Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యుక్రెయిన్ సంక్షోభం: పుతిన్ ప్లాన్ ఏమిటి? యుక్రెయిన్‌కు సహకరించే దేశాలపై బాంబుల వర్షం కురిపిస్తారా?

యుక్రెయిన్ సంక్షోభం: పుతిన్ ప్లాన్ ఏమిటి? యుక్రెయిన్‌కు సహకరించే దేశాలపై బాంబుల వర్షం కురిపిస్తారా?
, బుధవారం, 2 మార్చి 2022 (20:39 IST)
యుక్రెయిన్‌లోని ప్రధాన నగరలైనా కీయెవ్, ఖార్కియెవ్ పట్టణాలను స్వాధీనం చేసుకోవడానికి రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ఇక్కడ తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు, దాదాపు 5 లక్షల మంది ప్రజలు యుక్రెయిన్ నుంచి వేరే దేశాలకు శరణార్ధులుగా వెళ్లిపోతున్నారు.


ఇటు రష్యాపై పలు దేశాలు ఆంక్షలను తీవ్రం చేశాయి. యుద్ధం తీవ్రం కావడంతో తరువాత ఏం జరగబోతోంది అన్నది చాలామంది మెదిలే ప్రశ్న. దీనితోపాటు పలు సందేహాలపై గ్రౌండ్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధులు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు.

 
బీబీసీ చీఫ్ ఇంటర్నేషన్ కరస్పాండెంట్ లైస్‌ డౌసెట్ యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో ఉండగా, మార్క్ లావెన్ యుక్రెయిన్-పోలండ్ సరిహద్దుల్లో ఉన్నారు.

 
రష్యా చుట్టూ ఉన్న నాటో దేశాలు క్షేమమేనా, ఎన్నాళ్లు?- క్రిస్టీనా ఒనోఫ్రాస్, రొమేనియా
లైస్‌ డౌసెట్: తూర్పున ఉన్న నాటో దేశాలు ఆందోళనలో ఉన్నాయి. లిథువేనియా తమ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించింది. నాటోలో భాగం కాకపోయినా, స్వీడన్, ఫిన్‌లాండ్‌లు అలయన్స్ ఎమర్జెన్సీ మీటింగ్‌లో పాల్గొన్నాయి. పోలండ్‌ లాంటి దేశాలకు అమెరికా అదనపు బలగాలను పంపింది. పోలండ్ వాసులు తమ భద్రతపై ఆందోళనలో ఉన్నారు. అయితే వాళ్లలో చాలామంది యుక్రేనియన్లకు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 
ఇప్పటి వరకు జరిగింది చాలంటూ నాటో దళాలు ఎప్పుడు యుద్ధ రంగంలోకి అడుగు పెట్టే అవకాశం ఉంటుంది- టిమ్ మేఫమ్, యూకే
లైస్ డౌసెట్ : రష్యా కదలికలను నాటో సైన్యాలు సునిశితంగా గమనిస్తున్నాయి. తమ సభ్య దేశాలపై ఈగ వాలినా ప్రతిదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. యుక్రెయిన్ సైన్యానికి అవసరమైన ఆయుధాలను ఇప్పటికే పంపాయి. అయితే, యుక్రెయిన్ నాటో దేశం కానందున ఎట్టి పరిస్థితుల్లోనూ తాము యుద్ధంలోకి దిగబోమని నాటో దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే, రష్యా ఏదైనా నాటో దేశంపై దాడి చేస్తే పరిస్థితులు మారిపోవచ్చు. నాటో సభ్యదేశంపై దాడి జరిగితే, సభ్య దేశాలన్నింటి పైనా దాడి జరిగినట్లేనని నాటో కూటమి రాజ్యాంగంలోని ఆర్టికల్-5 చెబుతోంది.

 
యూకే మీద పుతిన్ బాంబులు వేసే అవకాశం ఉందా ?-బెకీ, యూకే
లైస్ డౌసెట్ : అలాంటి అవకాశమే లేదు. మున్ముందు ఏం జరుగుతుందో చెప్పడం అసాధ్యమే అయినా, బ్రిటన్ లేదా మరే దేశం పైనైనా రష్యా బాంబులు వేసే అవకాశం ఇప్పటికైతే లేదు.

 
షెల్టర్లలో ప్రజలకు ఆహారం, నీళ్లు లాంటి సౌకర్యాలు ఎలా అందుతున్నాయి? కీయెవ్ నగరంలో ప్రజలకు ఆహారం అందుతోందా-అర్లేన్, అమెరికా
లైస్ డౌసెట్ : కర్ఫ్యూ తీసేసినప్పుడు, వార్ సైరన్లు నిలిపేసినప్పుడు ప్రజలు షాపులకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. మెట్రో స్టేషన్లు శరణార్ధి శిబిరాలుగా మారాయి. ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. కానీ, కర్ఫ్యూ 36 గంటలపాటు కొనసాగడంతో జనం ఇబ్బంది పడ్డారు. వీలు కుదిరినప్పుడు కొందరు హోటళ్లకు వెళుతున్నారు. ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఆహారానికి పెద్దగా ఇబ్బందులు ఏర్పడటం లేదు.

 
పశ్చిమ దేశాలు ప్రకటించిన మిలిటరీ సాయం ఎప్పుడు యుక్రెయిన్‌కు అందుతుంది? ఈ సాయాన్ని యుక్రెయిన్‌కు ఎలా అందిస్తాయి?- క్రిస్టోఫీ బోర్గియా, కెనడా
మార్క్ లావెన్: ఇప్పటికే కొంత మిలిటరీ సాయం అందుతోంది. పోలండ్ ఇప్పటికే సరిహద్దుల ద్వారా ఆయుధాలు చేరవేసింది. అమెరికా 90 టన్నుల ఆయుధ సామాగ్రిని పంపింది. యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి ఎలాంటి సాయం చేయరాదన్న సంప్రదాయాన్ని స్వీడన్ పక్కనబెట్టింది, తాజాగా యూరోపియన్ యూనియన్ కూడా యుద్ధ సంక్షోభంలో ఉన్న ప్రాంతానికి ఆయుధ సాయం ఇవ్వరాదన్న నిర్ణయాన్ని పక్కనబెట్టింది. ఇక ఎలా సరఫరా చేస్తారన్న విషయానికి వస్తే, పోలండ్‌ను పశ్చిమ దేశాలు ఆయుధ సరఫరా హబ్‌గా మార్చుకున్నాయి. వీలైనంత త్వరగా ఆయుధాలను యుక్రెయిన్‌కు పంపాలని పశ్చిమదేశాలు భావిస్తున్నాయి.

 
రష్యా సైన్యం తన పూర్తి సామర్ధ్యాన్ని వినియోగిస్తోందా? రవాణా సమస్యల కారణంగా యుద్ధాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లలేక యుక్రెయిన్ ఆక్రమణ ఆలస్యమవుతోందా?- జాన్, అమెరికా
లైస్ డౌసెట్: నేను కీయెవ్‌లోనే ఉన్నాను. చాలామంది రష్యా సైన్యం కీయెవ్‌ను ఆక్రమించుకుందని భావిస్తున్నారు. కానీ, అది కొద్ది గంటలపాటే సాగింది. యుక్రెయిన్ దళాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. రష్యా సైన్యం యుక్రెయిన్‌లో అన్ని ప్రాంతాలలో సంచరిస్తూ కనిపిస్తున్నా, అనుకున్నంత వేగంగా మాత్రం లేదు.

