Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీఎఫ్ వడ్డీపై పన్ను: ఇకపై నెలనెలా పీఎఫ్ ఎంత కట్ అయితే ట్యాక్స్ పడుతుంది..

పీఎఫ్ వడ్డీపై పన్ను: ఇకపై నెలనెలా పీఎఫ్ ఎంత కట్ అయితే ట్యాక్స్ పడుతుంది..
, బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (17:40 IST)
చాలా మంది తమ ప్రోవిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులని వృద్ధాప్యంలో ఆసరా కోసం, ఇల్లు కొనుక్కోవడానికి, పిల్లల పెళ్లి చేయడం కోసం దాచుకుంటారు. ఈ డబ్బులతో వారికి ఒక భరోసా ఉంటుంది.
 
ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం.. కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తొలి మూడు నెలల్లో దాదాపు ఎనిమిది మిలియన్ల మంది తమ పీఎఫ్ డబ్బులను ఉపసంహరించుకున్నారు. ఉద్యోగాలను కోల్పోవడమే దీనికి ప్రధాన కారణం.
 
పీఎఫ్ ఉపసంహరణకు నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. అయితే, కోవిడ్-19 సంక్షోభం నడుమ వీటిని ప్రభుత్వం కాస్త సడలించింది. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న వారికి నగదును ఉపసంహరించుకునేందుకు వీలు కల్పించింది. అయితే, నేడు పీఎఫ్ రూపంలో వచ్చే నిధులపైనా పన్నులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది
 
ఏప్రిల్ 1 నుంచే.. 
ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్)లో ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ  జమ చేసేవారు వడ్డీపై పన్నులను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ప్రకటించారు.
 
ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమచేసేవారు పీఎఫ్ నుంచి వచ్చే వడ్డీకి ట్యాక్స్ రిబేట్‌ల కింద మినహాయింపు ఉండదని నిర్మల స్పష్టంచేశారు. కేవలం ఉద్యోగులు జమ చేసే మొత్తంపైనే ఈ పన్నును లెక్కిస్తారు. 1, ఏప్రిల్ 2021 నుంచి ఇది అమలులోకి వస్తుంది.
 
ఈ మార్పులతో దాదాపు అందరిపైనా ప్రభావం పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై లోతైన అవగాహన కోసం ట్యాక్స్ నిపుణురాలు గౌరీ చడ్ఢాతో బీబీసీ మాట్లాడింది. ఆ వివరాలు ప్రశ్నలు-సమాధానాల రూపంలో..
 
ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరముందా? 
ఇప్పటివరకు పీఎఫ్‌లో ఉద్యోగులు జమ చేసే మొత్తాన్ని ఆదాయపు పన్నులోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు ఇచ్చేవారు. దీనిపై వచ్చే వడ్డీపై కూడా ఎలాంటి పన్నులనూ వసూలు చేసేవారు కాదు.
webdunia
 
కానీ ఏప్రిల్ 1, 2021 నుంచి కొన్ని కొత్త మార్పులు రాబోతున్నాయి. పీఎఫ్‌లో ఉద్యోగి వాట ఏడాదికి రూ.2.5 లక్షల వరకు ఉంటే 80సీ కింద ఎప్పటిలానే మిహనహాయింపు ఉంటుంది. అదే పీఎఫ్‌లో ఉద్యోగి వాటా రూ.2.5 లక్షలకు మించి ఉంటే.. వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
 
పీఎఫ్‌లో ఉద్యోగితోపాటు ఉద్యోగ సంస్థలు కూడా ఉద్యోగి తరఫున కొంత మొత్తం జమచేస్తాయి. అయితే, వీటికి కొత్త నిబంధనలు వర్తించవు. కేవలం ఉద్యోగి షేర్‌పై మాత్రమే పన్ను కట్టాల్సి ఉంటుంది.
 
రూ.3 లక్షల కంటే ఎక్కువే పీఎఫ్‌లోకి జమచేస్తే? 
మొదటి రూ.2.5 లక్షల వరకు ఎలాంటి పన్నులూ చెల్లించాల్సిన పనిలేదు. అయితే, ఆపైన ఉండే రూ.50,000కు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
 
ఉదాహరణకు పీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతం అనుకుందాం. అంటే రూ.50,000కు రూ.4250 వరకు వడ్డీ వస్తుంది. ఇప్పుడు ఉద్యోగి 30 శాతం ట్యాక్స్ శ్లాబ్‌లో ఉంటే.. అతడు రూ.1,275ను పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. 
 
