ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలపై పెద్ద చర్చ సాగుతోంది. ప్లాస్టిక్ వినియోగంపై పలువురు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన కొందరు యువకులు కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో తమ చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు అవగాహన కల్పిస్తూనే, పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్ సేకరించే పని ప్రారంభించారు. అంతేగాకుండా ప్లాస్టిక్ సేకరించేవారిని ప్రోత్సహించేలా కిలో ప్లాస్టిక్‌కి కిలో బియ్యం అందిస్తూ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి సహా పలువురి అభినందనలు అందుకుంటున్నారు. వీరు 'మన పెద్దాపురం' అనే పేరుతో సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
యువతలో రక్తదానం పట్ల అవగాహన పెంచే ప్రయత్నం, పచ్చదనం కోసం మొక్కలు పెంచడానికి ప్రోత్సాహం అందించడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. వాటికి మంచి స్పందన లభించడంతో తాజాగా 'ప్లాస్టిక్‌ని దూరం చేద్దాం.. ఆకలిని అరికడదాం' అనే నినాదంతో ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు అందించే వారికి కిలో బియ్యం అందిస్తామని చెబుతున్నారు.