భవిష్యత్తుపై ఆందోళనే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యలకు కారణమా?

సోమవారం, 14 అక్టోబరు 2019 (19:51 IST)
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె పదో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో ఉద్యోగులు సమ్మెను తీవ్రతరం చేసేందుకు పిలుపు ఇచ్చారు. ఆర్టీసీలో సెప్టెంబర్ జీతాలు ఇంకా అందలేదు. సమ్మె చేస్తున్నవారంతా వారంతట వారే ఉద్యోగం వదిలేసినట్లు పరిగణించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 
డిపోల బయట కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికే విద్యార్ధి సంఘాలు, రాజకీయ నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. ఉద్యోగ భవిష్యత్తు ఎటూతేలని పరిస్థితి, జీతాలు రాక ఆర్థిక భారం పెరగడంతో ఉద్యోగులలో ఆందోళన పెరుగుతోంది. దీనికి నిదర్శనమే ఖమ్మం ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి, రాణిగంజ్ డిపో ఉద్యోగి సురేందర్ గౌడ్ బలవన్మరణాలు.

 
శ్రీనివాస్ రెడ్డి శనివారం నిప్పంటించుకోగా.. సురేందర్ గౌడ్ ఆర్థిక భారం తట్టుకోలేక ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌‌లోని కార్వాన్‌లో సురేందర్ గౌడ్ నివాసం వద్ద సోమవారం పోలీసుల బందోబస్తు మధ్య వివిధ సంఘాల వారు, రాజకీయ నాయకులు సురేందర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు.

 
సురేందర్ గౌడ్ మరణానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనంటూ అక్కడున్న ఆర్టీసీ ఉద్యోగులు నినాదాలు చేశారు. మరోవైపు సురేందర్ గౌడ్ సతీమణి, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. తొలి రోజు నుంచి సురేందర్ సమ్మెలో పాల్గొంటూవచ్చారని ఆయన సోదరుడు రవి తెలిపారు.

 
''ఏడాది కిందట బిడ్డ పెళ్లి చేశాడు. కొంత అప్పు చేయాల్సివచ్చింది. మాది నిజామాబాద్. ఆస్తులేమీ లేవు. ఉంటున్న ఇల్లు కూడా కిరాయిదే. జీతంపైనే ఆధారపడి బతికే కుటుంబం. సమ్మె మొదలయ్యాక నాతో మాట్లాడుతూ ఏమవుతుందో ఏమో అన్నాడు అన్న. ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అన్నను చాలా బాధించింది. ఈలోగా జీతం రాకపోవడం, అప్పుల వడ్డీలు కట్టాల్సిన తేదీ దగ్గర పడటం వంటివి అన్న మరణానికి కారణమయ్యాయి" అన్నారు రవి.

 
సురేందర్ గౌడ్ తనయుడు సంకీర్తన్ గౌడ్ మాట్లాడుతూ తన తండ్రి జీతం అందరు అనుకుంటున్నట్టు వేలకువేలేమీ లేదన్నారు కంటతడి పెట్టుకుంటూ. "నేను ఒక మాల్‌లో పనిచేస్తాను, అమ్మ టైలరింగ్ పనిచేస్తారు, నాన్నది ఆర్టీసీ ఉద్యోగం. అందరం నెలంతా కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది. పదిహేనేళ్లుగా మా నాన్న చేసింది ఏంటంటే ఆర్టీసీకి తన ప్రాణాలు అర్పించడం" అంటూ ఇంటి బయట ఉన్న తన తండ్రి సురేందర్ గౌడ్ భౌతికకాయం వద్ద ఏడుస్తున్న తల్లిని ఓదార్చేందుకు కదిలాడు సంకీర్తన్.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆర్టీసీ సమ్మె: కండక్టర్ ఆత్మహత్య వార్త చూసి గుండెపోటుతో డ్రైవర్ తల్లి హఠాన్మరణం