Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పౌరసత్వం అమ్ముతున్నారు... కొనుక్కుంటారా? ఒక్కో దేశానికి ఒక్కో రేటు

Advertiesment
పౌరసత్వం అమ్ముతున్నారు... కొనుక్కుంటారా? ఒక్కో దేశానికి ఒక్కో రేటు
, మంగళవారం, 15 అక్టోబరు 2019 (12:31 IST)
పుట్టుకతో వచ్చే పౌరసత్వం ఇప్పుడు అంగడి సరకుగా మారింది. అదొక పెట్టుబడిగా మారింది. వ్యాపారంగా విస్తరించింది. ఒక దేశ పౌరసత్వం అనేది గతంలో ఎన్నడూ లేనంత అనిశ్చిత భావనగా మారింది. 50 ఏళ్ల కిందట.. ద్వంద్వ పౌరసత్వాన్ని దేశాలు అనుమతించేవి కాదు. కానీ, ఇప్పుడు రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉండటం అనేది విశ్వవ్యాప్తమైంది.

 
ప్రపంచంలోని సగానికి పైగా దేశాలు పెట్టుబడి ద్వారా పౌరసత్వం కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాయి. నిపుణుడు, స్విస్ న్యాయవాది క్రిస్టియన్ కలిన్ అభిప్రాయం ప్రకారం, ఇప్పుడు పౌరసత్వం అనేది ఒక ప్రపంచ పరిశ్రమ. దీని విలువ ఏడాదికి రూ. 1.77 లక్షల కోట్లు. ప్రస్తుతం వేగంగా వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్‌లో ఉన్న ప్రపంచస్థాయి పెద్ద సంస్థల్లో ఒకటైన హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ చైర్మన్‌ కలిన్‌ను 'మిస్టర్ పాస్‌పోర్ట్' అని కూడా పిలుస్తుంటారు. ఇతర దేశాల పౌరసత్వం లేదా ఆయా దేశాల్లో నివాసం పొందేందుకు ధనికులకు, వారి కుటుంబాలకు సహాయం చేయడమే ఈయన వ్యాపారం.

 
పౌరసత్వం గురించి మన సంప్రదాయ అభిప్రాయాలన్నీ పాతబడిపోయాయని ఆయన అంటారు. ''ప్రపంచంలో ఇప్పటికీ రక్త సంబంధాలతో ముడిపడిన, లేదంటే మీరు ఎక్కడ పుట్టారన్నదానిపై ఆధారపడిన కొన్ని విషయాల్లో ఇదొకటి'' అని కలిన్ బీబీసీతో చెప్పారు. పౌరసత్వంపై పునరాలోచించాల్సిన అవసరం వచ్చిందని ఆయన చెబుతున్నారు.

 
మనం ఎక్కడ పుట్టామనేది మన నైపుణ్యాలు, ప్రతిభతో ఏమాత్రం సంబంధం లేని వ్యవహారమని, ఇది కేవలం అదృష్టం కారణంగానే జరుగుతుందని కలిన్ తెలిపారు. 'ఇది అత్యంత అన్యాయమైన విషయం' అని అభిప్రాయపడ్డారు. 'సభ్యత్వం ఇచ్చినట్లుగా పౌరసత్వం ఇవ్వటంలో తప్పేముంది? ప్రతిభ ఉన్న, ఉన్నతికి పాటుపడే ప్రజలను తీసుకోవటంలో తప్పేముంది?' అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

 
కలిన్ వాదనను సమర్థించేవారు కూడా కొందరు ఉన్నారు. కానీ, చాలామందికి మాత్రం పాస్‌పోర్టు అనేది ఒక గుర్తింపు. అలాంటివారు పాస్‌పోర్టు ఒక కొనుగోలు చేయదగ్గ వస్తువు అంటే ఒప్పుకోరు. పసిఫిక్ ఐలాండ్ దేశమైన 'వానువాటు' పౌరసత్వ వ్యవహారాన్ని మేం పరిశీలించాం.

