Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోల్డ్‌ లోన్: బంగారం తాకట్టు పెరుగుతోంది, కుదవ పెట్టిన నగలను మళ్లీ ఎందుకు తీసుకెళ్లడం లేదు?

Advertiesment
గోల్డ్‌ లోన్: బంగారం తాకట్టు పెరుగుతోంది, కుదవ పెట్టిన నగలను మళ్లీ ఎందుకు తీసుకెళ్లడం లేదు?
, బుధవారం, 23 జూన్ 2021 (11:25 IST)
''మా వారు బట్టల షాపులో సేల్స్‌మ్యాన్. కొడుకు ఫొటోగ్రాఫర్. కోవిడ్ దెబ్బకు ఇద్దరికీ పని లేకుండా పోయింది. దాచుకున్న కాస్త డబ్బుతో రెండు, మూడు నెలలు నెట్టుకొచ్చాం. ఆ తర్వాత మా కష్టాలు మొదలయ్యాయి. మా వారికి పని లేదు. మా అబ్బాయికి పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం వచ్చిన ఆర్డర్లు కూడా క్యాన్సిలై... అడ్వాన్సులు తిరిగి ఇవ్వమని కస్టమర్ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. చేసేదేమీ లేక నా నగలు తాకట్టు పెట్టి వాటిని తీర్చాం''
 
ఇది విశాఖపట్టణానికి చెందిన మణి కుమారి అనే గృహిణ కథ. ఇది ఒక్క మణికుమారి కథ మాత్రమే కాదు. గత 15 నెలలుగా కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోయిన అనేక మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలలో కనిపిస్తున్న ఆవేదన ఇది. ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న నగలను కోవిడ్ కారణంగా తాకట్టు పెట్టాల్సి వచ్చిందని మణికుమారి ఆవేదన వ్యక్తం చేశారు.
 
చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఆదాయ మార్గాలు లేక దాచుకున్న బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని ఆ సొమ్ముతో బతుకు బండి లాగిస్తున్నారు. బంగారంపై తక్కువ వడ్డీతో రుణాలు లభిస్తుండటంతో సామాన్య ప్రజలు చాలామంది బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. గోల్డ్ మీద బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లను గమనిస్తే బంగారం ఏ స్థాయిలో తాకట్టుకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
 
‘రుణాలు ఇవ్వలేకపోయాం’
భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరానికి అదుకుంటుందనే ఉద్దేశంతోనే ఎక్కువమంది బంగారాన్ని కొంటుంటారు. కోవిడ్ సమయంలో అ అవసరం చాలా మందికి వచ్చింది. సాధారణంగా బంగారాన్ని అత్యవసరమైతే తప్ప భారతీయులు అమ్మడం లేదా తాకట్టు పెట్టడం చేయరు. ఒకవేళ అత్యవసరమైతే అమ్మడం కన్నా తాకట్టు పెట్టడానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు పోయినవారు, వ్యాపారాలు నడవని వారు ఇంట్లో ఉన్న బంగారు అభరణాల్ని పట్టుకుని బ్యాంకుల ముందు క్యూలో నిలబడ్డారు.
 
''మా బ్రాంచ్‌లో ఇంతకు ముందు రోజుకు మూడు, నాలుగు గోల్డ్ లోన్స్ మాత్రమే ఇచ్చేవాళ్లం. కానీ కోవిడ్ మొదలైనప్పటి నుంచి రోజు 10 నుంచి 15 మంది వస్తున్నారు. వీళ్లందరికి రుణాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. స్టాఫ్ తక్కువగా ఉండటం, గోల్డ్‌ని అసెస్ చేసే అప్రైజర్స్ అందుబాటులో లేకపోవడంతో వచ్చిన వాళ్లందరికి కూడా రుణాలు ఇవ్వలేకపోతున్నాం'' అని విశాఖలోని సీతమ్మపేట సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ లోకేశ్వరి బీబీసీతో చెప్పారు.
 
''మా దగ్గర గోల్డ్ లోన్ తీసుకున్న వారిలో చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారే ఎక్కువ. కొంతమంది గత సంవత్సరం లోన్ తీసుకుని ఇప్పటి వరకు తీర్చలేదు. నోటీసులకు స్పందించకపోతే వాటిని వేలం వేయడం తప్ప మరో మార్గం లేదు'' అన్నారామె. ''నేను రెండు బ్యాంకులకు అప్రైజర్‌గా పని చేసేవాడిని. కోవిడ్ కారణంగా డిమాండ్ ఎక్కువ కావడంతో రెండు బ్యాంకులకు పని చేయలేక ఒకదాన్ని వదులుకున్నాను'' అని సెంట్రల్ బ్యాంక్ అప్రైజర్ ఎల్. బంగార్రాజు అన్నారు. దీనిని బట్టి గోల్డ్ లోన్‌లకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
రెండున్నర తులాలు...లోన్ తీర్చలేను
కోవిడ్ సమయంలో ఆదాయం కోల్పోయిన వారు, సంపాదన తగ్గినవారు అప్పులు చేయాల్సి వస్తోంది. బంగారం తనాఖా పెట్టి ఎక్కువ మంది రుణాలు తీసుకున్నారనే విషయం బ్యాంకులు ఇచ్చిన గోల్డ్‌లోన్‌ సంఖ్యను చూస్తే తెలుస్తుంది. అయితే, ఫస్ట్ వేవ్‌లో గోల్డ్ లోన్స్ తీసుకున్నవారిని సెకండ్ వేవ్ మరోసారి దెబ్బకొట్టడంతో... చాలామంది అప్పు తిరిగి చెల్లించలేక బంగారాన్ని బ్యాంకుల్లోనే వదిలేస్తున్నారు.
 
