శవం అంటేనే అల్లంత దూరం పోయేవాళ్లు ఉంటారు. అందులోనూ కరోనా మృతులంటే కన్నెత్తి చూడటానికే భయపడే వాళ్లు చాలామంది ఉన్నారు. కన్నవాళ్లు చనిపోయినా కడచూపు కోసం కూడా వెళ్లని వారి విషయం ఇటీవలి కాలంలో చూశాం, విన్నాం. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తానున్నానని, అందులోనూ ఓ మహిళా కాటికాపరి ముందుకొచ్చారు.
కరోనా కారణంగా చనిపోయిన 40మందికి అంతిమ సంస్కారం ఒంటరిగా నిర్వహించారు. అందుకే భద్రాచలం పట్టణంలో ముత్యాల అరుణ అనేకమంది నుంచి అభినందనలు పొందుతున్నారు. ముత్యాల అరుణ భద్రాచలం గోదావరి తీరంలో ఉన్న వైకుంఠఘాట్‌లో కాటి కాపరిగా పనిచేస్తున్నారు. మూడేళ్లుగా ఆమె ఇదే వృత్తిలో ఉన్నారు.
కరోనా కాలంలోనే కాకుండా అంతకుముందు నుంచీ భద్రాచలంలో అనాథ శవాలకు అంత్య క్రియలను నిర్వహిస్తున్నారు. దిక్కుమొక్కూ లేకుండా వదిలేసిన అనేక శవాలకు ఆమె బాధ్యతగా అంత్యక్రియలు చేపట్టారు. అనాధ శవాలకు చేసిన సేవ చూసే తనకు కాటికాపరి అవకాశం ఇచ్చారని అరుణ చెబుతున్నారు.
మహిళవి నువ్వేం చేస్తావన్నారు..
''నా భర్త 18 ఏళ్లుగా కాటికాపరి పనిలో ఉన్నారు. నేను ఇళ్లల్లో పనులు చేసేదానిని. తర్వాత నా భర్త ఆరోగ్యం బాగ లేకపోవడంతో నేను కూడా స్మశానంలోకి వచ్చేసాను. పిల్లలతో ఇక్కడే ఉండేదానిని. ఆయనకు సహాయం చేస్తూ అలవాటు చేసుకున్నాను. అయినా మహిళవి నువ్వేం చేస్తావని మొదట వద్దన్నారు" అన్నారు అరుణ. "మూడేళ్ళ క్రితం నా భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఘాట్ పెద్దలు సందేహించినా, అనాధ శవాలకు నేను చేసిన సేవ గుర్తించి నాకు కాటి కాపరిగా అవకాశం ఇచ్చారు. మొదట మూడు నెలలు చూస్తామని అన్నారు. ఇప్పుడు కొనసాగిస్తున్నారు'' అని బీబీసీకి వివరించారు.
మరో నలుగురి కడుపునింపుతూ..
ముత్యాల అరుణ తన బిడ్డలు, తండ్రిని కూడా పోషిస్తున్నారు. వారితోపాటుగా మరో ఇద్దరు అనాథలకు కూడా అన్నం పెడుతున్నారు. అయితే తనకు ప్రభుత్వ పథకాల ఎలాంటి లబ్ది చేరడం లేదని అరుణ బీబీసీకి తెలిపారు. ''నలుగురం ఉంటున్నాం. అంతా స్మశానం ఆవరణలోనే ఉంటాం. మాకు ఇల్లు లేదు. పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం తోడ్పాటు ఇస్తే బాగుంటుంది'' అన్నారామె.
కరోనా కాలంలో సేవ
కరోనా సమయంలో మృతదేహాల దహన సంస్కారం ప్రభుత్వాధికారులకు కూడా తలనొప్పి కలిగించింది. కొన్నిచోట్ల బుల్డోజర్ల సహాయంతో పూడ్చివేయడం వివాదాలకు దారితీసింది. భద్రాచలంలో మాత్రం ముత్యాల అరుణ తానొక్కరే అంత్యక్రియలు పూర్తి చేయడం పలువురి ప్రశంసలను అందుకుంది.
''మేం చీకటి పడితే ఈ ఘాట్ ప్రాంతానికి రావాలంటేనే భయపడతాం. అలాంటిది ఆమె అక్కడే ఉంటుంది. ఎవరికి ఏ సమయంలో అవసరమున్నా తోడ్పడుతుంది. వరదల సమయంలో ఘాట్ ప్రాంతం అంతా గోదావరి నీటితో నిండి పోతుంది. అయినా ఆమె మనోధైర్యంతో సేవలు అందించడాన్ని ప్రభుత్వం గుర్తించాలి'' అని భద్రాచలం స్థానికుడు హుస్సేన్ షేక్ బీబీసీతో అన్నారు.