అది జార్ఖండ్ రాష్ట్రంలోని ఒక గ్రామం. అక్కడో గుడిసెలో యువజంట బియ్యం వారాంతం వరకు సరిపోతాయా, సరిపోవా అని మాట్లాడుకొంటోంది. ఇంతలో ఇల్లాలు తొంగి చూసి, "పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే దగ్గర్లోని ఫ్యాక్టరీలకు వెళ్లి చూడండి, సర్" అని నాతో అన్నారు.
రోజు గడవడానికి అష్టకష్టాలు పడుతున్నామని ఆమె భర్త రామ్ మార్ది వాపోయారు. కుటుంబాన్ని పోషించేది ఆయనే.
"ఆర్థిక వ్యవస్థ మందగించే వరకు మా జీవితం బాగుండేది. ఇప్పుడు తినడానికి కూడా కష్టంగా ఉంది. పిల్లలను బడి మాన్పించాల్సి వచ్చింది. మా అమ్మ మంచాన పడ్డారు. ఎప్పుడైనా నా ఆరోగ్యం కూడా సరిగా లేకపోతే, మా కుటుంబం ఎలా బతకాలి" అని రామ్ ఆందోళన వ్యక్తంచేశారు.
ఆయన పారిశ్రామిక నగరం జంషెడ్‌పూర్‌లో కార్లు, భారీ వాహనాల విడిభాగాల తయారీ సంస్థలో పనిచేస్తున్నారు.
గత నెల రోజుల్లో కేవలం రెండు వారాలే ఆయనకు పని దొరికింది. తాము ఉత్పత్తి చేసేవాటికి డిమాండ్ తగ్గడంతో కంపెనీ కొన్ని వారాలకోసారి కార్యకలాపాలు నిలిపివేస్తోంది.
దేశంలో వాహనాలకు వినియోగదారుల నుంచి డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఇది ఆర్థిక మందగమనాన్ని సూచిస్తోంది.
అత్యంత తీవ్రమైన ప్రభావం పడిన పరిశ్రమల్లో కార్ల తయారీ పరిశ్రమ ఒకటి. అనేక కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెట్టి, ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి.
ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జులైలో 30 శాతానికిపైగా క్షీణించాయి. ఇవి దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.
బ్యాంకింగ్ సంక్షోభం వల్ల వాహన రంగంలోని డీలర్లు, వాహనాలు కొనాలనుకొనేవారు రుణాల కోసం తిప్పలు పడుతున్నారు.
వాహనాలు తయారుచేసే భారీ కంపెనీలకు చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు అవసరమైన పరికరాలను సరఫరా చేస్తాయి. ఆర్థిక మందగమనంతో ఈ పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం తన తండ్రి అనారోగ్యం బారిన పడటం, కుటుంబానికి చెందిన వాహన విడిభాగాల తయారీ కర్మాగారం ఇబ్బందుల్లో ఉండటంతో వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన సమీర్ సింగ్ సొంతూరైన జంషెడ్‌పూర్‌కు తిరిగి వచ్చారు.
గత రెండు దశాబ్దాల్లో తమ వ్యాపారాన్ని పుంజుకొనేలా చేయడమే కాకుండా, మరిన్ని తయారీ కేంద్రాలను ప్రారంభించారు. ఇవి భారీ వాహనాలకు అవసరమైన విడిభాగాలను తయారుచేస్తాయి.
తమ కర్మాగారాల్లో కార్యకలాపాలు సాగించడానికి తమకు ఎన్నడూ పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదని సమీర్ సింగ్ చెప్పారు.
వ్యాపారాన్ని నడిపించడానికి డబ్బు, దృఢమైన సంకల్పం ఉండాలని ఆయన అన్నారు.
"నాలాంటి చిన్న వ్యాపారవేత్తలు ఉన్న డబ్బు, దాచుకొన్న డబ్బు, రుణాలు అన్నీ వ్యాపారానికే కేటాయిస్తారు. మేం రుణాలు ఎగవేయాలని అనుకోం. మా ఉద్యోగులు కొన్ని వారాలుగా ఖాళీగా ఉండాల్సి వస్తోంది. వారి పరిస్థితి చూస్తే నాకు బాధగా ఉంది. మా వ్యాపారం ఇలాగే ఇబ్బందుల్లో ఉంటే వాళ్లు ఇక్కడ ఉద్యోగం మానేసి మరో చోట చేరొచ్చు. కానీ నేను మరో చోట ఉద్యోగం వెతుక్కోలేను. నా జీవితం మా వ్యాపారంతోనే ముడిపడి ఉంది" అని సమీర్ సింగ్ విచారం వ్యక్తంచేశారు.
దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడున్నర కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. దీనిని బట్టి ఇప్పుడు ఈ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితి ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు లక్ష మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు.
ఆర్థిక మందగమనంతో ప్రజలు పడుతున్న కష్టాలకు పారిశ్రామిక నగరమైన జంషెడ్‌పూర్‌లోని పరిస్థితి అద్దం పడుతుంది.
