ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాగుబోతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టిన సర్కారు... మద్యం ధరలను కూడా విపరీతంగా పెంచేసింది. స్వదేశీ, విదేశీ మద్యం బ్రాండ్లపై కనిష్టంగా పది రూపాయలు, గరిష్టంగా రూ.250 మేరకు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, రెడీ టు డ్రింక్ పేరుతో విక్రయించే 250/275 ఎంఎల్ మద్యం సీసాలపై రూ.20 పెంచింది. పెరిగిన ధరలు అక్టోబరు ఒకటో తేదీ నుంచే అమల్లేకి రానున్నాయి.
మరోవైపు, అక్టోబరు ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు వెలిశాయి. ఈ దుకాణాల్లోనే మద్యం ధరలను విపరీతంగా పెంచేశారు. ఆ ప్రకారం, స్వదేశీ, విదేశీ మద్యం క్వార్టర్ సీసాపై రూ.20, హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80 పెరిగింది. స్వదేశీ మద్యం 60/90 ఎంఎల్ బాటిళ్లపై రూ.10, లీటరు మద్యం సీసాపై రూ.100, రెండు లీటర్ల బాటిల్‌పై రూ.250 పెంచారు.
విదేశీ మద్యం 50/60 ఎంఎల్ సీసాలపై రూ.10, లీటరున్నర-రెండు లీటర్లు కలిగిన మద్యం బాటిళ్లపై రూ.250 పెరిగింది. ఇక, 330/500 ఎంఎల్ బీర్ సీసాలపై రూ.10, 650 ఎంఎల్ బీరు సీసాలపై రూ.20 పెరిగింది. అలాగే, స్వదేశీ, విదేశీ మద్యంపై 6 శాతం రిటైల్ ఎక్సైజ్ పన్ను విధించింది.
అదేవిధంగా, ఏపీలో మద్యం అమ్మకాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే కొనసాగనున్నాయి. నిజానికి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం తొలుత ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత వాటిని సవరించి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలు ఉండగా, దశల వారీ మద్య నిషేధం అమల్లో భాగంగా వీటి సంఖ్యను 20 శాతం తగ్గించనున్నారు.