Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్: ఇండియాలో కొత్త 'డబుల్ మ్యూటెంట్' వైరస్‌తో ప్రమాదమెంత? వ్యాక్సీన్‌కు లొంగదా?

కరోనావైరస్: ఇండియాలో కొత్త 'డబుల్ మ్యూటెంట్' వైరస్‌తో ప్రమాదమెంత? వ్యాక్సీన్‌కు లొంగదా?
, గురువారం, 25 మార్చి 2021 (21:59 IST)
దేశంలోని వివిధ ప్రాంతాలలో సేకరించిన శాంపిళ్లలో 'డబుల్‌ మ్యూటెంట్‌' వేరియంట్‌ కరోనా వైరస్‌ను నిపుణులు గుర్తించారు. ఒకే వైరస్‌లో రెండు మ్యుటేషన్‌లు ఉన్న ఈ వేరియంట్ ఎంతవరకు ప్రమాదకరం, వ్యాక్సీన్‌లు వీటిని ఏ మేరకు అరికట్టగలవు అనే అంశాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు.

 
డబుల్ మ్యూటెంట్ అంటే ఏంటి ?
ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తి చెందుతున్న దశలో వైరస్‌ అనేక మార్పులకు లోనవుతుంది. దీనినే మ్యూటేషన్‌ అంటారు. ఈ మ్యూటేషన్‌ సందర్భంగా ఈ వైరస్‌లో పెద్దగా మార్పులు ఉండవు. తమ ప్రవర్తనను కూడా మార్చుకోవు. అయితే కొన్ని మ్యూటేషన్స్‌ సందర్భంగా స్పైక్‌ ప్రొటీన్‌లో మార్పులు జరిగి మానవ శరీరంలోని ఇతర కణాలలోకి కూడా ప్రవేశిస్తాయి.

 
ఇలాంటి వైరస్‌లు మరింత ప్రమాదకరంగా, త్వరగా వ్యాప్తి చెందే లక్షణాలను కలిగి ఉంటాయి. పైగా చాలాసార్లు ఇవి వ్యాక్సీన్‌లకు కూడా లొంగవు. శ్వాసనాళ సంబంధిత వ్యాధులకు కారణమయ్యే సార్స్‌ కోవిడ్‌-2 లాంటి వైరస్‌ల నుంచి ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కోవిడ్‌-19 లాంటి వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి వ్యాధులకు వేసే టీకాలు శరీరంలో యాంటీబాడీలను తయారు
చేస్తాయి.

 
తాజాగా ఈ కరోనా వైరస్‌లోని డబుల్‌ వేరియంట్‌ వైరస్‌ రకాన్ని భారత నిపుణులు గుర్తించారు. మహారాష్ట్రలో సేకరించిన శాంపిల్స్‌లో E484Q, L452R మ్యూటేషన్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. గత డిసెంబర్‌ నాటి టెస్టులతో పోలిస్తే ఇప్పుడు ఈ మ్యూటేషన్‌లు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. "ఇలాంటి మ్యూటేషన్లు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి, వ్యాప్తిని పెంచుతాయి" అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

 
భారత్‌లో కనిపిస్తున్న E484Q వేరియంట్‌ E484Kకు దగ్గరగా ఉందని, ఈ డబుల్‌ మ్యూటేషన్‌ వేరియంట్లు, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా వేరియంట్లు అయిన P.1, B.1.351లలో కనిపిస్తున్నాయని, ఇవి అనేకసార్లు పరివర్తనం చెందాయని లూసియానా స్టేట్ యూనివర్సిటీలో వైరాలజిస్టుగా పని చేస్తున్న డాక్టర్‌ జెరెమి కామిల్‌ అన్నారు. ఈ మ్యూటేషన్‌లు ఇలాగే కొనసాగితే వైరస్‌లు ప్రత్యేక తరగతి వైరస్‌లుగా మారి వాటి స్వభావాన్ని, ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. భారత్‌లో కనిపిస్తున్న కొన్ని మ్యూటేషన్‌లు అమెరికాలోని కాలిఫోర్నియా వేరియంట్‌ను కూడా పోలి ఉన్నాయని డాక్టర్‌ కామిల్‌ అన్నారు.

 
డబుల్‌ మ్యూటెంట్లు అరుదా?
అరుదేమీ కాదంటున్నారు డాక్టర్‌ కామిల్‌. ఆయన ఇటీవల అమెరికాలోని ఏడు తరగతులకు చెందిన కరోనా వైరస్‌ వేరియెంట్లపై జరిగిన ఒక అధ్యయనానికి సహ రచయితగా వ్యవహరించారు. "ఒకటికంటే ఎక్కువ మ్యూటేషన్‌లు జరగడం చాలా కామన్‌గా కనిపిస్తోంది. మనం కేవలం స్పైక్‌ జీన్‌కు పరిమితమైన ఈ ధోరణిని గమనించవచ్చు, మహమ్మారి వ్యాపించిన మొదట్లో ఎక్కువ స్పైక్ జీన్స్‌లో D614G అనే ఒక మ్యుటేషన్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు మ్యుటేషన్లు పెరిగాయి. అన్నిచోట్లా ఉన్నాయి. అందుకే, మేం దానిపై మిగతావి చూస్తున్నాం" అన్నారు.

