Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనావైరస్: ఆర్‌బీఐ నిర్ణయాలతో మీ ఈఎమ్ఐ‌పై పడే ప్రభావం ఏంటో తెలుసా?

Advertiesment
కరోనావైరస్: ఆర్‌బీఐ నిర్ణయాలతో మీ ఈఎమ్ఐ‌పై పడే ప్రభావం ఏంటో తెలుసా?
, శనివారం, 28 మార్చి 2020 (15:55 IST)
కరోనావైరస్ సంక్షోభాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేదలకు వివిధ సాయాలను ప్రకటించిన తర్వాత ఒక రోజుకు... రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా అందరూ ఆశిస్తున్న కొన్ని నిర్ణయాలను ప్రకటించారు.

 
రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకులు తీసుకునే అప్పులపై విధించే రెపో రేటును 0.75 శాతం తగ్గిస్తూ 4.4 శాతంగా నిర్ణయించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాలపై ఇచ్చే రివర్స్ రెపో రేటును 0.9 శాతం తగ్గిస్తూ 4 శాతంగా ఖరారు చేసింది. అలాగే, బ్యాంకులు తమ నగదు నిల్వ ఉంచుకోవడంపై ఉండే క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్) పరిమితిని ఒక శాతం తగ్గిస్తూ, మూడు శాతానికి తీసుకువచ్చింది.

 
శుక్రవారం ఉదయం రిజర్వు బ్యాంకు చేసిన ఈ ప్రకటన ప్రభావంతో బ్యాంకుల్లో నుంచి రూ.3.74 లక్షల కోట్లు ఇప్పుడు ఆర్థికవ్యవస్థలోకి వచ్చి చెలామణీ అవుతాయి. సీఐఐ డీజీ చంద్రజీత్ బెనర్జీ రిజర్వు బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయాలను స్వాగతించారు. రెపో, రివర్స్ రెపో రేట్ల మధ్య తేడాను పెంచడంతో ఇక రిజర్వు బ్యాంకు వద్ద డబ్బులు పెట్టుకోవడం వల్ల బ్యాంకులకు కలిగే ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.

 
పారిశ్రామికవేత్తల్లో, వ్యాపారుల్లో విశ్వాసం నింపడం ఈ సమయంలో చాలా అవసరం. రిజర్వు బ్యాంకు ప్రకటనకు కొన్ని గంటల ముందే ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్ భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాను 2.5 శాతానికి తగ్గించింది. 17 రోజుల ముందు అదే సంస్థ భారత ఆర్థిక వృద్ధి రేటు 5.3 శాతం ఉండొచ్చని అంచనా వేసింది.

 
ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కరోనా సంక్షోభం మరింత దెబ్బతీస్తోంది. దీని నుంచి బయటపడేందుకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఎన్ని చర్యలు తీసుకున్నా సరిపోవు.

 
ఈ చర్యలు ఎంతవరకూ ప్రభావం చూపుతాయి
పరిస్థితులన్నీ గాడిలో పడేవరకూ దేని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ఈ ఏడాది చివరి త్రైమాసికం, వచ్చే పూర్తి ఏడాది వృద్ధిపై ప్రభావం పడొచ్చని రిజర్వు బ్యాంకు చెబుతోంది. మార్కెట్‌‌లో డిమాండ్ బలహీనపడుతుండటంతో ఆందోళన నెలకొంది. భవిష్యతుపై అనిశ్చితి ఏర్పడింది.

 
సామాన్యులకు సంబంధించి కూడా ఓ కీలక ప్రకటనను కూడా రిజర్వు బ్యాంకు చేసింది. లక్షల కుటుంబాలకు ఊరటను ఇచ్చే నిర్ణయం తీసుకుంది. బ్యాంకు రుణాలపైనా మూడు నెలల వరకు నెలవారీ కిస్తీలు (ఈఎమ్‌ఐలు) కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

 
దీర్ఘ కాలిక రుణాల కిస్తీల చెల్లింపులపై మూడు నెలల మారెటోరియం విధిస్తున్నట్ల రిజర్వు బ్యాంకు తెలిపింది. అంటే, సంస్థలు మూడు నెలలు కిస్తీలు చెల్లించకపోయినా, వారిని ఎగవేతదారులుగా పరిగణించరు. గృహ రుణాలపై రుణం తీసుకున్నవాళ్లు మూడు నెలల పాటు బ్యాంకులకు కిస్తీలు కట్టకుండా ఉండొచ్చు.

