం తీసుకొచ్చారు. కాంట్రాక్ట్ సంస్థలతో ఉన్న పాత ఒప్పందాలు రద్దు చేశారు.
 
ప్రస్తుతం వరదల సీజన్ కావడంతో ఇసుక తవ్వడం కాకుండా స్టాక్ పాయింట్ల వద్ద అందుబాటులో ఉన్న ఇసుకను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది మధ్యంతర విధానం మాత్రమే. కొంతకాలం తరువాత పూర్తి స్థాయి ఇసుక విధానం తీసుకొస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం అమలులోకి వచ్చిన ఇసుక విధానం ప్రకారం గ్రామాలను ఆనుకుని ఉన్న వాగుల్లో ఎడ్లబండి మీద తరలించుకునే వారికి మాత్రమే ఇసుక ఉచితం. ఇది గతంలో కూడా ఉంది. కానీ స్టాక్ పాయింట్లలో ఉన్న నిల్వలు కావాలంటే రవాణాతో పాటు ఇతర ఖర్చులు భరించాలి.
 
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇసుక టన్నుకు రూ.375 చొప్పున చెల్లించాలి. దానికి అదనంగా నిర్వహణ ఖర్చుల కింద మరో రూ.100 వసూలు చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. వాటికి రవాణా ఖర్చులు అదనం. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం ఇసుక కోసం డబ్బులు వసూలు చేయడం లేదు. నిర్వహణ చార్జీలు, సీనరేజ్ చార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు. సీనరేజ్ రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు ఇస్తారు. వీటికి జీఎస్టీ అదనం.
 
ఇసుక కావాలంటే ఏం చేయాలి?
కావాల్సిన డాక్యుమెంట్లు:
నిర్మాణదారుల ఆధార్ కార్డ్ జిరాక్స్
ఫోన్ నంబర్
ఇసుక తీసుకెళ్లే వాహనం నంబర్
ఇంటి ప్లాన్ అప్రూవల్
ఈ వివరాలను నిర్మాణదారులు ఇసుక డిపోలో సమర్పించాలి. ఎంత ఇసుక కావాలో అందుకు తగినట్లుగా నిర్వహణ చార్జీలు వంటి వాటిని ఆన్‌లైన్‌లో చెల్లించాలి. యూపీఐ ద్వారా కూడా చెల్లించొచ్చు. తొలుత రోజుకు ఒక్కొక్కరికి గరిష్ఠంగా 20 టన్నులు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. డిపోల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఇసుక లోడింగ్‌ చేస్తారని, ముందు వచ్చిన వారికే తొలి ప్రాధాన్యమని ప్రభుత్వం వెల్లడించింది. ఇసుక తరలించే వాహనాలకు కూడా రవాణా చార్జీలను నిర్ణయించామని, ఆ వివరాలను డిపోల వద్ద ప్రదర్శించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇబ్బందులు తెలుసుకోవడానికి, ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.
 
చార్జీలు ఎంత చెల్లించాలి?
రాష్ట్రవ్యాప్తంగా 88 స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది. అందులో అత్యధికంగా ఎన్టీఆర్, వైఎస్సార్ జిల్లాల్లో 11 డిపోల చొప్పున; అనంతపురం, కర్నూలు, కాకినాడ జిల్లాల్లో మాత్రం ఒక్కో డిపోలోనే ఇసుక అందుబాటులో ఉంది. ఇసుక నిర్వహణ వ్యయం వంటి చార్జీలు డిపోను బట్టి మారుతున్నాయి. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లా అగనంపూడి వద్ద డిపోలో అన్ని చార్జీలు కలిపి టన్ను ఇసుకకు రూ.1,395 లెక్కన చెల్లించాలి. అనకాపల్లి జిల్లాలోని రెండు డిపోలలో అదే టన్ను ఇసుక కోసం చార్జీలు రూ.1,225 గా ఉన్నాయి.
 
చిత్తూరు జిల్లాలో మూడు ఇసుక డిపోలు ఉండగా అందులో దిగువంశపల్లి, పాలూరు డిపోలలో టన్నుకు రూ.155 వసూలు చేస్తున్నారు. ఇక రవాణా చార్జీలు కూడా వాహనాన్ని బట్టి మారుతున్నాయి. ఇసుక తీసుకెళ్లే వాహనం, టన్నులు, కిలోమీటర్ల ఆధారంగా ఈ ధరలు నిర్ణయించారు. ఉదాహరణకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ట్రాక్టర్‌లో ఇసుక తీసుకెళ్లేందుకు రూ. 500 (5 కిలోమీటర్ల లోపు దూరానికి) చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 10 కిలోమీటర్ల దూరానికి రూ. 800 చెల్లించాలి. 10 కిలోమీటర్లు దాటాక ప్రతి కిలోమీటర్‌కు రూ. 50 చొప్పున అదనంగా చెల్లించాలి.
 