 
నిజానికి, GISAID అనే ఒక ఓపెన్ షేరింగ్ డేటాబేస్‌ భారత్‌లో E484Q, L452R రెండు మ్యుటేషన్లూ ఉన్న 43 వైరస్‌లను గుర్తించింది. మార్చిలో యూకేలో సేకరించిన వైరస్‌లో 9 స్పైక్ మ్యుటేషన్లు ఉన్నాయి. అవి చాలా మ్యుటేషన్లనే అనుకోవాలి. భారత్ వేరియంట్‌లో రెండు మ్యుటేషన్లే ఉన్నాయని మనకు కచ్చితంగా తెలుసా? అన్నారు. భారత శాస్త్రవేత్తలు GISAIDలోతమ డేటాను అప్‌లోడ్ చేస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా శాస్త్రవేత్తలు అది యూకేలో కనుగొన్న అదే సంతతి డబుల్ మ్యూటెంటా లేక స్వతంత్రంగా ఆవిర్భవించిందా అనేది నిర్ధరించుకోగలుగుతారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో ఒకేసారి వచ్చిన K417N/T, E484K, N501Y ట్రిఫెక్టా మ్యుటేషన్లు తమ P.1, B.1.351. స్ట్రెయిన్స్ పెరగడానికి కారణమయ్యాయి.

 
కొత్త వేరియంట్ ఆందోళన కలిగించేదా
స్పైక్ జీన్‌లో మ్యుటేషన్స్ మనుషులకు వ్యాపించేలా వైరస్‌ను మరింత బలంగా మార్చగలదు లేదా వైరస్‌ను బలహీనం చేసే యాంటీబాడీలను తప్పించుకోడానికి సాయం చేయగలదు. అంటే, వైరస్ సరైన విధంగా మ్యుటేట్ అయితే ఇప్పటికే కోవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తికి అది మళ్లీ కరోనా వచ్చేలా చేయగలదు. కానీ, వాక్సీన్ వేసుకున్నవారిలో లేదా ఇప్పటికే కోవిడ్-19 నుంచి కోలుకున్నవారిలో ప్రాథమిక ఇన్ఫెక్షన్లతో పోలిస్తే రీ ఇన్ఫెక్షన్లు రావడం చాలా తక్కువే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 
కానీ వైరస్ వ్యాపించడానికి రీఇన్ఫెక్షన్‌ను ఉపయోగించుకోగలిగితే, అది హెర్డ్ ఇమ్యునిటీలోకి చొచ్చుకుపోతుంది అని అని డాక్టర్ కామిల్ చెప్పారు. వైరస్ హెర్డ్ నుంచి కూడా వ్యాపించగలదు కాబట్టి, ఇది అత్యంత బలహీనంగా ఉన్న వారిని మరింత తీవ్రమైన వ్యాధులకు గురయ్యేలా చేస్తుంది. మిగతా వేరియంట్లలా కాకుండా, భారత్‌లోని కొత్త డబుల్ వేరియంట్ ప్రాణాంతకంగా, లేదా సహజంగా వ్యాప్తి చెందేలా ఉండదు. కానీ, ఈ వేరియంట్ల గురించి మరింత డేటాను పరిశీలించాల్సిన అవసరం ఉందని కామిల్ అన్నారు.

 
భారత్‌లో సెకండ్ వేవ్‌కు ఈ వేరియంటే కారణమా
భారత్‌లో గురువారం కరోనా కేసులు 53 వేలు దాటాయి, మొత్తం 251 మంది చనిపోయారు. ఈ ఏడాది అత్యధిక రోజువారీ కేసులు ఇవే. హైదరాబాద్‌లోని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా మాట్లాడుతూ... "కరోనా కేసులు భారీగా పెరిగిన మహారాష్ట్రలోని 20 శాతం కేసుల్లో ఈ డబుల్ వేరియంట్‌ను కనుగొన్నారు. భారత్‌లో సెకండ్ వేవ్‌కు ఈ వేరియంటే కారణమనే అనుమానాలు కూడా ఉన్నాయి. నేను మాత్రం కాదనే చెబుతాను. మేం సీక్వెన్స్ చేసిన 80 శాతం శాంపిళ్లలో ఈ మ్యూటెంట్స్ కాంబినేషన్ లేవు. ఈ మ్యూటెంట్ మహారాష్ట్రలో సీక్వెన్స్ చేసిన కొన్ని వేల శాంపిళ్లలో 230 కేసుల్లోనే కనిపించింది" అన్నారు.

 
బ్రిటన్‌లో ఎక్కువగా వ్యాపించిన యూకేకు చెందిన కెంట్ వేరియంట్(B.1.1.7) గురించి ఎక్కువ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది 50 దేశాలకు పైగా వ్యాపించింది. భారత్‌లో మొత్తం 10, 787 శాంపిళ్లు సీక్వెన్స్ చేస్తే, ఈ వేరియంట్‌కు సంబంధించిన 736 పాజిటివ్ కేసులు గుర్తించారు. సెకండ్ వేవ్‌ తీవ్రం కావడానికి ఈ వేరియంట్ దోహదపడే అవకాశం ఉందని డాక్టర్ కామిల్ చెప్పారు. ఇది ఇంతకు ముందు వైరస్ వెర్షన్ వల్ల ఒకరు చనిపోతే ఇది 1.6 మరణాలకు కారణం అవుతుందని, 50 శాతం ఎక్కువ వ్యాప్తి చెందుతుందని, 60 శాతం ఎక్కువ ప్రాణాంతకమని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, "సెకండ్ వేవ్‌ రావడానికి ఎక్కువగా మనిషి ప్రవర్తనే కారణం అవుతుంది" అంటారు డాక్టర్ కామిల్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ పాలసీపై సీసీఐ సీరియస్.. 60రోజుల్లోపు నివేదికకు ఆదేశాలు..