మహిళలపై వేధింపులు, అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. వయోబేధం లేకుండా ఎక్కడపడితే అక్కడ మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
ఎనిమిదేళ్ల బాలికపై విద్యార్థులు ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై బాలికను కాల్వలోకి తోసేసి వెళ్లిపోయారు. ఈ ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఏపీలో స్థానికంగా కలకలం రేపింది.
ముగ్గురు నిందితులూ పన్నెండు, పదమూడేళ్ల వయసున్న వారే, అయినప్పటికీ ఇంత ఘోరానికి పాల్పడడం గ్రామస్థులను నివ్వెరపరిచింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. "ఇది చదివిన నాకు ఇది తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నేరస్థులు కూడా మైనర్లే. యువకుల మనస్సులు భ్రష్టుపట్టిపోతున్నాయి. అనేక కారణాల వల్ల చెడిపోతున్నాయి. పాఠశాల స్థాయిలో కఠినమైన శిక్షతోనే పిల్లలను సరైన దారిలో పెట్టగలం. మన సంస్కృతి గురించి పిల్లలకు సరైన విధంగా తెలియజేయాలని భావిస్తున్నానని అన్నారు.
కాగా, ముచ్చుమర్రి గ్రామంలో 6 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలిక ఆచూకీ ఇంకా లభించలేదు. బాలికను ముగ్గురు మైనర్ బాలురు సామూహికంగా వేధించి హత్య చేసి.. మృతదేహాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువలో పడేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో బాలిక ఆచూకీ కోసం ముచ్చుమర్రి పంప్‌హౌస్ నీటిలో గత 6 రోజులుగా గాలిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన రెండు ఎన్డీఆర్ఎఫ్ టీములు స్పెషల్ కెమెరాలతో నీటిలో వెతికినా బాలిక జాడ తెలియరాలేదు.