Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యుక్రెయిన్ - రష్యా యుద్ధం ఎలా ముగుస్తుంది? అయిదు రకాల క్లైమాక్స్‌లు

Advertiesment
యుక్రెయిన్ - రష్యా యుద్ధం ఎలా ముగుస్తుంది? అయిదు రకాల క్లైమాక్స్‌లు
, శుక్రవారం, 4 మార్చి 2022 (16:49 IST)
యుద్ధ మేఘాల మధ్య ముందు దారి కనిపించటం కష్టం. యుద్ధ రంగం నుంచి వార్తలు, దౌత్య వాగ్వాదాల ధ్వనులు, మృతుల ఆప్తుల ఆక్రందనలు, నిర్వాసితుల ఆర్తనాదాలు మనల్ని ముంచెత్తుతాయి. ఒక్క క్షణం ఆగి.. యుక్రెయిన్‌లో ఈ యుద్ధం ఏ మలుపులు తిరుగవచ్చు, ఎలా ముగియవచ్చు అనేది చూద్దాం.

 
రాజకీయవేత్తలు, మిలటరీ ప్లానర్లు పరిశీలిస్తున్న తుది అంకాలేమిటి? భవిష్యత్తు గురిచి ధీమాగా జోస్యం చెప్పగలిగేవారు ఉండరు. కానీ, ఈ యుద్ధం చివరికి ఎలా ముగియవచ్చనేదానికి ఐదు రకాల తుది ఫలితాలేమిటో చూద్దాం. ఇందులో కొన్ని ఫలితాలకు అవకాశాలు చాలా తక్కువ.

 
చిన్న యుద్ధమేనా...
రష్యా తన సైనిక చర్యలను ముమ్మరం చేస్తుంది. యుక్రెయిన్ అంతటా మరింతగా విచక్షణా రహిత షెల్లింగ్, రాకెట్ దాడులు జరుగుతాయి. ఇప్పటవరకూ తక్కువ పాత్ర పోషించిన రష్యా వైమానిక దళం భీకర గగనతల దాడులు చేస్తుంది. యుక్రెయిన్ మొత్తంగా కీలక జాతీయ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా భారీ సైబర్ దాడులు జరుగుతాయి. ఇంధన సరఫరాలు, సమాచార వ్యవస్థలను కత్తిరించివేస్తారు. వేలాది మంది పౌరులు చనిపోతారు. సాహసోపేతంగా ప్రతిఘటించినప్పటికీ కీయెవ్ కొన్ని రోజుల్లోనే పతనమవుతుంది. యుక్రెయిన్‌లో రష్యా అనుకూల కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠిస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు జెలెన్‌స్కీని హత్య చేయటమో, లేదంటే ఆయన పశ్చిమ యుక్రెయిన్‌కు కానీ విదేశాలకు కానీ పారిపోయి అక్కడ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ విజయం సాధించినట్లు ప్రకటించుకుంటారు. యుక్రెయిన్‌ను నియంత్రించటానికి అవసరమైనన్ని సైనిక బలగాలను అక్కడ ఉంచి, కొన్ని బలగాలను ఉపసంహరిస్తారు. యుక్రెయిన్.. బెలారుస్ తరహాలో రష్యా అనుబంధ దేశంగా మారుతుంది.

 
ఈ క్లైమాక్స్ అసాధ్యమైనదేమీ కాదు. కానీ కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది: రష్యా బలగాలు మెరుగుగా పనిచేయటం, మరిన్ని బలగాలను మోహరించటం, యుక్రెయిన్ అసాధారణ పోరాట స్ఫూర్తి కొడిగట్టటం వంటివి. కీయెవ్‌లో రష్యా అనుకూల కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నెలకొల్పటంలో పుతిన్ విజయం సాధించవచ్చు. కానీ ఆ ప్రభుత్వానికి చట్టబద్ధత ఉండదు. బలహీనంగా ఉండి, తిరుగుబాటుకు అవకాశాలుంటాయి. ఇలాంటి తుది ఫలితం అస్థిరంగా ఉంటుంది. మళ్లీ ఘర్షణ రగులుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