 
నాలుగేళ్ల కిందట ఈ దేశం తన నూతన పౌరసత్వ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ దేశ పౌరసత్వంపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. వానువాటు దేశ ప్రభుత్వ ఆదాయంలో అతిపెద్ద భాగం ఇప్పుడు పాస్‌పోర్టుల నుంచే వస్తోంది. వానువాటు పాస్‌పోర్టు ఉన్నవారు ఎలాంటి వీసా లేకుండానే యూరప్ మొత్తం ప్రయాణించొచ్చు. ఈ పాస్‌పోర్టు కోరుకుంటున్న వారిలో ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది ఇదే.

 
వానువాటు పాస్‌పోర్టులు పొందుతున్న విదేశీయుల్లో చాలామంది ఆ దేశంలో కాలుపెట్టరు. విదేశాల్లోని కార్యాలయాల్లోనే పౌరసత్వం కోసం వారు దరఖాస్తు చేస్తున్నారు. అలాంటిదే హాంగ్‌కాంగ్‌ కేంద్రంగా పనిచేసే పీఆర్‌జీ కన్సల్టింగ్. ఈ సంస్థ వనవాటు పౌరసత్వం ఇచ్చేందుకు లైసెన్స్ ఉన్న బ్రోకరింగ్ సంస్థ.

 
ప్రపంచంలో అతిపెద్ద సిటిజన్‌షిప్ మార్కెట్ ప్రాంతాల్లో హాంగ్‌‌కాంగ్‌ ఒకటి. హాంగ్‌కాంగ్ విమానాశ్రయంలోని ఒక కెఫేలో మేం పౌరసత్వం ఏజెంట్ 'ఎంజే'ని కలిశాం. ప్రైవేట్ బిజినెస్‌ మ్యాన్ అయిన ఎంజే... హాంగ్‌కాంగ్‌లో పెరిగిపోతున్న చైనీయులకు రెండు.. లేదంటే మూడో పాస్‌పోర్టు పొందేందుకు సహాయం చేస్తుంటారు.

 
''వాళ్లు (చైనాలో) భద్రంగా ఉన్నామనుకోవట్లేదు'' అని తన క్లయింట్ల గురించి ఆయన చెబుతుంటారు. ''యూరప్‌కు వెళ్లేందుకు, ఒక బ్యాంకు ఖాతా తెరిచేందుకు, ఆస్తులు కొనేందుకు, వ్యాపారాలు ప్రారంభించేందుకు వాళ్లు మార్గం కోరుకుంటున్నారు.'' పౌరసత్వం ఒక పోటీతత్వం ఉన్న ప్రపంచ మార్కెట్. చాలా చిన్న, ద్వీప దేశాలకు.. ముఖ్యంగా కరీబియన్ ప్రాంతంలోని వాటికి... ఒక పాస్‌పోర్ట్ పొందేందుకు అయ్యే ధర దాదాపు 1.06 కోట్ల రూపాయలు. వానువాటు పాస్‌పోర్ట్ పొందాలన్నా కూడా సుమారు అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

 
ఒక పాస్ట్‌పోర్ట్ కొనాలంటే ఎంత ఖర్చవుతుంది?
ఆంటిగ్వా అండ్ బార్బడా - రూ. 71 లక్షల నుంచి మొదలు
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ - రూ. 1.06 కోట్ల నుంచి మొదలు
మాంటెనెర్గో - రూ. 1.94 కోట్ల నుంచి మొదలు
పోర్చుగల్ - రూ. 2.72 కోట్ల నుంచి మొదలు
స్పెయిన్ - రూ. 3.90 కోట్ల నుంచి మొదలు
బల్గేరియా - రూ. 3.97 కోట్ల నుంచి మొదలు
మాల్టా - రూ. 7.10 కోట్ల నుంచి మొదలు
అమెరికా - పది ఉద్యోగాలు కల్పించే ఒక వ్యాపారంలో రూ. 3.55 కోట్ల నుంచి రూ. 7.10 కోట్ల వరకూ పెట్టుబడి
బ్రిటన్ - రూ. 17.75 కోట్ల నుంచి మొదలు

 
వానువాటు పాస్‌పోర్టును చాలా వేగంగా (30 రోజుల్లో) పొందవచ్చునని ఎంజే వివరించారు. దాన్ని పొందడం మంచి ఎంపిక అని చెప్పారు. అయితే, వానువాటు అవినీతికి పేరొందిన దేశమని కలిన్, ఇతరులు హెచ్చరిస్తున్నారు. అందువల్లనే హెన్లీ అండ్ పార్ట్‌నర్స్, ఇతరులు వానువాటు సిటిజన్‌షిప్ కార్యక్రమంతో వ్యాపారాలు చేయట్లేదు. అయినప్పటికీ, చైనా నుంచి పెరుగుతున్న ఆసక్తిని మాత్రం ఇది ఆపలేదు. కొన్నేళ్ల క్రితం హాంగ్‌కాంగ్ టెలివిజన్ చానెళ్లు వనవాటు పౌరసత్వాన్ని ప్రచారం చేసే ఆసక్తికరమైన టీవీ యాడ్స్‌ని ప్రసారం చేశాయి. చైనా నుంచి పెరుగుతూ ఉన్న పర్యాటకులను ఆకర్షించడమే ఈ ప్రకటనల లక్ష్యం.

 
అయితే, వనవాటు పౌరసత్వం పొందిన తర్వాత ఎంత మంది చైనీయులు ఆ దేశం వెళతారు? బహుశా 10 మందిలో ఒకరు అని ఎంజే అంచనా వేశారు. వానువాటు రాజధాని పోర్ట్ విలా, పరస్పర వైరుధ్యాలతో కూడిన నగరం. ఇక్కడ రోడ్లపై తరచూ నీళ్లు ప్రవహిస్తుంటాయి, గుంతలు భయపెడుతుంటాయి. ట్రాఫిక్ లైట్ల సిగ్నల్ వ్యవస్థ ఒక్కటి కూడా ఉండదు, కానీ చిన్నచిన్న నాలుగు చక్రాల వాహనాలతో పాటే ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతోంది.

 
పన్ను ఎగవేతదారుల స్వర్గంగా భావించే వానువాటు అవినీతి, పారదర్శకత లేకపోవటం వంటి సమస్యల కారణంగా... యురోపియన్ యూనియన్ 'బ్లాక్‌లిస్ట్' దేశాల జాబితాలో ఈ మధ్యనే తిరిగి చేరింది. 'ని వానువాటు' అని పిలిచే ఈ దేశ ప్రజలు అధికారికంగా తమంతట తాముగా పౌరులుగా గుర్తింపు పొందింది 1980లోనే. అప్పుడే వానువాటు దేశానికి స్వతంత్రం లభించింది. అంతకుముందు ఇది ఆంగ్లో-ఫ్రెంచి ఉమ్మడి ఆధీనంలోని ప్రాంతం. దీన్ని న్యూ హెర్బైడ్స్ అని పిలిచేవాళ్లు. ఈ ప్రాంత ప్రజలంతా దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో విసిరేసినట్లుగా ఉండే 80 దీపాల్లో నివసిస్తారు.

 
40 ఏళ్ల కిందట వారికి ఒక దేశమంటూ లేదు. మాజీ ప్రధాని బరాక్ సోపే పోర్ట్ విలా ప్రధాన రహదారిపై ఉన్న ఒక హోటల్ కాసినోలో బీబీసీతో మాట్లాడుతూ, ''1980 వరకూ నాకు పాస్‌పోర్ట్ లేదు. బ్రిటిషర్లు, ఫ్రెంచివాళ్లు నాకు ఇచ్చిన ఒక కాగితం ముక్క పట్టుకుని నేను ప్రయాణించాల్సి వచ్చేది. అది చాలా అవమానకరంగా ఉండేది'' అని అన్నారు. ''పౌరసత్వాన్ని అమ్మడం వనవాటుకు వెన్నుపోటు పొడవటమే. చైనీయులకు మా కంటే చాలా ఎక్కువ డబ్బు ఉంది'' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో చైనీయుల పెట్టుబడులు వరదలా పెరుగుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు.

 
చైనా పెట్టుబడులపై సోపే లాంటి చాలామంది స్థానికులు విమర్శలు చేస్తున్నారు. చైనా కంపెనీలు డబ్బు మొత్తాన్నీ తమదగ్గరే పెట్టుకుంటాయని, చైనా కార్మికులకే ఉపాధి కల్పిస్తాయని వారు ఆరోపిస్తున్నారు. వానువాటు ప్రభుత్వంలో అంతా పురుషులే ఉన్నారు. రాజకీయాల నుంచి మహిళలను పూర్తిగా తప్పించిన ప్రపంచంలోని మూడు దేశాల్లో వనవాటు ఒకటి. ఈ సిటిజన్‌షిప్ కార్యక్రమం గురించి బీబీసీతో మాట్లాడేందుకు వనవాటు ప్రభుత్వం ఆసక్తి ప్రదర్శించలేదు. అయితే, మేం ప్రభుత్వం నియమించిన సిటిజన్‌షిప్ ఏజెంట్ బిల్ బానీతో మాట్లాడాం. 

 
''వానువాటును ప్రపంచ స్థాయి దృష్టితో చూడాలి. ఆదాయం కోసం, జీవనం కోసం ఇతర దేశాలు పాస్‌పోర్టులు విక్రయిస్తుంటాయి. మాకు సహజ వనరులు ఎక్కువగా లేవు. ఇది (సిటిజన్‌షిప్ కార్యక్రమం) మాకు చాలా డబ్బు తెస్తోంది'' అని ఆయన అన్నారు. 2015లో ప్రారంభమైనప్పటి నుంచీ ఈ కార్యక్రమం.. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న ఈ దేశంలో చాలా వివాదాస్పదం అయ్యింది.

 
యాన్ పకోవా అనే ఒక కమ్యూనిటీ లీడర్ మాకు వానువాటులోని ఒక గ్రామాన్ని చూపించారు. ఈ గ్రామంలో ఇళ్లన్నీ ఇనుప రేకులతో తయారయ్యాయి. రాజధాని నగరం షాపులు, రెస్టారెంట్ల నుంచి 10 నిమిషాల పాటు ప్రయాణిస్తే ఈ గ్రామం వస్తుంది. అయితే, ఈ పది నిమిషాల్లో మరో ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది.

 
2015లో వచ్చిన పామ్ తుపాను వల్ల దెబ్బతిన్న ఇళ్లను, మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే, పాస్‌పోర్టు అమ్మకాల నుంచి వచ్చిన డబ్బు స్థానికులకు కనిపించడం లేదని అన్నే చెప్పారు. ''మా పూర్వీకులు మా స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు విడిచారు. ఇప్పుడు నాకు ఉన్న గ్రీన్ పాస్‌పోర్టునే ఇతర ప్రజలు కూడా పొందుతున్నారు. దాని ధర 1.06 కోట్ల రూపాయలు? ఆ డబ్బు ఎక్కడుంది? ఇది ఆగాలి'' అని ఆమె అన్నారు.

 
ఇదే గ్రామానికి చెందిన సుసాన్ అనే మరో మహిళ ఒక మురికి బావిని మాకు చూపించారు. ''నిరంతరం నీటిని అందించే నల్లా ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. నల్లా ఉంటే పిల్లలు స్నానం చేయగలరు, స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని తాగగలరు'' అని ఆమె చెప్పారు. చైనీస్ మార్కెట్ నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ విధానంలో ఈ మధ్యకాలంలో మార్పు రావటం కష్టమని స్థానికంగా ఒక న్యూస్ పేపర్ నడిపే డాన్ మెక్‌గ్యారీ అన్నారు.

 
వానువాటు ఆదాయంలో 30 శాతం పాస్‌పోర్ట్ అమ్మకాల ద్వారానే సమకూరుతోందని డాన్ తెలిపారు. ''మాలాంటి చిన్న దేశానికి ఇదొక గొప్ప డీల్. అయితే, మమ్మల్ని మేం ఒకటి అడగాలి. దీనికోసమేనా మనం పోరాడింది? ఇది సరైనదేనా? ఎంతో కష్టపడి సొంతం చేసుకున్న సార్వభౌమత్వాన్ని వేలంలో ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికి అమ్మేయడం కరక్టేనా?'' వానువాటు మాత్రమే కాదు.. పెరుగుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో చాలా దేశాలు ఎదుర్కోవాల్సిన ప్రశ్న ఇది. అయితే, కలిన్ చెప్పినట్లు.. ''పెట్టుబడి ద్వారా పౌరసత్వం, పెట్టుబడి వలస కార్యక్రమాలు అనేవి.. అనిశ్చిత స్థితికి ప్రతిరూపంగా మారుతున్న ప్రపంచాన్ని ప్రతిబింబిస్తున్నాయి.''

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశ క్షిపణి పితామహుడు, భారత రత్న ఏ.పి.జె అబ్దుల్ కలాం జయంతి