అదే ఆరు చక్రాల లారీ అయితే రూ.1200 (5 కిలోమీటర్ల లోపు దూరానికి) కట్టాలి. 5 నుంచి 10 కిలోమీటర్ల దూరానికి రూ. 2,250.. 15 కిలోమీటర్ల దూరం దాటితే ప్రతి కిలోమీటర్‌కు రూ.90 చొప్పున వినియోగదారులు చెల్లించాలి. 10, 12, 14 టైర్ల లారీలతో ఇసుక తరలిస్తే అందుకు వేరే రవాణా చార్జీలున్నాయి. ఈ ధరలన్నీ ఆయా స్టాక్ పాయింట్ల వద్దకు ఇసుక తరలించడానికి అయిన ఖర్చుతో పాటుగా తవ్వకాలకు, లోడింగ్, అన్ లోడింగ్ వంటి ఖర్చులతో కలిపి నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.
 
రాజమండ్రి నుంచి అగనంపూడి, నక్కపల్లి వంటి స్టాక్ పాయింట్లకు తరలించడానికి ఎక్కువ ఖర్చు అయినందన ఆయా పాయింట్లలో ఇసుక ధర ఎక్కువగా ఉంటుందని ఏపీ గనుల శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. తవ్వకం ఖర్చు, ఇతర నిర్వహణ వ్యయం మాత్రమే తీసుకుంటున్నామని.. ఎవరికైనా గ్రీవెన్స్ ఉన్నా, అనధికారిక తవ్వకాలు సాగుతున్నా మోనిటర్ చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ‘బీబీసీ’తో చెప్పారు. ఇసుక కోసం రాజమండ్రి సమీపంలోని లాలాచెరువు స్టాక్ పాయింట్ వద్దకు వచ్చిన చింతా బుల్లి రాజు బీబీసీతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు తక్కువ ఖర్చు అవుతోందని ఆయన చెప్పారు.
 
‘10 టన్నుల ఇసుక రూ. 2,700ల ధరకు కొన్నాం. గతంలో రవాణా ఖర్చులతో కలిసి రూ. 8,000 అయ్యేది. ఇప్పుడు రవాణా, అన్ని ఖర్చులు కలుపుకొని రూ. 4,200కే దొరుకుతోంది. ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇంటి అప్రూవల్ చూపిస్తే ఇస్తున్నారు. గతంతో పోల్చితే సగానికి సగం ధర తగ్గడంతో ఆ డబ్బు సిమెంట్, ఇతర ఖర్చులకు ఉపయోగపడుతుంది’ అన్నారు. మరో వినియోగదారుడు మేడే సుబ్బారావు బీబీసీతో మాట్లాడుతూ గతం కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
"మాది అన్నవరం. గతంలో 5 టన్నుల ఇసుక కోసం రూ. 6,500 వరకు చెల్లించాల్సి వచ్చేది. ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ.4,500కి తగ్గించారు. ఇప్పుడు మాకు దగ్గరలో పెద్దాపురం స్టాక్ పాయింట్ వద్ద టన్ను ధర రూ.655గా ఉంది. 5 టన్నులు కావాలంటే రూ.3,275 చెల్లించాలి. దీనికి అదనంగా రూ.4,000 రవాణా ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి గతం కన్నా ధర పెరిగినట్టే కనిపిస్తోంది" అని కాకినాడ జిల్లా అన్నవరం గ్రామానికి చెందిన మేడే సుబ్బారావు బీబీసీకి తెలిపారు. ఇసుక గతం కంటే అందుబాటులో ఉండటం బాగుందని చెప్పిన ఆయన ధరలు తగ్గించాలని కోరారు. అయితే, కొన్ని స్టాక్ పాయింట్లకు సమీపంలో ఇసుక తరలించడానికి వ్యయం ఎక్కువైతే ఆమేరకు అక్కడ ధర ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణకు ఏనుగు రూపవతి... వైద్య పరీక్ష అవసరం