Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళల హక్కుల కోసం సంప్రదాయాన్ని ఎదిరించి వరుడి ఇంటికెళ్లి పెళ్లి చేసుకున్న బంగ్లాదేశ్ వధువు

మహిళల హక్కుల కోసం సంప్రదాయాన్ని ఎదిరించి వరుడి ఇంటికెళ్లి పెళ్లి చేసుకున్న బంగ్లాదేశ్ వధువు
, గురువారం, 26 సెప్టెంబరు 2019 (20:40 IST)
బంగ్లాదేశ్‌కు చెందిన 19 ఏళ్ల ఖదిజా అక్తర్ ఖుషీ పెళ్లి చేసుకోడానికి తనవాళ్లతో కలసి కాబోయే భర్త ఇంటికి వెళ్లారు. బంగ్లాదేశ్‌లోని మహిళలు ఇలానే తన అడుగుజాడల్లో నడవాలని ఆమె కోరుకుంటున్నారు. సంప్రదాయం ప్రకారం పెళ్లి కోసం వరుడు వధువు ఇంటికి వెళ్తారు.


కానీ, బంగ్లాదేశ్ చరిత్రలో తొలిసారి ఈ ఘటన దానికి విరుద్ధంగా జరిగింది. ''అబ్బాయిలు పెళ్లి కోసం అమ్మాయిల ఇంటికి వస్తుంటే, అమ్మాయిలు కూడా అబ్బాయిల ఇంటికి ఎందుకు వెళ్లకూడదు?'' అని వివాహం అయిన మరుసటి రోజు బీబీసీతో వధువు ఖదిజా చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 
అయితే, ఈ సంఘటన కొంతమందికి స్ఫూర్తినివ్వగా మరికొంత మందికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ పనిచేసిన జంటను, వారి కుటుంబాలను చెప్పులతో కొట్టాలని ఒకరు సలహా ఇచ్చారు. ఇక్కడ అంశం సంప్రదాయాలు పాటించడం కాదు అని ఖుషీ బీబీసీకి చెప్పారు.

 
''ఇది మహిళల హక్కులకు సంబంధించిన విషయం. ఈరోజు ఒక అమ్మాయి పెళ్లి చేసుకోడానికి అబ్బాయి ఇంటికి వెళ్తే వచ్చే ప్రమాదమేమీ లేదు. ఇలా చేయడం వల్ల మహిళలను నిందించడం తగ్గుతుంది. వారి గౌరవం వారికి దక్కుతుంది. ఎవరూ ఎవరి కంటే తక్కువ కాదు'' అని ఖుషీ పేర్కొన్నారు.

 
భిన్నంగా జరుగుతున్న తమ పెళ్లిపై వ్యతిరేకత వస్తుందని ఆ జంటకు తెలుసు. భారత సరిహద్దుకు దగ్గర్లోని ఒక చిన్నగ్రామంలో గత శనివారం వీరి వివాహం జరిగింది. దీనిగురించి వారి కుటుంబ సభ్యులకు కూడా ముందుగా తెలియదు. ''ఇలా పెళ్లి చేసుకోవడం ద్వారా మేం ఏ తప్పు చేయలేదు'' అని వరుడు తారిఖల్ పేర్కొన్నారు.

 
''కొన్ని పెళ్లిళ్లు కోర్టులో జరుగుతాయి. కొన్ని మసీదులో జరుగుతాయి. మేం మా మతానుసారమే వివాహం చేసుకున్నాం'' అని ఆయన వివరించారు. ''మా పెళ్లి ఖాజీ, సాక్షుల సమక్షంలోనే జరిగింది. వారు మా పెళ్లిని నమోదు చేశారు. అది మా వివాహం జరిగే పద్ధతి. మేం చేసింది కూడా ఇదే'' అని చెప్పారు.

 
పురాతన సంప్రదాయాన్ని తిరగరాశారు - బీబీసీ ప్రతినిధి సంజన చౌదరీ విశ్లేషణ
ఇక్కడి సంప్రదాయం ప్రకారం, పెళ్లి సమయంలో వరుడు, అతని బంధువులు వధువు ఇంటికి వెళ్లాలి. అక్కడ వివాహం, ఇతర వేడుకలు జరుగుతాయి. తర్వాత వధువు తన కుటుంబానికి వీడ్కోలు చెప్పి భర్త ఇంటికి వెళ్తుంది. ప్రాచీన కాలం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ, పశ్చిమ బంగ్లాదేశ్‌లోని మెహర్‌పూర్‌ జిల్లాలో దీనికి భిన్నంగా జరిగింది. వధువు తన కుటుంబంతో కలసి పెళ్లి కోసం వరుడి ఇంటికి వచ్చింది. తరువాత వరుడు.. వధువు ఇంటికి వెళ్లాడు.

 
ఈ ఘటనను తక్కువగా చూడొద్దు. చాలా మంది పురుషులు దీన్ని అవమానంగా భావిస్తున్నారు. కొంతమంది దారుణమంటున్నారు. బంగ్లాదేశ్‌లోని పెద్ద నగరాల్లో కూడా ఇలా జరగలేదు. ఒక చిన్న గ్రామంలోని జంట గొప్ప ధైర్యాన్ని ప్రదర్శిస్తూ తమ వైవాహిక జీవితాన్ని ఇలా ప్రారంభించారు. వారిది నిజానికి సాహసోపేతమైన నిర్ణయం. 

 
ఇటీవల బంగ్లాదేశ్ సమానత్వం వైపు గొప్ప పురోగతి సాధించింది. లింగ సమానత్వం విషయంలో దక్షిణాసియాలో బంగ్లాదేశ్ మెరుగైన స్థితిలో ఉందని ప్రపంచ ఆర్థిక సమాఖ్య తెలిపింది. తమ నిర్ణయం నిజమైన లింగ సమానత్వాన్ని మరో మెట్టు ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు కొత్త జంట తారిఖల్, ఖదిజా పేర్కొన్నారు. ''మా వివాహం ఒక సందేశాన్ని ఇచ్చిందని కచ్చితంగా చెప్పగలను. మగాడు చేసే ప్రతి పనినీ మహిళ కూడా చేయగలదని మా వివాహంతో నిరూపించాం'' అని ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో తారిఖల్ చెప్పారు.

 
అయితే, బంగ్లాదేశ్‌లో ఇప్పటికీ కొన్ని తీవ్ర సమస్యలు అలానే ఉన్నాయి. 19ఏళ్ల వయసున్న నుస్రత్ జహాన్ మరణం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. తన హెడ్‌మాస్టర్‌ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినందుకు ఆమెను సజీవంగా ఖననం చేశారనే ఆరోపణలున్నాయి. మూడొంతుల్లో రెండొంతుల మంది మహిళలు పెళ్లైన తర్వాత తమ భాగస్వాముల చేతిలో హింసకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

 
ఇక్కడి వివాహ చట్టాలు మహిళల పట్ల వివక్షను చూపేలా ఉన్నాయని మహిళా హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. వివాహ నమోదు సమయంలో వధువు తాను కన్యనో కాదో వెల్లడించడం తప్పనిసరి కాదంటూ గత నెలలోనే అక్కడి హైకోర్టు తీర్పునిచ్చింది. మగవారికి మాత్రం ఇలాంటి నిబంధన లేదు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీ ప్రభుత్వంలో పాలనే లేదు... అశోక్‌బాబు