Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాలలో భూప్రకంపనలు: ఇలాంటి ఘటనల తర్వాత మన ఇళ్లు ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?

earthquake

బిబిసి

, బుధవారం, 4 డిశెంబరు 2024 (15:15 IST)
బుధవారం ఉదయం తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది. ములుగులో దీని తీవ్రత 5.3 ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, అశ్వాపురం భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది. రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరం, జగ్గయ్యపేట పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి ప్రజలు భయంతో బయటకు వచ్చారు. ములుగులో రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.
 
‘‘గతంలోనూ ఈ తరహా భూ ప్రకంపనలు వచ్చినప్పటికీ, అవి రిక్టర్ స్కేల్ పై 3-4 మధ్య మాత్రమే ఉండేవి. ప్రస్తుతం మాత్రం 5.3గా నమోదయింది. ఈ ప్రకంపనలు ఏటా సాధారణంగానే వస్తూ ఉంటాయి.’’ అని హైదరాబాదులోని త్రిబుల్ ఐటీ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్ ప్రదీప్ రామంచర్ల బీబీసీతో అన్నారు. దేశ రాజధాని దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో తరచూ ఇలా భూ ప్రకంపనలు వస్తుంటాయి. మన దేశంలో తరచూ వస్తున్న భూ ప్రకంపనలతో ప్రజలు కొన్నిసార్లు ఇళ్లలో ఉండేందుకు కూడా భయపడుతుంటారు. ఒకసారి భూకంపం ధాటికి గురయ్యాక, ఆ భవనంలో ఉండటం ఎంతవరకు సేఫ్ అనే విషయంలో ఆందోళన ఉంది.
 
భూకంపాలకు గురైన భవనాల భద్రతను అంచనా వేసేందుకు స్టాండర్డ్ కోడ్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని సీఎస్ఐఆర్-సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ ఎర్త్ క్వేక్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ మాజీ అధిపతి ప్రొ. ప్రదీప్ కుమార్ రామంచర్ల రూపొందించారు. ఈ కోడ్ సాయంతో భూకంపంతో ప్రభావితమైన భవనంలో తిరిగి నివాసం ఉండటం ఎంతవరకు సురక్షితమనే విషయం తెలుసుకోవచ్చంటున్నారు.
 
అసలు ఏమిటీ కోడ్?
ఏదైనా వస్తువు లేదా భద్రత విషయంలో ప్రమాణాలు పాటించేందుకు ప్రత్యేక కోడ్ ఉంటుంది. దీనికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) నుంచి గుర్తింపు అవసరం. అలా భూకంపం ధాటికి గురైన భవనాల భద్రతను కొలిచేందుకు నిర్దేశించినదే ప్రదీప్ కుమార్ తయారు చేసిన టెక్నాలజీ. దీనికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్డ్ నుంచి ‘కోడ్’ గుర్తింపు దక్కింది. ఐఎస్18289:2023 తో కోడ్ అందుబాటులోకి వచ్చింది.
 
కోడ్ ఎలా పనిచేస్తుంది..?
భూకంపం వచ్చినప్పుడు భవనాలు దెబ్బతినడం చూస్తుంటాం. కొన్ని ‌‍భవనాలు పైకి చూసేందుకు బాగున్నప్పటికీ, అంతర్లీనంగా ప్రభావం ఉంటుంది. భూకంపం తర్వాత కూడా కొన్నిసార్లు పెద్ద సంఖ్యలో స్వల్ప ప్రకంపనలు వస్తుంటాయి. వీటిని ఆఫ్టర్ షాక్స్ అంటారు. వాటివల్ల భవనాలపై మరింత ప్రభావం పడుతుంటుంది. అలాంటప్పుడు వాటిల్లో ఉండటం శ్రేయస్కరమా.. కాదా అనేది ముందుగా గుర్తించాలి.
 
‘‘మన దేశ భూభాగంలోని 60శాతం ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిధిలో 80శాతం మంది ప్రజలు జీవిస్తున్నారు. భూకంపం వచ్చిన తర్వాత వరుస ప్రకంపనలు వస్తుంటాయి. 2015లో నేపాల్‌లోని గూర్ఖా జిల్లాలో వచ్చిన భూకంపం తర్వాత ప్రకంపనలు రెండేళ్ల పాటు కొనసాగాయి. దాదాపు 480 సార్లు ప్రకంపనలు రికార్డు అయ్యాయి. దానివల్ల అక్కడి ప్రజలు నెలల తరబడి ఇళ్ల ముందు టెంట్లు వేసుకుని ఉండాల్సి వచ్చింది. అలాంటప్పుడు భవనాల పటిష్టతను అంచనా వేసేందుకు ప్రత్యేక కోడ్ ఉంటే ప్రజలు సురక్షితంగా ఇళ్లలో ‌‍ఉండొచ్చు’’ అని బీబీసీతో చెప్పారు ప్రొ.ప్రదీప్ కుమార్. భూకంపాల తీవ్రతను తగ్గించే చర్యలకు సంబంధించి పరిశోధనలపై ఆయన 2008 నుంచి పని చేస్తున్నారు. ఈయన చేపట్టిన ప్రాజెక్టును ఎన్డీఎంఏ స్పాన్సర్ చేసింది.
 
