Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నన్ను రేప్ చేశారు... ఇప్పుడు నా కూతుళ్లనూ అలా చేస్తారేమోనని భయపడుతున్నా'

Advertiesment
'నన్ను రేప్ చేశారు... ఇప్పుడు నా కూతుళ్లనూ అలా చేస్తారేమోనని భయపడుతున్నా'
, శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (22:18 IST)
దక్షిణాఫ్రికాలో గత కొన్ని వారాల్లో మహిళలపై నేరాలు గణనీయంగా పెరిగాయి. వీరిపై దారుణంగా అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్నారు. బాధితుల్లో పాఠశాలలో, విశ్వవిద్యాలయంలో చదువుకునే అమ్మాయిలూ ఉన్నారు. మహిళల పై పెరుగుతున్న హింస పట్ల దక్షిణాఫ్రికా సమాజం భగ్గుమంటోంది.

 
ఈ అత్యాచారాలు, హత్యలను నిరసిస్తూ దక్షిణాఫ్రికా ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. #AmINext అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్లో, ఇతర ఆన్‌లైన్ వేదికల్లో ఉద్యమిస్తున్నారు. దేశంలో మరణ శిక్షను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఒక ఆన్‌లైన్ పిటిషన్‌పై ఐదు లక్షల మందికి పైగా ప్రజలు సంతకాలు చేశారు.

 
లైంగిక హింసకు వ్యతిరేకంగా ఈ రోజు (సెప్టెంబరు 13) జోహన్నెస్‌బర్గ్‌లో భారీ ప్రదర్శన జరుగుతోంది. దక్షిణాఫ్రికా లైంగిక హింసపై ఆందోళన చెందుతున్న మహిళల్లో జోహన్నెస్‌బర్గ్‌లోని ఫొటోగ్రాఫర్ సారా మిడ్‌గ్లే ఒకరు. 37 ఏళ్ల సారాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు దశాబ్దం క్రితం ఆమె అత్యాచారానికి గురయ్యారు. అది మిగిల్చిన మనోవేదన నుంచి ఆమె నేటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. బీబీసీ ఆఫ్రికా మహిళా వ్యవహారాల ప్రతినిధి ఈస్తర్ అకెలో ఒగోలాతో సారా తన బాధను పంచుకున్నారు.

 
సారా వ్యథ ఆమె మాటల్లో... "2010లో నా మాజీ ప్రియుడు నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమయంలో ఈ ఘటన జరిగింది. అంతకుముందు శారీరకంగా, మానసికంగా దాదాపు 18 నెలలపాటు అతడు నన్ను క్షోభకు గురిచేయడంతో నేను అతడికి దూరమయ్యాను. నేను దూరమయ్యేందుకు యత్నించిన ప్రతిసారి అతడు మరింత హింసాత్మకంగా ప్రవర్తించేవాడు. తన్నేవాడు, కొన్నిసార్లు గొంతు నులిమేవాడు, కొరికేవాడు.

 
తనను వదిలేసి వెళ్తే, నా ఇద్దరు కుమార్తెలను అత్యాచారం చేసి, నా కళ్ల ముందే చంపేస్తానని బెదిరించేవాడు. కొన్నిసార్లు విద్యుత్ షాక్ కూడా ఇచ్చాడు. నేను ఇదంతా ఎవరితోనూ చెప్పుకోలేకపోయాను.

 
అతడి మాట నమ్మడమే నేను చేసిన తప్పు
అప్పటికే విడాకులు తీసుకొన్న నాకు స్నేహితులు, కుటుంబ సభ్యులు అంత విలువిచ్చేవారు కాదు. స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను పట్టించుకోరని నా మాజీ బాయ్‌ఫ్రెండ్ చెప్పేవాడు. అతడిని వదిలేసి వెళ్తే, నా పిల్లలకు హాని చేస్తాడనే భయం కూడా ఉండేది.

 
చివరకు ధైర్యం చేసి అతడికి దూరంగా వచ్చేశాను. ఓ పది రోజుల తర్వాత, అతడు నా ఇంటి ముందుకు వచ్చేశాడు. నేను దిగ్భ్రాంతి చెందా. దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉండే తన బంధువు ఫామ్ (వ్యవసాయ క్షేత్రం)కు వెళ్లేందుకు డబ్బుల్లేవని, చివరిసారిగా తనకో సాయం చేయాలని అడిగాడు.

