కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రైతు సంఘాలు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. ఈ బంద్‌కు అనేక రాజకీయ పార్టీలతో పాటు.. పలు కార్మిక సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహార దీక్ష చేపట్టారు.
రైతు ఆందోళనలను దేశవ్యాప్తంగా ఉధృతంగా చేయాలని, ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని అన్నా హజారే తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న నిరసనను హజారా ప్రశంసించారు. గత 13 రోజుల నుంచి జరుగుతున్న నిరసనల్లో ఎటువంటి హింస చోటుచేసుకోలేదని గుర్తుచేశారు.
ముఖ్యంగా, ప్రముఖ వ్యవసాయవేత్త డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో అన్నా హజారే ఒక రోజు నిరాహార దీక్ష చేపడుతున్నారు.
మరోవైపు, రైతులు చేపట్టిన భారత్ బంద్‌కు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బంద్ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఇది సాయంత్రం 3 గంటల వరకు జరుగనుంది.
తెలంగాణా రాష్ట్రంలో రైతులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిన్నారం గ్రామానికి చెందిన రైతులు ఉరి తాళ్లతో నిరసన తెలిపారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు మిగిలేది ఉరి తాళ్లే అని రైతులు వాపోయారు.
అగ్రి బిల్లులను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరించారు. దేశానికి అన్నం పెట్టే రైతులను కార్పొరేట్లకు కట్టబెట్టడం సరికాదని రైతులు మండిపడ్డారు.