 
రష్యా ప్రణాళిక ప్రకారం వెళ్లలేకపోతోంది అని చెప్పలేం. ఎందుకంటే, అసలు పుతిన్ ప్లాన్ ఏంటో ఎవరికీ తెలియదు. పెట్రోలు అందక రష్యా సైన్యం ఇబ్బందులు పడుతోందన్న వార్తలు అక్కడక్కడా వినిపించాయి. ఖార్కియెవ్ నగరంలో రష్యా, యుక్రేనియన్ సైన్యాలు హోరాహోరీ తలపడినట్లు కూడా తెలుస్తోంది. ఈశాన్య ప్రాంత నగరమైన చెర్నిహివ్, దక్షిణాదిలోని మారిపుల్ సహా అనేక పట్టణాలపై రష్యా దాడులు చేసింది.

 
యుక్రెయిన్ ప్రెసిడెంట్ పిలుపుతో ఎన్ని దేశాలు తమ సైన్యంతో సహకారం అందించడానికి ముందుకు వచ్చాయి?-జార్జ్ మెనాచెరీ, కేరళ, ఇండియా
మార్క్ లావెన్: దీని మీద స్పష్టత లేదు. యుక్రెయిన్ చాలా దేశాలను సాయం రమ్మని కోరింది. కానీ, దాని మీద ఎంతమంది స్పందించారన్నది తెలియదు.

 
ఒకవేళ రష్యా యుక్రెయిన్ ఆక్రమిస్తే ఆ తర్వాత ఏం జరగబోతోంది?-ఎన్హన్లా, దక్షిణాఫ్రికా
లైస్ డౌసెట్: ఇది యుక్రెయిన్‌ అస్థిత్వానికి సంబంధించిన ప్రశ్న. ప్రపంచానికి కూడా ఇది ప్రమాదకరమే. ముందు రష్యా బలగాలు యూరప్‌లోని రెండో అతి పెద్ద దేశంలోని ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించుకోవాల్సి ఉంటుంది. ఇందులో రాజధాని కీయెవ్ కూడా ఉంటుంది. ఇది దాదాపు 30 లక్షల జనాభా ఉన్న నగరం. యూరప్, నాటో దేశాలకు అనుకూలమైన వారు ఇక్కడ ఎక్కువమంది ఉంటారు.

 
టెలివిజన్ స్టేషన్‌లు, అధ్యక్ష భవనాలను స్వాధీనంలోకి తీసుకుంటే ఆక్రమణ పూర్తయినట్లేనని చరిత్ర చెబుతోంది. కానీ ఇక్కడ అదొక్కటే చాలదు. ఈ ప్రాంతంలో ప్రతిదాడులు కూడా ఎక్కువగా జరగుతున్నాయి. యుక్రెయిన్‌ను ఆక్రమించుకున్నా, ఇక్కడ తిరుగుబాటు కొనసాగవచ్చు. తిరుగుబాటుదారులకు అనేక వైపుల నుంచి మద్ధతు వస్తుంది. ఈ ఆక్రమణ నిలుస్తుందని చెప్పడం కష్టం. అయితే, ఇది చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మాత్రం మిగులుతుంది.

 
రష్యా ఇప్పుడే దాడికి ఎందుకు దిగింది? రెండు మూడేళ్లు దాటిన తర్వాత ఎందుకు చేయకూడదు? ఈ ఆక్రమణ లేదా దాడికి ప్రధానమైన కారణాలేంటి ? -అన్నా, హవాయి
లైస్ డౌసెట్: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలామందికి దీని సమాధానం తెలియదు. ఈ యుద్ధాన్ని చాలామంది పుతిన్ యుద్ధంగా చెబుతున్నారు. ఒక దేశాన్ని అస్థిత్వం లేకుండా చేయడానికి ఆయన ఎంత వరకు పోగలరో ఎవరూ చెప్పలేరు. అఫ్గానిస్తాన్‌లో వైఫల్యం తర్వాత నాటో బలహీనతను పుతిన్ గుర్తించారని, ముఖ్యంగా అమెరికా వైఫల్యాన్ని ఆయన గమనించారని చాలామంది అంటున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఎక్కువగా ఏకాంతంలో గడిపిన కారణంగా ఆయనలో యాంగ్జయిటీ పెరిగిందని మరికొందరు అనుమానిస్తున్నారు.