''కోవిడ్ ఫస్ట్‌వేవ్‌లో నా షాపు మూతపడింది. అప్పట్లో ఇంట్లో ఉన్న రెండున్నర తులాల బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టాను. తెలిసిన వాళ్ల వద్ద మరో 30 వేలు తీసుకుని షాపు ఓపెన్ చేశాను. బిజినెస్ పూర్తిగా ఇంకా పూర్తిగా ఊపందుకోకముందే సెకండ్ వేవ్ వచ్చింది. బ్యాంక్ రుణం తీర్చలేక, బయట తెచ్చిన డబ్బులు కట్టలేక అప్పుల్లో కూరుకుపోయాను'' అని శ్రీకాకుళంలో ఫ్యాన్సీ షాప్ నడుపుతున్న సునీల్ అన్నారు. ''అసలు, వడ్డీ పోగా ఏమైనా మిగిలితే ఇవ్వండని బ్యాంకు వారిని అడిగాను'' అని సునీల్ చెప్పారు.
 
నాన్ బ్యాంకింగ్ కంపెనీల హవా
గోల్డ్‌లోన్స్‌కు పెరిగిన గిరాకీకి అనుగుణంగా బ్యాంకులు ఆ స్థాయిలో లోన్స్ ఇవ్వలేకపోతున్నాయి. అటు నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సంస్థలు కూడా గోల్డ్ లోన్స్ ఇస్తున్నాయి. వాటికి వ్యాపారం ఊహించని స్థాయిలో జరిగింది. కరోనా కష్టకాలంలో చాలా మందికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ గోల్డ్ కంపెనీలే దిక్కయ్యాయి.
 
''బిజినెస్ లోన్స్ ఇస్తున్నమాకు గోల్డ్ లోన్ కూడా పెట్టుకుంటే పని భారం అవుతుందని అనుకున్నాం. కానీ, గోల్డ్ లోన్స్ టార్గెట్స్ చాలా ఈజీగా అయి పోతున్నాయి. మేం వాళ్లని అడగడం కంటే... కస్టమర్లే వచ్చి లోన్ కావాలని అడుగుతున్నారు'' అని విశాఖలోని బజాబ్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌లో బిజినెస్ లోన్స్ రిప్రజెంటెటీవ్‌గా పని చేస్తున్న మధుసూదన్ అన్నారు. కరోనాకు ముందు ఒక్కో బ్రాంచ్‌కు 30మంది కస్టమర్లు వస్తే ఇప్పుడు ఆ సంఖ్య 70కి చేరిందని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇలాంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందని ఆయన అన్నారు.
 
''గతేడాది మే నుంచి గోల్డ్ లోన్స్ విపరీతంగా పెరిగాయి. కోవిడ్ తగ్గకపోవడంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదు. మా వద్ద తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు ఎక్కువ మంది రావడం లేదు. కనీసం 50శాతం మంది తమ బంగారాన్ని వదిలేసినట్లు కనిపిస్తోంది. దాదాపు అన్ని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో ఇదే పరిస్థితి ఉంది'' అని ముత్తూట్ ఫైనాన్స్ రీజినల్ మేనేజర్ ఒకరు చెప్పారు.
 
లోన్స్ ఇచ్చేశారు...రికవరీ కష్టమే
కోవిడ్ కారణంగా ఎదురైన ఆర్థిక సమస్యల నేపథ్యంలో బ్యాంకులన్ని బంగారం విలువలో 90 శాతం వరకు రుణాలు ఇచ్చాయి. అప్పడు బంగారం ధర కూడా గరిష్టంగా గ్రాము రూ.5600 వరకు పలికింది. ఆ సమయంలో చాలా మంది గోల్డ్ లోన్లు తీసుకున్నారు. అయితే, ఇప్పుడు బంగారం ధర తగ్గడంతో బ్యాంకులో బంగారాన్ని వెనక్కి తీసుకోవడంపై పునరాలోచిస్తున్నారు.
 
''రెండు, మూడు తులాలు కుదువ పెట్టిన వారు వాటిని తీసుకోవడం కంటే... మళ్లీ తిరిగి కొనుక్కునేందుకు మొగ్గు చూపుతారు'' అని ఏయూ ఎకనామిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం.ప్రసాదరావు చెప్పారు. ఇది బ్యాంకింగ్ సంస్థలకు ఇబ్బందికరమైన పరిణామమేనని ప్రసాదరావు అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల కోట్ల దాకా బంగారంపై రుణాలు ఇచ్చారని ప్రొఫెసర్ ప్రసాదరావు వెల్లడించారు. ఇందులో రూ.1.2లక్షల కోట్ల వరకు ప్రభుత్వ బ్యాంకులు, మిగతాది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అందించాయని ఆయన తెలిపారు.
 
''ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది రూ.20వేల కోట్ల గోల్డ్ లోన్లు ఇచ్చింది. అంతకు ముందు ఈ బ్యాంక్ ఇచ్చింది కేవలం రూ.3 వేల కోట్లే. దేశంలో గోల్డ్ లోన్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు ఉంటుందని అంచనా" అని ప్రొఫెసర్ ప్రసాదరావు వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం.. ఇప్పుడే స్కూల్స్ వద్దు.. నీతి ఆయోగ్