Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘కరోనా నైట్‌ షిఫ్ట్ చేసి పగలు నిద్రపోతుందా..?’ రాత్రి కర్ఫ్యూ పెట్టడంలో లాజిక్ ఏమిటి?

Advertiesment
‘కరోనా నైట్‌ షిఫ్ట్ చేసి పగలు నిద్రపోతుందా..?’ రాత్రి కర్ఫ్యూ పెట్టడంలో లాజిక్ ఏమిటి?
, గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:34 IST)
"అక్కా రాత్రి సమయంలో కరోనావైరస్‌ మరింత యాక్టీవ్‌గా ఉంటుందా" ఆఫీస్‌ నుంచి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కుమారి నన్ను అడిగిన ప్రశ్న ఇది. అప్పటికే రాత్రి పదిన్నర అవుతోంది. భోజనం చేసిన తర్వాత నేను అలా ఇంటి బయట నడుస్తున్నాను. అప్పుడే ఆఫీస్ నుంచి తిరిగొస్తోంది కుమారి. ఏప్రిల్ ఆరు నుంచి 30 వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అత్యవసర సేవలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు.

 
బుధవారం పంజాబ్‌ ప్రభుత్వం కూడా రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ రాత్రి 9 గంటలకే కర్ఫ్యూ మొదలవుతుంది. దిల్లీ కంటే ముందు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వారాంతాల్లో కర్ఫ్యూ పెట్టింది. కానీ రాత్రి పూట కర్ఫ్యూ పెట్టడం వల్ల లాభమేంటి.. దానిలో ఉన్న లాజిక్ ఏంటి.. ఒక రాష్ట్రాన్ని చూసి మరొక రాష్ట్రం కర్ఫ్యూ పెడుతున్నాయా.. లేక కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయా అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చెప్పలేదు.

 
నైట్‌ కర్ఫ్యూ వెనక లాజిక్ ఏంటి
మహారాష్ట్ర బీబీసీ ప్రతినిధి మయాంక్ భగత్ చెప్పిన వివరాల ప్రకారం.. రాత్రి సమయంలో చాలా మంది ప్రజలు ఇంట్లోంచి బయటకు వెళ్తారని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. నైట్ క్లబ్బులకు, రెస్టారెంట్లలో తినడానికి, రాత్రి సమయంలో ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారని ప్రభుత్వం అంటోంది. ప్రజలు ఇలా బయట తిరగకుండా ఉండేందుకు నైట్ కర్ఫ్యూ పెట్టినట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. రాత్రి పూట కర్ఫ్యూ నిర్ణయానికి ఎలాంటి కారణాలు చెప్పలేదు.. దిల్లీ ప్రభుత్వం.

 
ఇదే విషయాన్ని దిల్లీ ప్రభుత్వాన్ని అడిగింది బీబీసీ. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన జరిగిన డీడీఎంఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తన పేరు బయటపెట్టొద్దనే షరతుతో ఒక ఉన్నతాధికారి బీబీసీకి చెప్పారు. అయితే, నైట్ కర్ఫ్యూ పెట్టడంపై చర్చించారా.. లేక దాని వెనకున్న లాజిక్ ఏంటన్నది చర్చించారా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ సాధారణ ప్రజల నుంచి అనేక సందేహాలు వస్తున్నాయి. కొందరు ఈ నిర్ణయంపై జోకులు వేస్తున్నారు. 'కరోనా నైట్‌ షిఫ్ట్ చేసి పగలు నిద్రపోతుందా..? అని ట్విటర్‌లో ఒక యూజర్ ప్రశ్నించారు. 'కరోనా పగలు విశ్రాంతి తీసుకుని రాత్రి తిరుగుతుంది' అని మరొక యూజర్ అన్నారు.

 
రాత్రి కర్ఫ్యూ వల్ల ప్రయోజనం ఏమిటి
రాత్రి కర్ఫ్యూ వల్ల ప్రయోజనం ఏమిటని పలువురు డాక్టర్లను అడిగింది బీబీసీ. "రాత్రి కర్ఫ్యూ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోలేము. కానీ ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళనగా ఉన్నామని, ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నామని ప్రభుత్వం ప్రజలకు చెప్పాలనుకుంటోంది" అని ఎయిమ్స్‌లో కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్‌ డాక్టర్ సంజయ్ రాయ్ చెప్పారు.

 
మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు ద్వారా ప్రధానంగా ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపిస్తుంది. కానీ ఈ తుంపర్లు రెండు మీటర్లకు మించి ప్రయాణించలేవు. అంటే వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్క్ ధరించి, రెండు మీటర్ల దూరం పాటించడం మంచిది అని ఆయన అన్నారు. వెంటిలేషన్ సరిగా లేని ప్రాంతాలకు జనం ఎక్కువగా వెళ్లినప్పుడు కరోనావైరస్ వ్యాపిస్తుందని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే చెప్తున్నారు.

 
వెంటిలేషన్ ఎక్కువగా ఉన్నచోట వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఆయన అంటున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీకరించిందని చెప్పారు. ప్రజలు బార్లు, రెస్టారెంట్లు వంటి వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాలకు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ రాత్రి కర్ఫ్యూ పెట్టారని ఆయన అన్నారు. పగలు ప్రజలు ఎక్కువగా పనికి వెళ్తుంటారని, రాత్రి సమయంలోనే వినోదం కోసం బయటకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

 
రాత్రిపూట కర్ఫ్యూ పెట్టడంతో పాటు ఆఫీసులను మూసేయడం, కొన్ని ఆర్థిక కార్యకలాపాలపై నిషేధం విధించడం వల్ల కూడా కరోనాను కట్టడి చేయవచ్చు. కానీ అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే ఈ రెండింటిని బేరీజు వేసుకున్నప్పుడు రాత్రి కర్ఫ్యూ విధించడమే ఉత్తమం అని డాక్టర్ శేఖర్ చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన భారీ వ్యూహాత్మక కార్యక్రమంలో రాత్రి కర్ఫ్యూ అనేది ఒకటని దిల్లీ సప్దర్‌గంజ్ ఆస్పత్రిలో కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ జుగల్ కిశోర్ అన్నారు.

 
'రాత్రి కర్ఫ్యూతో ప్రయోజనం తక్కువే'
అయితే, మార్చ్ 15 2021లో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. కరోనా వ్యాపించకుండా అడ్డుకోవడంలో వారాంత లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ పాక్షిక ప్రభావమే చూపిస్తాయని ఆయన ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. కరోనావైరస్‌ నియంత్రణకు కేంద్రం సూచించిన మార్గదర్శకాలను అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్మశానంలో స్థలం కొరత.. ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలు దహనం