 
యుక్రెయిన్‌లో రష్యన్ భాష మాట్లాడేవారు ఈ యుద్ధం గురించి ఏమనుకుంటున్నారు?-మాన్ చున్ సియు, లండన్
లైస్ డౌసెట్: రష్యా మద్ధతున్న తిరుగుబాటుదారుల స్వాధీనంలో ఉన్న ప్రాంతాలలో సంబరాలు జరగడం మేం చూశాం. దోన్యస్క్, లూహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించడంపై కొందరు బీబీసీ ప్రతినిధులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. కానీ ఎంతమంది దీన్ని ఆహ్వానిస్తున్నారనేది తెలియదు. ఎందుకంటే గత ఎనిమిదేళ్లలోఇక్కడి వారి జీవితాలు చాలా మారిపోయాయి. చాలామందికి పెన్షన్లు కూడా అందడం లేదు. రష్యన్ భాష మాట్లాడేవాళ్లంతా రష్యా అనుకూలురు అనుకోవడానికి వీలులేదు. ప్రెసిడెంట్ జెలియెన్క్సీ సహా చాలామంది రెండు భాషలు మాట్లాడగలరు.

 
ఆర్ధిక ఆంక్షలతో రష్యా దిగివస్తుందని అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు ఎందుకు అనుకుంటున్నాయి?-ఆరగార్న్, లండన్
లైస్ డౌసెట్: రష్యా యుక్రెయిన్‌పై దాడి చేయడంతో, ఒకదాని తర్వాత ఒకటిగా ఆర్ధిక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వాటిని కొందరు యుక్రేనియన్లు స్వాగతించినా, ఇవేమీ సరిపోవని, అధ్యక్షుడు పుతిన్ మనసు మార్చవని తేల్చి కొందరు యుక్రేనియన్లు అన్నారు. అయితే, రష్యా ఆక్రమణ మొదలు పెట్టిన తర్వాత కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్నాయి. ఆంక్షలను అమలు చేయడానికి కొన్ని దేశాలకు వారాలు, నెలలు కూడా పడుతుంది. అయితే కొన్ని ఆంక్షలు రష్యా కరెన్సీ, స్టాక్‌ మార్కెట్‌లు, ధనికులైన ఒలిగార్చ్‌ల సంపదను, అత్యంత పేదల జీవితాలను దెబ్బతీస్తున్నాయి.

 
రష్యా వైమానిక శక్తి ముందు, యుక్రెయిన్ సైనిక దళాలకు ఆయుధాలు సరఫరా చేయడం సాధ్యమేనా? - ఆండీ షెరిడాన్
మార్క్ లావెన్: ఇవన్నీ యుక్రెయిన్ పశ్చిమ సరిహద్దుల ద్వారా ఆ దేశానికి చేరుతున్నాయి. ముఖ్యంగా పోలండ్ ద్వారా రవాణా అవుతున్నాయి. అమెరికా, కెనడా నుంచి వచ్చిన మిలిటరీ సాయం, రష్యా సైన్యంతో ఇబ్బందులు లేని ప్రాంతాల గుండా యుక్రెయిన్ దేశంలోకి ప్రవేశిస్తోంది. యుక్రెయిన్ గగన తలంపై నిషేధంతో ప్రయాణికులు విమానాలు కూడా తిరగడం లేదు. కొన్ని ఆయుధాలు పోలండ్, చెక్ రిపబ్లిక్ దేశాల నుంచి రైళ్ల ద్వారా కూడా చేరుతున్నాయి. ఇది ఇప్పటి వరకు యుక్రెయిన్ సైన్యానికి జరిగిన భారీ ఆయుధ సరఫరా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి