Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Godavari Floods: పోలవరం ముంపు మండలాల ప్రజల పరిస్థితి ఏమిటి? ఇక ఆ గ్రామాల్లో నివాసాలు కష్టమేనా?

Advertiesment
Godavari flood
, శుక్రవారం, 22 జులై 2022 (16:46 IST)
వరదల సీజన్ ఆరంభంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో గోదావరి విరుచుకుపడింది. జూలైలో ఇవే పెద్ద వరదలు కాగా, 10 రోజులుగా వరద నీటిలోనే నానుతున్న వందల గ్రామాలున్నాయి. ఈసారి వరదల్లో ప్రాణ నష్టం నియంత్రించినా, అసాధారణ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భద్రాచలం దిగువన పోలవరం ముంపు మండలాల నుంచి కోనసీమ లంకల వరకూ తీవ్రంగా వరద తాకిడికి గురయిన తరుణంలో నష్టపరిహారం మాటేమిటి? గోదావరి ఎగువన శాంతించినా.. పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న గ్రామాల్లో నీటి ప్రవాహం తగ్గకపోవడానికి కారణాలు ఏమిటి, అక్కడి ప్రజల భవిష్యత్తు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

 
గతం కన్నా ఎక్కువ నష్టమే
గోదావరి నదికి భద్రాచలం వద్ద నమోదయిన నీటి మట్టం రికార్డుల ప్రకారం.. మొన్నటి జూలై 15 నాటి వరద ప్రవాహం గడిచిన 70 ఏళ్లలో మూడో అతి పెద్దది. అత్యధికంగా 75.6 అడుగుల నీటిమట్టం 1986లో నమోదయ్యింది. ఆ తర్వాత 1990లో 70.8 అడుగులకు చేరింది. 2016లో 66.8 అడుగులకు మాత్రమే వరద చేరింది. ఈసారి మాత్రం అది 71.9 అడుగులుగా నమోదు కావడంతో అతి పెద్ద వరదల్లో ఒకటిగా నిలిచింది. ఈ సారి వరదల మూలంగా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇదివరకు వరదల సమయంలో కరకట్ట తెగిపడిన సమయాల్లో తీవ్రంగా ప్రాణనష్టం సంభవించింది. 1986, 1990, 2006లో అలా జరిగింది. కానీ ఈసారి ఏటిగట్లకు అలాంటి సమస్య ఉత్పన్నం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి వరద ప్రవాహం సాగింది. ఎక్కువ రోజులపాటు వరద కొనసాగుతోంది. ఇప్పటికే పది రోజులు దాటిపోయింది. ఆగస్టు సీజన్ ముందుండడంతో మరికొన్నాళ్లపాటు వరద తీవ్రత కొనసాగేలా కనిపిస్తోంది. ధవళేశ్వర్యం బ్యారేజ్ నుంచి 15 లక్షల క్యూసెక్కుల పైగా ప్రవాహం వారానికి పైగా కొనసాగుతోంది. దీనివల్ల అపారమైన ఆస్తి నష్టం జరిగింది. సామాన్యులు, తమ ఇళ్లు, వస్తువులు, పంటలు, పశు సంపద కోల్పోయారు. రోడ్లు, విద్యుత్ లైన్లు, ఇతర రూపాల్లోనూ నష్టం వాటిల్లింది. ఈసారి నష్టం చాలా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.

 
పోలవరం ప్రాజెక్టు ముందూ.. ఆ తర్వాత
ఈ సారి వరదల్లో మరో ముఖ్యమైన మార్పు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నిర్మాణం. కాఫర్ డ్యామ్ కారణంగా ప్రవాహం దిశ మారడం. గతంలో గోదావరి స్వేచ్ఛగా దిగువకు ప్రవహిస్తే ఈసారి అందుకు భిన్నంగా కాఫర్ డ్యామ్ కారణంగా గోదావరి ప్రవాహం స్పిల్ వే మీదుగా సాగింది. కాఫర్ డ్యామ్ కారణంగా గోదావరి వరద ప్రవాహానికి పడిన అడ్డంకితో ఎగువన ఏపీకి చెందిన 8 మండలాలకు ముంపు బెడద పెరిగిందనే వాదన రెండేళ్లుగా వినిపిస్తోంది. ఈసారి ఏపీ పరిధిలోని ముంపు ప్రాంతాలకు తోడుగా తెలంగాణలోని భద్రాచలం, చర్ల, బూర్గంపహాడ్ వంటి ప్రాంతాలకు కూడా వరద తాకిడి పెరిగిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వంటి వారు విమర్శించారు.

 
వరద ప్రవాహానికి పడిన అడ్డుకట్ట మూలంగా భద్రచాలం దగ్గర గోదావరి ఉధృతి తగ్గినా ముంపు మండలాల్లో వరద ప్రభావం పూర్తిగా తగ్గడం లేదు. బుధవారం నాటికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి కన్నా దిగువకు చేరినప్పటికీ పోలవరం ముంపు మండలాల్లో మాత్రం వరద తాకిడి కొనసాగుతోంది. 20వ తేదీ నాటికి కూడా చింతూరు ప్రధాన వీధుల్లో వరద ప్రవాహం సాగుతున్న తీరు అందుకు తార్కాణంగా చెప్పవచ్చు. 21వ తేదీ నాడు కూనవరం, వీఆర్ పురం వంటి మండల కేంద్రాల్లో నడుం లోతు నీటి ప్రవాహంలోనే జనం కొట్టుమిట్టాడుతుండడానికి కాఫర్ డ్యామ్ కారణమని స్థానికుడు వీరన్నదొర అన్నారు.

 
“పోలవరం ప్రాజెక్టుకు ముందూ, ఆ తర్వాత అన్నట్టుగా వరద ప్రవాహం చూడాలి. గతంలో ఇంతకన్నా పెద్ద వరదలు వచ్చినప్పుడు మాకు రెండు, మూడు రోజుల మించి తాకిడి లేదు. ఈసారి అలా కాదు. పది రోజులవుతున్నా నీటి మట్టం తగ్గడం లేదు. ఇళ్లన్నీ నీళ్లల్లో నానుతున్నాయి. కాబట్టి ఇకపై భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక దాటగానే మా ఇళ్లన్నీ మునిగిపోవడం ఖాయంగా ఉంది. పైగా ప్రభుత్వం లెక్కలేసిన పోలవరం ముంపుకు మించి ఎక్కువ ప్రాంతాలు బ్యాక్ వాటర్ పాలు కావడం అనివార్యంగా ఈ వరదలు చాటుతున్నాయి” అని చింతూరు మండల కేంద్రానికి చెందిన టీచర్ ముడియం వీరన్న దొర ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం మార్కింగ్ వేసిన ప్రాంతాలను మించి వరద ప్రవాహం సాగడాన్ని చూస్తే తమకు ఏటా మూడు నెలలు వరద నీటిలో నానాల్సిన దుస్థితి తప్పేలా లేదు అంటూ ఆయన వాపోయారు.

 
పునరావాసమే పెద్ద సమస్య
పోలవరం ప్రాజెక్టు వద్ద 41.5 అడుగుల వద్ద మొదటి కాంటూరుగా ప్రభుత్వం ప్రకటించింది. కాఫర్ డ్యామ్ వద్ద ఆ స్థాయిలో నీటిమట్టం ఉంటే ఎంత వరకూ ముంపు బారిన పడుతుందనే అంచనాలు వేసింది. దానికి తగ్గట్టుగా మార్కింగ్ వేసి పునరావాసం, పరిహారం తొలుత వారికి అందిస్తామని ప్రకటించింది. మొదటి కాంటూరు పరిధిలో ఉన్న వారికి ప్యాకేజీ అందించడమే ప్రధానమని చెప్పింది. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా ఉంది. మొదటి కాంటూరు పరిధిలో ఉన్న వారికి కూడా కాలనీల నిర్మాణం, పరిహారం అందించడం వంటి విషయాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికే అనేక గడువులు దాటిపోయినా అది అమలు చేసిన దాఖలాలు లేవు. 2022 ఉగాది నాటికి పెట్టిన గడువు దాటి నాలుగు నెలలు గడుస్తున్నా అందులో కదలిక లేదు.

 
"పోలవరం ముంపు మండలాల్లో నివాసయోగ్యత కనిపించడం లేదు. ఈ వరదలు అదే చెబుతున్నాయి. వరద నీరు ఎగువన తగ్గినా మారుమూల గిరిజన గ్రామాలే కాకుండా మండల కేంద్రాలు కూడా కోలుకోవడం లేదు. నీరు తగ్గడం లేదు. గతంలో ఎంత వేగంగా వరద వస్తే అంతే వేగంగా తగ్గేది. ఈసారి మాత్రం వరద తగ్గడం లేదంటే ఇక మా ఇళ్లల్లో మేము ఉండాలంటే కష్టమే. అందుకే ఖాళీ చేస్తామని చెబుతున్నాం. కానీ పునరావాసం ఇవ్వడం లేదు. మాకు ప్యాకేజీ ఇవ్వకుండా మా ఊళ్లను ముంచేశారు. మేము ఏమి చేయాలి? ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి? కనీసం కూడా ఆలోచించరా.. వరదల్లో ఇచ్చే సహాయంతో మా కుటుంబాలు గడిచిపోతాయా? ప్రభుత్వం ఆలోచించాలి" అంటున్నారు మడకం సోమమ్మ.