 
సుదీర్ఘ యుద్ధంగా మారుతుందా?
ఈ ఘర్షణ సుదీర్ఘంగా సాగే యుద్ధంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. నైతిక స్థైర్యం దిగజారటం, మౌలికసదుపాయాలు లేమి, అసమర్థ నాయకత్వం అవరోధాలుగా మారి.. రష్యా బలగాలు ఇక్కడే చిక్కుకుపోవచ్చు. సైనికులు, జనం వీధి పోరాటాలు చేస్తున్న కీయెవ్ వంటి నగరాలను స్వాధీనం చేసుకోవటానికి రష్యా బలగాలకు మరింత కాలం పట్టవచ్చు. ముట్టడి సుదీర్ఘంగా కొనసాగుతుంది. రష్యా 1990ల్లో చెచెన్యా రాజధాని గ్రోజ్నీని ముట్టడించినప్పడు కొనసాగిన సుదీర్ఘ, క్రూర పోరాటం ఇప్పుడు కీయెవ్ దగ్గర పునరావృతమవుతోంది.

 
యుక్రెయిన్ నగరాల మీద రష్యా బలగాలు కొంత పట్టు సాధించగలిగినప్పటికీ.. వాటి మీద నియంత్రణను కొనసాగించటానికి కష్టపడాల్సి రావచ్చు. ఇంతటి విస్తారమైన దేశాన్ని నియంత్రించటానికి సరిపోయినన్ని బలగాలను రష్యా అందించలేకపోవచ్చు. యుక్రెయిన్ భద్రతా బలగాలు బలమైన తిరుగుబాటుదారులుగా మారిపోవచ్చు. వారికి స్థానిక ప్రజానీకం మద్దతు ఇవ్వొచ్చు. పశ్చిమ దేశాలు ఆయుధాలు, మందుగుండు అందించవచ్చు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు రష్యాలో నాయకత్వం మారి కొత్త నాయకత్వం వచ్చినపుడు.. 1989లో నాటి రష్యా సైనికులు దశాబ్ద కాలం పాటు ఇస్లామిక్ తిరుగుబాటుదార్లతో పోరాడి, చివరికి రక్తమోడుతూ అఫ్గానిస్తాన్‌ నుంచి వెనుదిరిగినట్లు.. యుక్రెయిన్ నుంచి రష్యా బలగాలు వెనుదిరగవచ్చు.

 
యూరప్ యుద్ధం
ఈ యుద్ధం యుక్రెయిన్ సరిహద్దులు దాటి పొంగే అవకాశం ఉందా? నాటోలో భాగం కాని, మాజీ సోవియట్ రిపబ్లిక్‌లైన మాల్దోవా, జార్జియాలకు కూడా సైన్యాన్ని పంపించటం ద్వారా ఒకప్పటి రష్యా సామ్రాజ్యంలోని భాగాలను తిరిగి పొందటానికి పుతిన్ ప్రయత్నించే అవకాశం ఉండొచ్చు. లేదంటే కేవలం లెక్క తప్పి, పరిస్థితులు మరింతగా ముదిరిపోవచ్చు. యుక్రెయిన్ బలగాలకు పశ్చిమ దేశాలు ఆయుధాలను సరఫరా చేయటాన్ని.. తిప్పికొట్టాల్సిన దురాక్రమణగా పుతిన్ ప్రకటించవచ్చు. రష్యా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న రష్యా రాష్ట్రం కాలినిన్‌గ్రాడ్‌తో లాండ్ కారిడార్‌ను నెలకొల్పుకోవటానికి.. నాటో సభ్య దేశాలైన లిథువేనియా వంటి బాల్టిక్ దేశాల మీదకు సైన్యాన్ని పంపుతానని బెదిరించవచ్చు.

 
ఇది నాటోతో చాలా ప్రమాదకరమైన, రిస్కుతో కూడిన యుద్ధం అవుతుంది. నాటో సైనిక కూటమి చార్టర్‌లోని ఆర్టికల్ 5 ప్రకారం.. ఒక సభ్య దేశం మీద దాడి చేస్తే నాటో దేశాలన్నిటి మీదా దాడి చేసినట్లే. కానీ, తన నాయకత్వాన్ని కాపాడుకోవటానికి అదొక్కటే దారని పుతిన్ గనుక భావించినట్లయితే ఆయన ఈ రిస్కు తీసుకోవచ్చు.

