మెదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైత సంఘాల పిలుపుతో మంగళవారం భారత్ బంద్ జరుగుతోంది. ప్రధానంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులు చేపట్టిన ఆందోళనలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, పార్టీల నుంచి మద్దతు లభించింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా దేశవ్యాప్తంగా 24 పార్టీలు రైతుల భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. అందులో కాంగ్రెస్, వామపక్షలు, టీడీపీ ఉన్నాయి.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ బంద్ జరుగుతుందని రైతు సంఘాల యూనియన్ ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం నుంచే బంద్ మొదలయింది. రైతులు శాంతిపూర్వక ప్రదర్శనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలు కొనసాగేలా చూడాలని కూడా కోరారు. బ్యాంక్ యూనియన్లు భారత్ బంద్‌కు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుతామన చెప్పాయి. వాణిజ్య రవాణా, ట్రక్ యూనియన్లు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ తెల్లవారుజామునే భారత్ బంద్ ప్రభావం మొదలైంది. ముందు జాగ్రత్తగా బస్సులు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసివేస్తున్నట్లు తెలిపింది. విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించింది. విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతల్లో బస్టాండ్ల దగ్గరకు చేరుకున్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతు సంఘాల నేతలు నిరసనలు ప్రదర్శనలకు దిగారు. రహదారులపై వాహనాలను అడ్డుకున్నారు. చాలా ప్రాంతాల్లో వ్యాపారాలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు.
తెలంగాణలో కూడా భారత్ బంద్ ఉదయం నుంచే మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేశారు. తెల్లవారు జాము నుంచే డిపోల దగ్గరకు చేరుకున్ న టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్ష నేతలు నిరసన తెలిపారు. ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పాలని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కొందరు ప్రశ్నించారు.
ఇన్నాళ్లు కనపడని రైతు కష్టాలు ఇప్పుడే వచ్చాయా అని నిలదీశారు. తమకు ఇబ్బందులకు గురి చేసి బారికేడ్లు పెట్టడం ఏంటని అడిగారు. ఉషముళ్ల పూడి దగ్గర ఈ ఘటన జరిగింది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నారు. దిల్లీ, హరియాణాలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. రెండు రాష్ట్రాల్లో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
శాంతియుతంగా భారత్ బంద్ నిర్వహించాలని తెలంగాణ పోలీసులు సూచించారు. బలవంతంగా మూసివేయడం, అడ్డుకోవడం లాంటివి చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోమవారం సింగూరు బోర్డర్‌లో ఉన్న రైతులను కలిసినప్పటి నుంచి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను దిల్లీ పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది. తర్వాత కాసేపటికే ఉత్తర దిల్లీ డీసీపీ దీనిపై స్పందించారని, ఆప్, ఇతర పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగకుండా పోలీసులను మోహరించామని, ముఖ్యమంత్రిని గృహనిర్బంధంలో ఉంచలేదని చెప్పారని ఏఎన్ఐ చెప్పింది.
భారత్ బంద్‌లో కొన్ని శక్తులు బలగాలకు సమస్యలు సృష్టించే అవకాశం ఉండడంతో సంయమనం పాటించాలని, శరీరానికి ఉన్న ప్రొటెక్టివ్ జాకెట్లు, హెల్మెట్లు తీయవద్దని పారామిలిటరీ బలగాలకు సూచించారు. బిహార్‌లో భారత్ బంద్‌కు ఆర్జేడీ మద్దతు ప్రకటించిందని, ఆ పార్టీ కార్యకర్తలు దర్భంగాలోని గంజ్ చౌక్‌లో టైర్లు తగలబెట్టి కేంద్రం వైఖరికి నిరసన తెలిపారు.
కర్ణాటక కాంగ్రెస్ నేతలు భారత్ బంద్‌లో పాల్గొన్నారు. బెంగళూరులోని విధాన సౌధ ముందున్న గాంధీ విగ్రహం దగ్గర నల్లజెండాలతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.