 
చింతూరు మండలం వీరాపురం గ్రామానికి చెందిన సోమమ్మ ఇల్లు మొదటి కాంటూరు పరిధిలో లేదు. ఆమెకు పరిహారం లేదు. ఆమె ఇల్లు పది రోజులు దాటినా వరద నీటిలోనే ఉంది. దూరంగా ఎత్తైన ప్రదేశంలో టెంటు వేసుకుని ఆమె గడుపుతున్నారు. దిగువన ఉన్న వారికే పరిహారం అందించడంలో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని, ప్రభుత్వం తమను ఆదుకుంటుందనే నమ్మకం కలగడం లేదని ఆమె బీబీసీతో అన్నారు.

 
కొండమొదలు ప్రాంతంలో కొండలపైనే..
పోలవరం బ్యాక్ వాటర్ తాకిడికి తొలుత ప్రభావితమయ్యే మండలాల్లో దేవీపట్నం కూడా ఒకటి. కానీ అక్కడ కూడా నిర్వాసితులకు పరిహారం పంపిణీ పూర్తికాలేదు. దాంతో భారీ వరద ప్రవాహంతో గ్రామాలకు గ్రామాలు గోదావరి వరద నీటిలో నానుతున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు కొండలపై తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాల్లో గడుపుతున్నారు. కొండమొదలు ప్రాంతంలోని నాలుగు గ్రామాల్లో రెండు వందల మందికి పైగా గిరిజనులు కొండలపై తలదాచుకుంటున్నారని, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ గిరిజన సంఘం నాయకుడు లోతా రాంబాబు కోరారు.

 
‘‘ఇకపై నివాసాలకు ఈ గ్రామాల్లో వీలుండదని వరద తాకిడి చెబుతోంది. ప్యాకేజీ ఇస్తే ఇళ్లు ఖాళీ చేస్తామని నిర్వాసితులు అంటున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ల ఇళ్లల్లోకి నీళ్లు మళ్లిన తర్వాత కూడా పునరావాసం ఏర్పాటు చేసేందుకు జాప్యం చేయడం అమానవీయం. కాఫర్ డ్యామ్ పూర్తయిన తర్వాత ఏటా వరదల్లో మూడు, నాలుగు నెలల పాటు నరకయాతన పడుతున్న తీరు గమనించాలి. బాధితుల గోడుపై జగన్ పునరాలోచన చేయాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.
వరదలు తగ్గిన తర్వాత పునరావాసంపై దృష్టి పెడతామని అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ గాంధీ బీబీసీకి తెలిపారు. యంత్రాంగమంతా వరద సహాయంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టిందన్నారు.

 
దిగువన కూడా అంతే...
పోలవరం ప్రాజెక్టు దిగువన కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కాకినాడ జిల్లాలో కూడా ఈ వరదలు అపార నష్టానికి కారణమయ్యాయి. వివిధ వ్యవసాయ, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ వరద నష్టాలను పూర్తిగా అంచనా వేసేందుకు ఇంకా పరిస్థితి అనుకూలంగా లేదని మంత్రి చెల్లుబోయిన వేణు బీబీసీతో అన్నారు. వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత నష్టం అంచనా వేసి అందరినీ ఆదుకుంటామని ఆయన తెలిపారు. గతం కన్నా త్వరగా సీజన్ ఆరంభంలోనే వరదలు రావడంతో అనేక చోట్ల పంటలకు ఎక్కువ నష్టం జరిగిందని రైతులు అంటున్నారు. అదే సమయంలో దీర్ఘకాలం పాటు వరదలు కొనసాగుతుండడం నష్టానికి మరో కారణంగా భావిస్తున్నారు.

 
"వరద నీరు తగ్గడం లేదని గిరిజన గ్రామాలే కాదు.. లంక గ్రామాలు, గోదావరి తీర గ్రామాలు కూడా తలలు పట్టుకుంటున్నాయి. గతంలో వేగంగా వరద తగ్గేది. కానీ ఇప్పుడు పది రోజులుగా వరద నీరు ప్రవహిస్తోంది. మళ్లీ ఆగష్టులో వరదలకు అవకాశం ఉంది. ఏదో స్థాయిలో మరోసారి ప్రవాహం అనివార్యం. అప్పుడు కూడా ఇళ్లు, పొలాలు నీటిపాలయిపోతే ఇక ఈసారి రైతులు కోలుకునే అవకాశాలు లేవు. జనం కూడా మరింత అవస్థలు పడాల్సి వస్తుంది" అని మామిడికుదురు మండలం అప్పనపల్లికి చెందిన రైతు అడబాల ఆనందరావు అన్నారు. అరటి, కూరగాయల సాగు పూర్తిగా దెబ్బతిందని, ఆక్వా రైతులు కూడా నష్టపోయారని ఆయన అన్నారు. అందరినీ ఆదుకోవాలని ఆయన బీబీసీకి తెలిపారు.