 
ఒకవేళ యుక్రెయిన్‌లో పుతిన్ ఓటమి ఎదుర్కొనే పరిస్థితుల్లోకి వెళితే, యుద్ధాన్ని మరింత పెంచటానికి ప్రయత్నించవచ్చు. సుదీర్ఘ కాలంగా అమలవుతున్న అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించటానికి పుతిన్ వెనుకాడటం లేదని మనకిప్పుడు తెలుసు. ఇదే లాజిక్‌ను అణ్వాయుధాల వినియోగానికీ వర్తింపచేయవచ్చు. పుతిన్ ఈ వారంలో తన అణు బలగాలను అత్యున్నత స్థాయిలో అప్రమత్తం చేశారు. వాటిని ఉపయోగించే అవకాశం ఉందని కానీ, ఉపయోగించి తీరుతారని కానీ ఈ చర్యకు భాష్యం కాకపోవచ్చునని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. వ్యూహాత్మక అణ్వాయుధాలను యుద్ధరంగంలో వినియోగించటానికి రష్యా విధానం అనుమతిస్తుందనే దానిని ఇది గుర్తుచేసింది.

 
దౌత్య పరిష్కారం
దౌత్య పరిష్కారానికి ఇంకా అవకాశముందా? ''ఇప్పుడు తుపాకులు మాట్లాడుతున్నాయి. కానీ చర్చల మార్గం ఎల్లప్పుడూ తెరిచే ఉండాలి'' అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. చర్చలు తప్పకుండా కొనసాగుతాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రష్యాకు సంకేతాలు పంపిస్తుననట్లు దౌత్యవేత్తలు చెప్తున్నారు. ఆపైన ఆశ్చర్యకరంగా.. రష్యా, యుక్రెయిన్‌ల ప్రతినిధులు బెలారుస్ సరిహద్దు వద్ద కలిసి చర్చించారు. వారు పెద్ద పురోగతి సాధించి ఉండకపోవచ్చు. కానీ చర్చలకు అంగీకరించటం ద్వారా.. సంప్రదింపులతో కాల్పుల విరమణ అవకాశానికి పుతిన్ అంగీకరించినట్లు కనిపిస్తోంది.

 
ఇందుకోసం పశ్చిమ దేశాలు ఏం చేస్తాయి అనేది కీలకమైన ప్రశ్న. కనీసం ఒక ఫేస్-సేవింగ్ ఒప్పందమైనా సాధ్యం కావాలంటే.. పశ్చిమ దేశాలు ఆంక్షలు తొలగించాలంటే ఏం చేయాలనేది రష్యా అధ్యక్షుడికి తెలియాల్సిన అవసరముందని.

 
పరిస్థితి ఇలా మారినట్లు ఊహించండి: యుద్ధం రష్యాను బాగా కుంగదీస్తుంది. ఆంక్షలు ఆ దేశాన్ని దెబ్బతీస్తాయి. సైనికుల మృతదేహాలు ఇళ్లకు చేరుతోంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది. పుతిన్ తన సామర్థ్యానికి మించిన పనిచేశానా అని చింతిస్తారు. యుద్ధాన్ని ముగించటం వల్ల అవమానం కన్నా.. యుద్ధాన్ని కొనసాగించటం తన నాయకత్వానికి పెద్ద ముప్పుగా పరిణమించించిందని భావిస్తారు. చైనా జోక్యం చేసుకుంటుంది. రాజీ చేసుకోవాలని రష్యాపై ఒత్తిడి తెస్తుంది. యుద్దంగా ఇంకా ముదిరితే రష్యా చమురును, గ్యాస్‌ను తాను కొనబోనని బెదిరిస్తుంది. దీంతో పుతిన్ బయటపడే దారికోసం వెదకటం మొదలుపెడతారు.

 
మరోవైపు యుక్రెయిన్ పాలకులు.. తమ దేశంలో కొనసాగుతన్న విధ్వంసాన్ని చూస్తారు. ఇంతటి పెను ప్రాణనష్టం కన్నా రాజకీయంగా రాజీ పడటం మంచిదని తీర్మానిస్తారు. కాబట్టి దౌత్యవేత్తలు చర్చిస్తారు. ఒప్పందం కుదురుతుంది. క్రైమియా మీద, డోన్బాస్‌లోని కొన్ని ప్రాంతాల మీద రష్యా సార్వభౌమాధికారాన్ని యుక్రెయిన్ అంగీకరిస్తే.. దానికి ప్రతిగా, యుక్రెయిన్ స్వతంత్రతను, యూరప్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవటానికి ఆ దేశానికి గల హక్కును పుతిన్ అంగీకరిస్తారని అనుకుందాం. ఇలా జరిగే అవకాశం లేదన్నట్లు కనిపించవచ్చు. కానీ.. రక్తపాత సంఘర్షణలో శిథిలాల నుంచి ఇలాంటిది జరిగే అవకాశం లేకపోలేదు.