 
తనను నా కార్లో తీసుకెళ్లి అతడి వద్ద వదిలేస్తే నా జీవితంలోంచి పూర్తిగా వెళ్లిపోతానని మాట ఇచ్చాడు. అది నమ్మడమే నేను చేసిన అతి పెద్ద తప్పు. అతడి మాట నమ్మినందుకు, అత్యాచారం జరిగాక చాలా సంవత్సరాలపాటు నన్ను నేనే నిందించుకున్నాను.

 
కారులో కొంత దూరం ప్రయాణం చేశాక నా మాజీ బాయ్‌ఫ్రెండ్ వాలకం నాకు అనుమానం కలిగించింది. అతడికి హెరాయిన్ తీసుకొనే అలవాటు ఉండటంవల్ల, దాని ప్రభావంతో అలా ఉన్నాడేమోలో అని సర్దిచెప్పుకొన్నాను. కానీ, అతడి చేష్టలు నా అనుమానాన్ని బలపరిచాయి.


అతడి స్నేహితుడు కూడా అత్యాచారం చేశాడు
మీ బంధువుకు చెందిన ఫామ్ గేటు వరకే వస్తానని, అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతానని అతడితో చెప్పాను. ఇంతలో, నేను వెళ్లమన్నప్పుడే వెళ్లాలంటూ, కారు డోర్లు లాక్ చేశాడు. ఫాం వద్దకు చేరుకున్న తర్వాత అతడు నా వైపు వచ్చి, కారు డోర్ తీశాడు. నా జుట్టు పట్టుకొని లాగాడు. కారులోంచి కింద పడ్డాను. తలపై తన్నాడు. స్పృహ కోల్పోయాను.

 
తిరిగి స్పృహ వచ్చేసరికి, నేను ఆ ఫామ్ వెలుపలి క్వార్టర్స్‌లో ఉన్నాను. అతడు నాపై ఉన్నాడు. అతడి వెంట అతడి స్నేహితుడు కూడా ఉన్నాడు. నా మాజీ బాయ్‌ఫ్రెండ్ తర్వాత అతడు నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నేను మళ్లీ స్పృహ కోల్పోయాను. మళ్లీ స్పృహ వచ్చేసరికి వాళ్లు వెళ్లిపోయారు. ఆ ఫామ్‌ను శుభ్రపరిచే ఓ మహిళ నా పక్కన కనిపించారు.

 
నా గర్భాశయాన్ని తొలగించారు
బకెట్‌తో నీళ్లు తెచ్చుకున్న ఆమె నా శరీరాన్ని తుడిచేందుకు యత్నించింది. తన వస్త్రాలతో నా శరీరాన్ని కప్పేందుకు ప్రయత్నించింది. ఈ పని ఆపి, పోలీసులకు లేదా అంబులెన్స్‌కు ఫోన్ చేయాలని ఆమెను అడిగాను. తర్వాత అంబులెన్స్ వచ్చింది. నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. లైంగిక దాడిలో నాకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వైద్యులు నా గర్భాశయాన్ని తొలగించాల్సి వచ్చింది.

 
నేను ఇంత బాధలో ఉండగా, నాపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి బెయిలుపై విడుదలై, పారిపోయాడని తెలిసింది. ఏ హాని జరుగుతుందోననే ఆందోళన తొమ్మిది నెలలపాటు నన్ను వెంటాడింది. తర్వాత అతడిని మళ్లీ అరెస్టు చేశారు. ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రొస్టేట్, మూత్రకోశ క్యాన్సర్‌తో 2017లో అతడు చనిపోయాడు. అప్పటివరకు అతడు ఏడేళ్లు జైల్లో ఉన్నాడు.

 
నిజాయతీగా చెబితే, ఏడేళ్లలో తొలిసారిగా అప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నాను. అతడి స్నేహితుడికి శిక్ష పడేలా కేసుపై ఎన్నడూ దృష్టి పెట్టలేకపోయాను. కేసు విచారణతో మరోసారి కలిగే వేదనను నేను తట్టుకోలేను. అందుకే దానిపై దృష్టి పెట్టలేదు.

 
మా మాజీ బాయ్‌ఫ్రెండ్ వచ్చి నాపైన, నా పిల్లలపైన దాడికి పాల్పడ్డట్లు పీడకలలు వచ్చేవి. ఒంటరిగా ఉండలేక, తల్లిదండ్రుల వద్దకు వచ్చేశాను. పాములంటే భయం ఉంటే, విషమున్న పామా, విషంలేని పామా అనే తేడా లేకుండా ప్రతి పాముకూ భయపడతాం. మగాళ్లంటే నాకు అలాంటి భయమే ఉంది. ఈ భయాన్ని దాచుకొనేందుకు ప్రయత్నిస్తుంటాను.

