Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతుల నిరసనలు, మోదీ ప్రభుత్వానికి బలమైన సందేశం - అభిప్రాయం

Advertiesment
రైతుల నిరసనలు, మోదీ ప్రభుత్వానికి బలమైన సందేశం - అభిప్రాయం
, సోమవారం, 14 డిశెంబరు 2020 (13:17 IST)
దేశంలోని ప్రభుత్వేతర సమాజం లేదా పౌర సమాజం దేనికైనా నాయకత్వం వహించి ముందుకు నడిపించడం అనేది చాలాకాలంగా కనుమరుగైపోయి ఇప్పుడు మళ్లీ బయటకి రావడం ఒక ఆసక్తికరమైన విషయం. ప్రస్తుతం దేశంలో పౌర సమాజం ఒక ఉద్యమానికి ఇంత పెద్ద ఎత్తున నాయకత్వం వహిస్తుండడం మోదీ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తూ ఉండాలి.

 
మోదీ పార్టీ మొదటిసారి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచిన తరువాత వారి రాజకీయ సందేశం స్పష్టంగానే కనిపించింది..దేశంలో మెజారిటీ ప్రజలకు ఏది హితమో దాన్నే వీరు ముందుకు తీసుకు వెళతారు. ఈ క్రమంలో, మోదీ ప్రభుత్వం ప్రజలను తమకు ఒక ఎక్స్‌టెన్షన్ కౌంటర్‌గా తయారు చేసింది. సాధారణంగా మెజారిటీ ఆమోదించే ‘దేశ భక్తి’ లాంటి భావనలను బలోపేతం చేసే దిశగా పని చేస్తోంది.

 
‘యాంటీ నేషనల్’ పదాన్ని విస్తృతంగా వాడుతున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే..ప్రభుత్వానికి అనుగుణంగా ఆలోచించకపోతే యాంటీ నేషనల్ అనే పేరు వచ్చేస్తుందేమోననే ఒత్తిడికి ప్రజలు గురవుతున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి కొన్ని సంవత్సరాల్లోనే పౌర సమాజంలో ఉన్న వైవిధ్యం కనుమరుగవుతూ వచ్చింది.

 
రెండు దశల్లో ఆధిపత్యం సాధించారు. మొదట..అన్ని ప్రభుత్వేతర సంస్థలనూ (ఎన్జీవోలను) బ్యూరోక్రసీ పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు. రెండో దశలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే, అది దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశంగా చిత్రీకరించడం మొదలుపెట్టారు. వరవరరావు, సుధా భరద్వాజ్, స్టెన్ స్వామిలాంటి మానవ హక్కుల కార్యకర్తలను అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరిస్తూ కేసులు మోపారు. ఈ కేసులపై విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే ఎన్నో అనుమానాలు, సందేహాలు కలుగక మానవు.

 
మెజారిటీవాదం పేరుతో ప్రజలను ఏకం చెయ్యడం మొదలుపెట్టారు. ఇది మెజారిటీ ఆధిపత్యాన్ని, వారి అగ్ర నేతల స్థానాన్ని బలోపేతం చేసే వ్యూహం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే సంస్థల చేత మెడలు వంచి ప్రభుత్వానికి సలాములు కొట్టిస్తారు లేక వాటిని వ్యర్థమైనవాటిగా నిరూపిస్తారన్న సంకేతాన్ని కూడా అందించారు. దేశ భద్రత ప్రమాదంలో ఉందని, దేశాన్ని కాపాడడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నమ్మించారు. కరోనావైరస్‌లాంటివి ఈ భావనలకు మరింత ఆజ్యం పోసాయి. పౌర సమాజం ఈ విధంగా ప్రతిఘటించడానికి కారణం..ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాల వల్ల ఉత్పన్నమయిన సమస్యలే.

 
ఈ విధానాలు పౌర సమాజం భవిష్యత్తుపై ప్రశ్నలను లేవనెత్తాయి. మొదటిది, అసోంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)ను అమలు చేసే ప్రయత్నం చెయ్యడం...ఇది భారతీయ సమాజం గౌరవాన్ని దెబ్బ తీసింది. పౌరసత్వం పొందడం అనేది నకిలీ ధృవపత్రాల సహాయంతో సాధించగల విషయం అనే స్థాయికి దిగజార్చింది. ఆఖరికి, ఈ పని జరగడం, జరగకపోవడం అనేది ఎవరో ఒక గుమాస్తా ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది అనే స్థితికి తీసుకువచ్చారు.
ఎన్ఆర్‌సీని వ్యతిరేకించడం అనేది బీజేపీ మెజారిటివాదానికి అడ్డంకిగా నిలిచింది. ఏది ఏమైతేనే ప్రజలు అసమ్మతిని తెలియజేసే మార్గాన్ని కనుగొన్నారు.

 
షాహీన్ బాగ్ నిరసనలు - పౌర సమాజం సంఘటితం కావడం
దిల్లీలోని జామియా మిలియా ప్రాంతంలో చిన్న మొత్తంలో ముస్లిం గృహిణులు చేసిన నిరసన పెద్ద సంఘటనగా మారింది. ఈ నిరసన ప్రదర్శనలు అలజడిని సృష్టించాయి. ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఈ నిరసనలు శాంతియుతంగా, సరళంగా జరిగాయి. ఆ మహిళలు రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా అర్థం చేసుకున్నారనిపించింది. దేశ పౌరసత్వం అంటే ఏమిటో వారిలో స్పష్టంగా కనిపించింది.