ఎలా అంచనా వేస్తారంటే..
ఇప్పటివరకు ఉన్న టైపాలజీ(వర్గీకరణ) ప్రకారం ప్రతి భవనానికి వేర్వేరు ప్రమాణాల ప్రకారం భద్రత అంచనా వేయాల్సి ఉంటుంది. అన్ని ‌‍భవనాలను ఒకేసారి అసెస్ చేసేందుకు వీలుగా భారత్‌లో ప్రత్యేకంగా అసెస్ మేనేజ్మెంట్ లేదు. ప్రొ. ప్రదీప్ కుమార్ పరిశోధనలో భాగంగా భవనాలన్నింటికి కామన్‌గా ఉండే కోడ్‌ను రూపొందించారు. ఇందులో మొత్తం 32 ప్రశ్నలుంటాయి. భూకంపాలు వచ్చాక ఆయా భవనాల వద్దకు వెళ్లి వాటికి సమాధానాలను ఆన్‌లైన్‌లో నింపితే సరిపోతుంది. భవనం భద్రత స్థాయి ఆటోమేటిగ్‌గా వస్తుంది. భవనం ఎక్కడైనా పాడైందా? పగుళ్లు ఏమైనా వచ్చాయా? పునాదుల స్థాయిలో కదలిక వచ్చిందా? ఇలా వివిధ అంశాలను పరి‌‍శీలిస్తారు.
 
ఇదే విషయంపై ప్రదీప్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ముగ్గురు సభ్యులతో కూడిన సేఫ్టీ అసెస్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ల బృందం భవనాల వద్దకు వెళ్లి ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తుంది. అలా అన్ని ప్రశ్నలకు సమాధానాలు నింపిన తర్వాత ప్రత్యేకంగా కలర్ కోడ్ వస్తుంది. అందులో పచ్చ రంగు కలర్ కోడ్ వస్తే ‌‍భవనం నివాసానికి అనుకూలంగా ఉన్నట్లుగా తీసుకోవాలి. రెడ్ కలర్ కోడ్ వస్తే.. నివాసానికి అనువుగా లేదని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని సూచిస్తుంది. ఆరెంజ్ కలర్ కోడ్ వస్తే.. కొన్ని మరమ్మతులు లేదా రెట్రో ‌‍ఫిటింగ్ చేస్తే నివాసానికి వినియోగించుకోవచ్చు’’ అని చెప్పారు. సర్వే చేసేందుకు వివి‌ధ ప్రభుత్వ సంస్థల సహకారంతో వలంటీర్లను తీసుకుని శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
 
నేరుగా వెళ్లకుండానే సర్వే..
నేరుగా భవనాల వద్దకు వెళ్లకుండానే సర్వే చేసే వీలున్నట్లు ప్రదీప్ కుమార్ చెప్పారు. ఐఐఐటీలోని వివిధ వి‌‍భాగాల సహకారంతో నేరుగా డ్రోన్ టెక్నాలజీతో భవనాల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సర్వే చేసే వ్యవస్థను రూపొందించినట్లు చెప్పారు. ‘‘భూకంపాల ధాటికి గురైన భవనాల వద్దకు డ్రోన్లను పంపించి సర్వే చేయవచ్చు. ఇలా 11 అంశాలకు సమాధానాలు అప్పటికప్పుడు వస్తాయి. మిగిలిన అంశాలను డ్రోన్ ఫుటేజీ నుంచి చిత్రాలు తీసుకుని వాటి సాయంతో తెలుసుకోవచ్చు. కేవలం వారం, పది రోజుల్లో భవనాలకు భద్రత పరంగా పరిష్కారం లభిస్తుంది’’ అని ప్రదీప్ కుమార్ చెప్పారు.
 
ఈ కోడ్‌ను ఇళ్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పోలీసు భవనాలు, అగ్నిమాపక శాఖ భవనాలు, రవాణా సదుపాయాలు, పరిపాలన సౌకర్యాల కోసం కూడా వినియోగించుకోవచ్చు. రానున్న రోజుల్లో దే‌‍శవ్యాప్తంగా ‌‍భూకంపాల తర్వాత భవనాల భద్రతను అంచనా వేసేందుకు ఐఎస్18289:2023 కోడ్ ఉపయోగించే వీలుందని ప్రొ.ప్రదీప్ కుమార్ బీబీసీకి వివరించారు. ఈ విషయంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ జితేంద్ర కుమార్ చౌదరి స్పందించినట్లు ట్రిపుల్ఐటీ-హైదరాబాద్ వెల్లడించింది.
 
‘‘ ర్యాపిడ్ విజువల్ సర్వే లేదా సమగ్ర అధ్యయనంలో ‌‍భాగంగా కోడ్‌ను అనుసరించి భూకంపాల తర్వాత భవనాలలో ఉండేందుకు వీలుంటుందా.. లేదా తెలుస్తుంది. ఇంజినీర్లకు కూడా భవనాలకు ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాలనే విషయంపై అవగాహన వస్తుంది. రెడ్ ట్యాగ్ వస్తే భవనాల్లో ఉండకుండా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలకు వీలవుతుంది’’ అని చెప్పినట్లు ట్రిపుల్ఐటీ బ్లాగ్ లో రాసింది. కోడ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వెబ్ లింకు ద్వారా తెలుసుకోవచ్చు..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం...