Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ రైతు పొలంలో భారీ వజ్రం, ధ్రువీకరించిన నిపుణులు: ప్రెస్ రివ్యూ

Advertiesment
తెలంగాణ రైతు పొలంలో భారీ వజ్రం, ధ్రువీకరించిన నిపుణులు: ప్రెస్ రివ్యూ
, శనివారం, 10 అక్టోబరు 2020 (11:36 IST)
తెలంగాణలోని ఒక రైతుకు తన పొలంలో భారీ వజ్రం దొరికిన విషయం ఆలస్యంగా వెలుగు చూసినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వజ్రాలు, బంగారు నిక్షేపాలు ఉన్నాయంటూ జియలాజికల్‌ సర్వే ఇండియా (జీఎస్‌ఐ) గతంలో చేసిన ప్రకటనకు దీంతో బలం చేకూరింది.

 
రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ మండలానికి చెందిన ఓ రైతు పొలంలో భారీ పరిమాణంలో వజ్రం దొరికింది. సదరు రైతు బాగా చదువుకున్నవాడు కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఆ రాయిని హైదరాబాద్‌ ల్యాబ్‌లో పరీక్షలు చేయించాడు. పరీక్షల్లో అది వజ్రమేనని తేలిందని కథనంలో రాశారు.

 
అంతటితో సంతృప్తి చెందని సదరు రైతు.. ల్యాబ్‌ నివేదికను వజ్ర నిక్షేపాలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌కు చూపించాడు. ప్రొఫెసర్‌ కూడా అది వజ్రమేనని నిర్థరించారు. ఈ విషయం బయటికి వస్తే తన భూమిని ప్రభుత్వం ఎక్కడ స్వాధీనం చేసుకుంటుందోనన్న ఆందోళన చెందిన రైతు.. దాన్ని బయట పెట్టొద్దంటూ ఆ ప్రొఫెసర్‌ను వేడుకున్నాడని పత్రిక చెప్పింది.

 
ఈనెల మొదటి వారంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాలుగు శతాబ్దాల కిందటే మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు దొరకడంతో జీఎస్‌ఐ ఆధ్వర్యంలో పదేళ్ల పాటు పాటు సర్వే చేశారు.

 
ఈ సర్వేలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో వజ్రాలు, బంగారానికి సంబంధించిన నిక్షేపాలు ఉన్నాయని తేలింది. ఆయా జిల్లాల్లో ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో మ్యాపులు సైతం ఖరారు చేశారు. దీనిపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన జియో ఫిజిక్స్‌ విభాగం ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు.

 
నల్లగొండ జిల్లాలోని రామడుగు, చండూరు, గుర్రంపోడులో వజ్ర నిక్షేపాలు ఉన్నాయని, మిర్యాలగూడ సమీపంలోని ఉట్లపల్లి తదితర ప్రాంతాల్లోనూ రాంప్రెంట్స్‌ (ద్వితీయ శ్రేణి నాణ్యత కలిగిన) వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు ప్రొఫెసర్లు నిర్దారించారు. ఇక్కడ జీఎస్ఐ సర్వే చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కేంద్రానికి నివేదిక ఇచ్చారు.

 
దీనిపై స్పందించిన కేంద్రం సర్వే జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ అంశంపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఏడాది క్రితం నేషనల్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎండీసీ)ని ఆదేశించిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో దారుణం.. 2 నెలల మగబిడ్డను చర్చి వద్దనే వదిలేశాడు..