Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్: భారత్‌లో మళ్లీ వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు, పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న నిపుణులు

కరోనావైరస్: భారత్‌లో మళ్లీ వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు, పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న నిపుణులు
, బుధవారం, 24 మార్చి 2021 (10:56 IST)
భారతదేశంలో గత వారం కొత్తగా 2,60,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది మహమ్మారి మొదలైనప్పటి నుంచి పరిశీలిస్తే వారం రోజుల్లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయిన వారాలలో ఇదొకటి అని చెప్పవచ్చు. ఇందులో 70 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.

 
కోవిడ్ నిబంధనలను సక్రమంగా పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు అంటున్నారు. అయితే, కేసుల సంఖ్య పెరగడానికి కొత్తగా వచ్చిన వైరస్ వేరియంట్లు కూడా కారణం కావచ్చు. కానీ, దీనికి ఆధారాలు లేవు. ఇప్పటి వరకు భారతదేశంలో 1 కోటి 10 లక్షల కేసులు నమోదు కాగా, 1,60,000 మరణాలు చోటు చేసుకున్నాయి.

 
2021 మొదట్లో భారతదేశంలో కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. సెప్టెంబరులో రోజుకు 90,000 నమోదైన కేసులు క్రమంగా 20,000కి తగ్గిపోవడం మొదలయింది. కానీ, గత రెండు మూడు వారాల నుంచి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో మహారాష్ట్ర ముందంజలో ఉండగా, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, హర్యానా, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

 
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని కిక్కిరిసిన ప్రాంతాల్లో, షాపింగ్ సెంటర్లలో, రైల్వే స్టేషన్ల దగ్గర ర్యాండమ్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. మార్చి 15- 21 తేదీల మధ్య భారతదేశంలో గత వారం కంటే 1,00,000 కేసులు అదనంగా నమోదయ్యాయి. ఈ పెరుగుదల ఆశ్చర్యకరమైనదేమి కాదని, కొన్ని వేల కోవిడ్ రోగులకు చికిత్స అందించినప్రముఖ క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ఎ ఫతాహుద్దీన్ అన్నారు.

 
దేశంలో ఈ ఏడాది మొదట్లో కేసులు తగ్గు ముఖం పడుతున్నప్పుడు ఒక "తప్పుడు ఆశావహ దృక్పథం" కమ్మేసిందని అన్నారు. "భారతదేశంలో హెర్డ్ ఇమ్మ్యూనిటీ వచ్చేసిందని ప్రజలు తప్పుగా భావించారు. కానీ, నిజానికి అలాంటిదేమి జరగలేదు" అని ఆయన అన్నారు. అలాగే, సంవత్సరం మొదట్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో వ్యాక్సీన్ రాకను సాధారణ సమయం తిరిగి వచ్చినట్లు ప్రజలు భావించారని ఆయన అన్నారు.

 
"నిజానికి ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తృత స్థాయిలో వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు, ట్రేసింగ్, ఐసోలేషన్ నిబంధనలను బలోపేతం చేయాలి" అని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో 4 కోట్ల మందికి పైగా ప్రజలు తొలి డోసు వ్యాక్సీన్ తీసుకున్నారు. కానీ, అది దేశ జనాభాలో కేవలం 4 శాతం మాత్రమే. ఈ జూలై చివరి నాటికి ప్రభుత్వం 25 కోట్ల ప్రజలకు వ్యాక్సీన్ ఇవ్వాలని చూస్తోంది.

 
ప్రస్తుతానికి రోజుకు 30 లక్షల మందికి వ్యాక్సీన్ డోసు ఇస్తూ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా అమలు చేస్తున్నప్పటికీ, దీనిని మరింత విస్తృతంగా అమలు చేయకపోతే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టమవుతుందేమోనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్ష మంది సైనికులు తమ ఉద్యోగాలకు స్వస్తి, ఎందుకో తెలుసా?