 
ఆ మహిళలు ఇచ్చిన సందేశం, గాంధీ, భగత్‌సింగ్, అంబేద్కర్ ఫొటోలు పట్టుకుని వారు తెలిపిన నిరసన విధానం దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. ప్రజాస్వామ్యానికి ఉత్సవం జరిగినట్టు తోచింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ, ట్రేడ్ యూనియన్ సహాయం లేకుండా ఎలా ప్రతిఘటించవచ్చో ఈ నిరసన ప్రదర్శనలు చూపించాయి. పౌర సమాజాన్ని సంఘటితపరచడానికి ఈ విత్తనం చాలు. ప్రజాస్వామ్యం రాజకీయ నేతల పేటెంట్ కాదు. వీధులే ప్రజాస్వామ్యనికి థియేటర్లు. ప్రతిఘటించడానికి వేరే ఆయుధాలేమి అక్కర్లేదు...శరీరమే చాలు.

 
అధికారం కన్నా ప్రజాస్వామ్యనికే ప్రజలు పెద్ద పీట వేస్తారని ఈ నిరసనలు స్పష్టం చేసాయి. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కోవిడ్ పేరు చెప్పి షాహీన్ బాగ్ శిబిరాలను ఎత్తివేయించారు. సీఏఏ ద్వారా ప్రవేశపెట్టిన డిజిటల్ వ్యూహం కోవిడ్‌తో మరింత బలపడింది. ప్రజల ఆరోగ్య పర్యవేక్షణ పేరుతో ఈ నిరసనలనుంచీ దృష్టి మళ్లించారు. ప్రజల పట్ల ప్రేమగా భ్రమింపజేసే వ్యూహాన్ని ప్రదర్శించారు.

 
ఇలాంటి పర్యవేక్షణల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాంకేతిక నిఘాలను ఎదుర్కోడానికి మార్గాలు అన్వేషించాలి. అసమ్మతి తెలిపే నిపుణుల అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. సీఏఏ నిరసనలు.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న స్పృహను తీసుకొచ్చాయి. కోవిడ్ విధానాలు, రైతుల నిరసనలు...రక్షణ, అభివృద్ధి పేరుతో ప్రభుత్వ విధానాలు ప్రజల జీవనోపాధిని ఎలా దెబ్బ తీస్తున్నాయో తెలిసేలా చేసాయి. రైతుల పోరాటాన్నిదేశ వ్యతిరేక ఉద్యమాలుగా, నక్సలైట్ల పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పౌర సమాజం గమనిస్తోంది. రైతుల నిరసనలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలిచే దిశలో కదులుతోంది.

 
ముఖ్యంగా టీవీ మీడియా రైతుల ఉద్యమాన్ని చిన్నచూపు చూస్తూ, ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ప్రజలు గ్రహించారు. అనేక టీవీ ఛానళ్లు..రైతుల పోరాటాన్ని, మోదీ మీద తిరుగుబాటుగా చిత్రీకరించాయి. ప్రజలు తమ జీవనోపాధికి సంబంధించిన ప్రశ్నలు సంధిస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు, ప్రజలు అసమ్మతి తెలియజేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ సమీపంలో చీరాల నేత కార్మికులు డీసెంట్రలైజ్డ్ నెట్‌వర్క్‌ కావాలని ఆందోళన చేస్తున్నారు.

 
అయితే పౌర సమాజం తమ హక్కుల గురించి పోరాడడమే కాకుండా తోటి ప్రజల సమస్యల పట్ల సహానుభూతుని కూడా కలిగి ఉండాలి. రైతుల ఉద్యమం కేవలం పెద్ద రైతుల గొంతుగా మిగిలిపోకుండా సన్నకారు రైతుల, భూమిలేని శ్రామికుల గొంతుగా కూడా మారాలి. పౌర సమాజం ఈ సమస్యలన్నిటిపైనా దృష్టి పెట్టాలి. విభిన్న వర్గాల గొంతులు వినాలి. అధికారం తీసుకున్న పెద్ద పెద్ద నిర్ణయాలపై ఎలా చర్చించాలో ఆలోచించాలి. ఈ క్రమంలో పౌర సమాజం కొత్త నాలెడ్జ్ సోసైటీగా మారాలి. భారతీయ వైవిధ్యానికి ట్రస్టీగా కూడా ఉండాలి.

 
ఈ మార్పు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎన్నికల దృగ్విషయం కాదని, పార్టీల నినాదం కాదని స్పష్టమవుతోంది. ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మూగబోయినట్లుగా, నిష్ప్రయోజనంగా కనిపిస్తున్నాయి. పౌర సమాజం ముందు తడబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. వామపక్ష పార్టీలు ఏదో ఒక క్లబ్ లేదా ఎలీట్ సొసైటీలాగ కనిపిస్తున్నాయి.

 
అయితే, ఇదేదో ఒక ప్రయోగంలా కాకుండా పౌర సమాజం మేధావులతో కలిసి చర్చించి, చైతన్యవంతం కావాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఇదే పద్ధతిలో స్థానిక, అంతర్జాతీయ సమస్యల పట్ల కూడా ఇంతే చైతన్యవంతమయ్యే దిశగా కదలాలి. ఇకమీదట పర్యవేక్షణ వ్యవస్థ, రక్షణ వ్యూహం, కార్పొరేట్ వాదంతో పోరాటం ఇంత సులభంగా ఉండదు. పౌర సమాజం మరింత శక్తిని కూడగట్టుకుని పోరాటానికి సిద్ధం కావాలి.

 
(ఇవి రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు. రచయిత ఒక సామాజిక శాస్త్రవేత్త, సోనిపట్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ నాలెడ్జ్ సిస్టం డైరెక్టగా ఉన్నారు.)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్న కోడలితో మామ రంకుబాగోతం ... కళ్లార చూసిన అత్త ఏం చేసిందంటే...