 
పుతిన్‌ను గద్దె దించటం
అసలు స్వయంగా వ్లాదిమిర్ పుతిన్ సంగతేమిటి? ఆయన ఈ దండయాత్రను మొదలుపెట్టినపుడు.. ''ఏ ఫలితానికైనా మేం సిద్ధంగా ఉన్నాం'' అని ప్రకటించారు. ఆ ఫలితం.. ఆయన అధికారం కోల్పోవటం అయితే? అది ఆలోచించటానికే సాధ్యం కాదన్నట్లుగా కనిపించవచ్చు. అయినప్పటికీ.. ఇటీవలి కొద్ది రోజుల్లో ప్రపంచం మారింది. ఇప్పుడు అలాంటి వాటి గురించి ఆలోచిస్తున్నారు. ''కీయెవ్‌లో అధికార మార్పిడి అవకాశం లాగానే.. మాస్కోలోనూ అధికార మార్పిడి జరిగే అవకాశముంది'' అని లండన్ కింగ్స్ కాలేజ్‌లో వార్ స్టడీస్ ప్రొఫెసర్ సర్ లారెన్స్ ఫ్రీడ్‌మన్ ఈ వారంలో రాశారు.

 
ఆయన ఈ మాట ఎందుకు అని ఉంటారు? బహుశా పుతిన్ దారుణంగా దెబ్బతినే యుద్ధం చేస్తుండవచ్చు. వేలాది మంది రష్యన్లు చనిపోతారు. ఆర్థిక ఆంక్షలు దెబ్బతీస్తాయి. పుతిన్‌ ప్రజా మద్దతును కోల్పోతారు. ప్రజల నుంచి తిరుగుబాటు రావచ్చు. ఆ వ్యతిరేకతను అణచివేయటానికి రష్యా అంతర్గత భధ్రతా బలగాలను పుతిన్ ఉపయోగించుకుంటారు.

 
కానీ ఇది తిప్పికొడుతుంది. రష్యా సైన్యంలో, రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత వర్గాల వారిలో తగినంత మంది పుతిన్‌కు ఎదురు తిరుగుతారు. పుతిన్ దిగిపోయి, ఆ స్థానంలో మరింత మెత్తని నాయకుడు దేశాధ్యక్షుడైతే.. రష్యా మీద కొన్ని ఆంక్షలను ఎత్తివేయగలమని, సాధారణ దౌత్య సంబంధాలను పునరుద్ధరించగలమని పశ్చిమ దేశాలు స్పష్టం చేస్తాయి. రష్యా రాజభవనంలో రక్తసిక్తమైన కుట్ర జరిగి పుతిన్‌ను గద్దె దించుతారు. ఇది ఇప్పుడు సాధ్యమయ్యేదిగా కనిపించకపోవచ్చు. కానీ.. పుతిన్ వల్ల ప్రయోజనం పొందిన వ్యక్తులు.. ఆయనిక తమ ప్రయోజనాలను కాపాడలేరని భావిస్తే.. ఇలా జరిగే అవకాశం లేకపోలేదు.

 
ఈ అవకాశాలు దేనికవే ప్రత్యేకమైనవి కావు. వీటిలో కొన్ని అవకాశాలు కలిసి విభిన్నమైన ఫలితాన్ని అందించవచ్చు. అయితే ఈ ఘర్షణ ఎలా ముగిసినా కూడా ప్రపంచం మారింది. అది మునుపటి యథాతథ స్థితికైతే చేరదు. బయటి ప్రపంచంతో రష్యా సంబంధం భిన్నంగా ఉంటుంది. భద్రతకు సంబంధించి యూరప్ దేశాల వైఖరి పూర్తిగా మారిపోతుంది. ఉదార, అంతర్జాతీయ నిబంధనల ఆధారిత వ్యవస్థ.. అసలు ఎందుకు అనేది ఇప్పుడు తనను తాను మళ్లీ తెలుసుకుని ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌లో భారీ పేలుడు - 30 మంది మృతి