 
కొన్నింటిపై స్పష్టత కరవు
కిస్తీలు కట్టని ఈ మూడు నెలలకు వడ్డీ వేస్తారా లేక మినహాయింపును ఇస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. ఐదు నుంచి ఏడేళ్ల చెల్లింపు వ్యవధితో కార్ల కొనుగోలుకు, వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న రుణాలు కూడా దీర్ఘ కాలిక రుణాల కిందకు వస్తాయా అన్న సందేహం కూడా ఉంది.

 
వర్కింగ్ క్యాపిటల్ కోసం రుణాలు తీసుకున్నవారికి, క్యాష్ క్రెడిట్ లిమిట్‌ తీసుకున్నవారికి మూడు నెలల పాటు వడ్డీ ఉండదని రిజర్వు బ్యాంకు స్పష్టంగా చెప్పింది. చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారస్థుల వరకూ చాలా మందికి దీని ద్వారా ప్రయోజనం కలగనుంది.

 
క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోరు‌‌లపై కూడా ఈ మూడు నెలలు కిస్తీలు చెల్లించని ప్రభావం ఉండదని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. విధానపరంగా తీసుకున్న ఈ నిర్ణయాలతో పరిశ్రమలకు అవసరమైన ఉపశమనం లభిస్తుందని బీజేపీ ప్రతినిధి సయ్యర్ జఫర్ ఇస్లామ్ అన్నారు. బ్యాకింగ్ రంగంలో చాలా ఏళ్లు పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.

 
రిజర్వు బ్యాంకు రేట్ల తగ్గింపుతో సామాన్యుడికి ఒరిగే విషయాల సంగతికి వస్తే, ఇరవై ఏళ్ల చెల్లింపు వ్యవధితో రూ.25 లక్షల గృహ రుణం తీసుకున్నవారికి ఏడాదికి రూ.13వేల వరకూ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. మూడు నెలలపాటు కిస్తీల చెల్లింపులకు మినహాయింపు కూడా దొరికింది.

 
బ్యాంకులు వడ్డీ రేట్లను ఎంత మేర తగ్గించుకుంటాయో, ఏయే రుణాలకు చెల్లింపులపై మినహాయిపు ఇస్తాయో తెలిస్తే గానీ పూర్తి స్థాయిలో నెరవేరే ప్రయోజనం గురించి చెప్పలేం. క్రెడిట్ కార్డులను ఉపయోగించేవారు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. వాళ్లు ఉపయోగించుకున్న డబ్బు రుణం కిందకు రాదు. వాళ్లకు చెల్లింపు మినహాయింపులు ఎవరు ఇవ్వాలి? ఒకవేళ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది?

 
రుణాలేవీ తీసుకోకుండా జీతాలు పొందలేని వారి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న? వాళ్లు ఇంటి అద్దెలు కట్టలేకపోతే ఏం జరుగుతుంది? నడుపుకునే దుకాణాలు మూతపడితే ఎలా? రేట్ల తగ్గింపు డిమాండ్ అన్ని వైపుల నుంచి ఉన్నదే. కానీ, రిజర్వు బ్యాంకు ప్రకటన తర్వాత మార్కెట్ల సూచీలు పైకి వెళ్లకపోగా, కిందకు పడుతున్నాయి. దీన్ని కూడా ఓ మంచి సంకేతమని అనుకోవచ్చు.

 
సమాజానికి పెద్ద స్థాయిలో లాభం కలిగించే (ప్రజా ప్రయోజన) నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నా, మార్కెట్ సూచీలు కిందకు వెళ్తుంటాయి. అయితే, ప్రస్తుత సమయంలో మార్కెట్ గమనాన్ని చూసి ఏదీ తేల్చి చెప్పే పరిస్థితి లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గొడుగు వాడితే కరోనా దూరం? ఎలాగంటే?