దీనిపై నాలుగు శాతం ఆరోగ్య, విద్య సెస్సును కలిపితే.. ఈ పన్ను రూ.1,326కు పెరుగుతుంది. అంటే ఒక ఉద్యోగి ఏడాదికి రూ.3 లక్షలను పీఎఫ్‌లో జమచేస్తే.. అతడు రూ.1,326ను కొత్తగా పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
 
పన్నును ఎలా లెక్కిస్తారు? 
ఆదాయపు పన్ను ట్యాక్స్ శ్లాబ్ ఆధారంగా ఈ పన్నును లెక్కిస్తారు. ఉదాహరణకు సదరు ఉద్యోగి 30 శాతం ట్యాక్స్ శ్లాబ్‌ పరిధిలోకి వస్తే.. తను జమచేసిన పీఎఫ్ నిధిలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఉండే మొత్తంపై వచ్చే వడ్డీలో 30 శాతాన్ని పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది.
 
జీతం ఎక్కువగా ఉండేవారికి ఈ కొత్త నిబంధనతో పన్ను ఎక్కువగా పడుతుంది. ఒకవేళ మీరు జమ చేసే పీఎఫ్ రూ.2.5 లక్షలకు లోపు ఉంటే ఎలాంటి చింతా అవసరం లేదు. ఉదాహరణకు నెలకు రూ.20,833 కంటే తక్కువగా పీఎఫ్‌లోకి జమచేసే వారు కొత్త నిబంధన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
 
స్వచ్ఛంద భవిష్య నిధి (వీపీఎఫ్)పైనా ప్రభావం ఉంటుందా? 
అవును, కచ్చితంగా ఉంటుంది. తాజా నిబంధన వీపీఎఫ్‌కు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి పీఎఫ్‌లో రూ.11,000, వీపీఎఫ్‌లో మరో రూ.11,000 జమ చేస్తున్నారు అనుకుందాం. దీని ప్రకారం.. నెలకు మొత్తంగా సదరు ఉద్యోగి రూ.22,000 జమ చేస్తున్నట్లు లెక్క. అంటే సంవత్సరానికి ఇది రూ.2.5 లక్షలకు మించిపోతుంది. దీంతో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఉండే పీఎఫ్ సొమ్ము నుంచి వచ్చే వడ్డీపై సదరు ఉద్యోగి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
 
ముఖ్యంగా వీపీఎఫ్ కింద డబ్బులు పొదుపు చేసుకునే వారే లక్ష్యంగా తాజా నిబంధనను తీసుకొచ్చారు. వీపీఎఫ్ పొదుపు వల్ల చాలా మంది పీఎఫ్ నిధి ఏడాదికి రూ.2.5 లక్షలను మించిపోతుంది.
 
వీపీఎఫ్‌లో డబ్బులు వేయడం మంచిదేనా? 
దీనికి అంత తేలిగ్గా సమాధానం చెప్పలేం. సదరు వ్యక్తి వయసు, అతడు వీపీఎఫ్‌లో ఎంత మొత్తం జమ చేస్తున్నారు? తదితర అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. అంతేకాదు వీపీఎఫ్ నుంచి తీసుకున్న ఈ డబ్బుతో ఏం చేస్తున్నారు? అనే అంశంపైనా ఇది ఆధారపడుతుంది.
 
డబ్బులు పొదుపు చేసుకునేందుకు నిపుణులు ఒక ఫార్ములాను చెబుతుంటారు. మొదట మీ వయసును 100 నుంచి మైనస్ చేయండి. ఇప్పుడు ఎంత సంఖ్య వస్తుందో.. అంత శాతాన్ని మీరు ఈక్విటీల్లో పెట్టాలి. ఉదాహరణకు మీ వయసు 40 అనుకుందాం. అప్పుడు పొదుపులో 60 శాతాన్ని ఈక్విటీలో, 40 శాతాన్ని డెట్ ఫండ్‌లో పెట్టాలి. ఈక్విటీ ఫండ్ అంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్. అదే డెట్ ఫండ్స్ అంటే పీఎఫ్, వీపీఎఫ్, ఎన్‌పీఎస్, పన్ను రహిత బాండ్లు, ఎఫ్‌డీలు వస్తాయి.
 
ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్య తీసుకుంది? 
భిన్న రకాల పొదుపు విధానాల్లో ఏకరూపకత తీసుకొచ్చేందుకు తాజా మార్పులు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా జీతం ఎక్కువగా తీసుకుంటూ పెద్ద మొత్తాన్ని పీఎఫ్‌లో పెట్టి ఎలాంటి వడ్డీ చెల్లించని వారిపై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పుడు పీఎఫ్‌కు బదులు.. అదే మొత్తాన్ని వేరే ఎక్కడైనా పొదుపు చేసుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్ లాంటి మార్గాలను పరిశీలించొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్ఈసీకి పోటీగా వైకాపా సర్కారు ప్రత్యేక యాప్: పేరు ఈ-నేత్ర