 
అధికారిక లెక్కలు ఏం చెబుతున్నాయి?
ఈ వరదలను ‘‘అనూహ్య వరదలు’’గా ప్రభుత్వం పేర్కొంది. ఎగువన కురిసిన వర్షాల తాకిడికి ఏపీలోని ఆరు జిల్లాల్లో 54 మండలాలకు చెందిన 405 గ్రామల్లో వరద ప్రభావం పడిందని వివరించింది. అందులో 326 గ్రామాలు నీటిలో మునిగాయని వెల్లడించింది. 3,48,815 మందిని వరద బాధితులుగా ప్రకటించింది. ఈ వరదల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. వరద సహాయ కార్యక్రమాల్లో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు చెందిన 634 మంది పనిచేస్తున్నట్టు తెలిపింది. ఈ బృందాల సహాయంతో 183 మందిని వరదల నుంచి కాపాడి, 8991 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు ప్రకటించింది.

 
631 బోట్లు వినియోగించి సహాయక చర్యలు సాగిస్తున్నట్టు వెల్లడించింది. 218 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిలో 1,42,688 మందికి పునరావాసం కల్పించినట్టు తెలిపింది. సహాయ చర్యల్లో భాగంగా ఆహారం, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేసినట్టు తెలిపింది. వరద సహాయం పంపిణీ కోసం రూ.26.83 కోట్ల నిధులు వెచ్చించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. బాధితులకు బియ్యం, పప్పులు, పామాయిల్, ఉల్లి, బంగాళాదుంపలు అందించడమే కాకుండా పశుగ్రాసం పంపిణీ కూడా జరిగిందని తెలిపింది. వ్యవసాయ పంటలకు 2070 హెక్టార్లలో, ఉద్యానవన పంటలకు 8624 హెక్టార్లలో నష్టం వాటిల్లిందని ప్రకటించింది. 156 చోట్ల రోడ్లకు గండ్లు పడగా, 988 కిలో మీటర్ల మేర రోడ్లు ధ్వంసమయినట్టు వెల్లడించింది. 1146 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొంది.

 
అప్పట్లో అలా.. ఇప్పుడు స్పందించరా?
గతంలో ప్రాణనష్టం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వాలు వేగంగా స్పందించాయని, కానీ ఈసారి అందుకు భిన్నంగా పరిస్థితి కనిపిస్తోందని కోనసీమ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పి రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. 1986 వరద బాధితుల కోసం సీఎం ఎన్టీఆర్‌తో పాటుగా నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కూడా తరలివచ్చారని ఆయన గుర్తు చేశారు. 2006 వరదల్లో నాటి సీఎం వైఎస్సార్, యూపీఏ చైర్ పర్సన్‌గా ఉన్న సోనియా గాంధీ కూడా కోనసీమలో పర్యటించారని తెలిపారు. కానీ ఈసారి పోలవరం ముంపు మండలాల్లో గురువారం వరకూ ఏ ఒక్క మంత్రి కూడా మొఖం చూపించకపోవడం విస్మయకరం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు.

 
క్షేత్రస్థాయిలో పర్యటించలేదంటూ ముఖ్యమంత్రిని విపక్షాలు తప్పుబడుతున్నాయి. అయితే వరద సహాయ చర్యలకు ఆటంకం కలగకుండా, అందరినీ ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కోనసీమ జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణు బీబీసీతో అన్నారు. "గతం కన్నా యంత్రాంగం పెరిగింది. ప్రతీ 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ఉన్నారు. సచివాలయ సిబ్బంది ఉన్నారు. క్షేత్రస్థాయిలో సహాయం పూర్తిగా అందిస్తున్నాం. అధికారిక పర్యటనల పేరుతో ప్రచారానికి ప్రాధాన్యమివ్వడం మా విధానం కాదు. ప్రజలకు చేదోడుగా నిలిచేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. అందరినీ అదుకుంటాం. ఇప్పటికే సీఎం పలుమార్లు సమీక్షలు ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్‌లను నియమించి సహాయక చర్యలు జరిగేలా చూస్తున్నారు. ఎవరికీ సమస్య రాదు. పోలవరం ముంపు మండలాలకు కూడా అవసరమైన సహాయం అందుతోంది" అని ఆయన చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోదావరిఖని కుర్రోడుకి పోర్బ్స్ ఇండియా గుర్తింపు