 
నేను చిన్నప్పుడు కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను. ఈ వేధింపులు, నా మాజీ బాయ్‌ఫ్రెండ్ చేసిన లైంగిక దాడి ప్రభావం నుంచి బయటపడేందుకు సంవత్సరాలపాటు చికిత్స కూడా తీసుకొన్నాను.

 
పిల్లల భద్రతపై ఆందోళన చెందుతున్నా
నాకు జరిగిందే నా కుమార్తెలకు జరిగితే నేను తట్టుకోలేను. వారి భద్రత గురించి విపరీతంగా ఆందోళన చెందుతుంటాను. వాళ్ల ప్రతి కదలికను గమనిస్తుంటాను. వీలైనంత వరకు, వాళ్లు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంటాను. వారి వెంటే ఉంటుంటాను. దక్షిణాఫ్రికాలో మహిళలు, చిన్నారుల రక్షణకు అవసరమైన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం."

 
దక్షిణాఫ్రికా నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ గణాంకాల ప్రకారం 2011-12లో లైంగిక నేరాల కేసుల్లో 60 శాతానికి పైగా కోర్టుల్లో రుజువయ్యాయి. ప్రతి సంవత్సరం ఇది క్రమంగా పెరుగుతూ వస్తోంది. దేశంలో లైంగిక హింసను నియంత్రించేందుకు నేరస్థుల జాబితాను బహిరంగపరచడం, లైంగిక నేరాల ప్రత్యేక కోర్టులను పెంచడం, శిక్షలను కఠినతరం చేయడం, ఇతర చర్యలు చేపడతామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోజా హామీ ఇస్తున్నారు.
 

దక్షిణాఫ్రికాలో ఆగస్టు నుంచి పెద్దయెత్తున చర్చనీయమైన కొన్ని కేసులు
14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని జనికా మలో అత్యాచారానికి గురైంది. కాంక్రీట్ దిమ్మతో కొట్టడం వల్లే జనికా చనిపోయినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులేవీ జరగలేదు.

 
19 ఏళ్ల ఫిల్మ్ అండ్ మీడియా స్టడీస్ విద్యార్థిని ఉయినెనె మర్వెత్యానాను తపాలా కార్యాలయం మెయిల్ రూమ్‌లోకి రప్పించి, అత్యాచారం చేసి, బలమైన ఆయుధంతో కొట్టి చంపేశారు. తపాలా కార్యాలయం ఉద్యోగి ఒకరిని అరెస్టు చేశారు.

 
జెస్సీ హెస్ అనే 19 ఏళ్ల మరో విద్యార్థిని హత్యకు గురైంది. పడకపైనే ఆమె మృతదేహం కనిపించింది. 85 ఏళ్ల ఆమె తాతయ్యను మరుగుదొడ్లో కట్టేసి ఉంచారు. ఈ కేసులో అరెస్టులేవీ జరగలేదు.

 
లీగ్రాండే 'బేబీ లీ' జెంగెల్స్ అనే పాతికేళ్ల బాక్సర్‌ను పోలీసు అధికారి అయిన ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ కారులో కాల్చి చంపాడు. పారిపోవడానికి యత్నించిన అతడు కారు ప్రమాదంలో అయిన గాయాలతో చనిపోయాడు.

 
హత్యల రేటులో నాలుగో స్థానం
అందుబాటులో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం- 2016లో మహిళల హత్యల రేటు అత్యధికంగా ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో ఉందని బీబీసీ రియాలిటీ చెక్ బృందం గుర్తించింది.

 
2016లో దక్షిణాఫ్రికాలో ప్రతి లక్ష మంది మహిళలకు 12.5 మంది చొప్పున హింస కారణంగా చనిపోయారు. 183 దేశాల అంతర్జాతీయ సగటు కేవలం 2.6 మందిగా ఉంది. లెసూటు, జమైకా, హొండురస్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

 
2016లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికాలో తొమ్మిది అత్యాచారాల్లో ఒకటే పోలీసుల దృష్టికి వస్తోంది.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడలో నకిలీ టీ పొడి.. ఇంటిపై టాస్క్‌ఫోర్స్ దాడి