వాహనాల విడిభాగాలు తయారుచేసే అనుబంధ కర్మాగారాల్లో అత్యధికం ఆదిత్యపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఇమ్లి చౌక్‌లో ఉంటాయి. ఈ కర్మాగారాల్లో పని చేసేందుకు నిత్యం ఉదయాన్నే వందల మంది కూలీలు ఇక్కడ పోగవుతుంటారు. వీరిని స్థానిక కాంట్రాక్టర్లు ఫ్యాక్టరీల్లో పనిలో పెడుతుంటారు.
కానీ మేం వెళ్లినప్పుడు ఇమ్లి చౌక్‌లో అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. అన్ని వయసుల మగవారు, ఆడవారు పని కోసం అక్కడ ఎదురుచూస్తూ కనిపించారు. వాళ్లలో ఓపిక నశించినట్లు కూడా అనిపించింది. కొందరు కూలీలు మమ్మల్ని కాంట్రాక్టర్లు అనుకొన్నారు.
ముగ్గురు పిల్లల తల్లి అయిన లక్ష్మి, రోజూ పని కోసం 15 కిలోమీటర్ల దూరం నుంచి ఇమ్లి చౌక్‌కు వస్తారు. గత కొన్ని నెలలుగా పని సరిగా దొరక్క ఆమెకు నిరాశ ఎదురవుతోంది.
రోజు రోజుకూ పరిస్థితి మరింత కష్టంగా మారుతోందని లక్ష్మి ఆందోళన వ్యక్తంచేశారు.
"కొందరు అదృష్టవంతులకే పని దొరుకుతోంది. చాలా మంది ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. బస్ టికెట్‌కు సరిపడ డబ్బులు కూడా ఉండటం లేదు. చాలాసార్లు మేం ఇంటికి చేరుకొనేందుకు గంటల కొద్దీ నడవాల్సి వస్తోంది. పని దొరికినప్పుడు రోజుకు నాలుగైదు వందల రూపాయలు సంపాదించుకొనేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. రోజుకు వంద నుంచి నూట యాభై రూపాయలు ఇచ్చినా మరుగుదొడ్లు, రోడ్లు శుభ్రం చేయడం సహా ఏ పనైనా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అయినా మాకు ఏ పనీ దొరకడం లేదు" అని ఆమె తన బాధను పంచుకొన్నారు.
వివిధ రంగాల్లో మరిన్ని ఉద్యోగాలకు కోత పడుతుందనే ఆందోళనలు ఉన్నాయి. పర్యవసానంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం నెమ్మదిస్తుంది. ఈ ప్రభావం వాహన పరిశ్రమపై పడుతుంది. ఇది పరిశ్రమకు మరింత ఆందోళన కలిగించే అంశం.
వాహన అమ్మకాల్లో ఈ ఏడాది నమోదైన క్షీణత ఎంత తీవ్రంగా ఉందంటే- ద్విచక్ర వాహనాలు, కార్లు, కమర్షియల్ వాహనాలు ఇలా ప్రతీ శ్రేణిపై ప్రభావం పడిందని వాహన విడిభాగాల తయారీదారు, భారత ఆటోమోటివ్ విడిభాగాల తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) ప్రధాన కార్యదర్శి అయిన సంజయ్ సభర్వాల్ చెప్పారు.
గతంలో ఆర్థిక తిరోగమనం లేదా మాంద్యం ఉన్నప్పుడు కమర్షియల్ వాహనాలు, క్రేన్లు, బుల్డోజర్లు లాంటి వాహనాలపైనే ఎక్కువ ప్రభావం ఉండేదని ఆయన ప్రస్తావించారు. కానీ ఈసారి ఒక్కసారిగా అమ్మకాల్లో పతనం నమోదైందన్నారు.
జంషెడ్‌పూర్ కర్మాగారాలపై వేల మంది బతుకుదెరువు ఆధారపడి ఉంది. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే ఆస్కారం ఉంది.
విడిభాగాల తయారీదారు రూపేశ్ కర్తియార్‌కు ఉన్న రెండు కర్మాగారాలు గత నెల రోజుల్లో ఒక్క వారంపాటే పనిచేశాయి. ఇదే పరిస్థితిలో చాలా మంది తయారీదారులు ఉన్నారు.
మార్కెట్ ఒక్కసారిగా పతనమైందని, ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని రూపేశ్ తెలిపారు.
అనుకున్నదాని కన్నా వృద్ధిరేటు తక్కువగా ఉండటం వల్ల భారీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు పడిపోయాయని, ఇది తాను అర్థం చేసుకోగలనని, కానీ బైక్‌ల వంటి తక్కువ ధర ఉండే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కూడా పడిపోయాయని ప్రస్తావించారు. మార్కెట్లో నెగటివ్ సెంటిమెంట్ ఉందని, పరిస్థితి మెరుగుపడటానికి సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.
వాహన పరిశ్రమను ఆదుకొనేందుకు పన్నులు తగ్గించాలని, డీలర్లకు, వినియోగదారులకు రుణ సదుపాయాలను మెరుగుపరచాలని వాహన తయారీదారులు చాలాకాలంగా కోరుతున్నారు. ఎలక్ట్రానిక్ వాహనాల వైపు మళ్లే విషయంలో ప్రభుత్వం వేగం తగ్గించుకోవాలని కూడా చాలా మంది సూచిస్తున్నారు.
దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుండటాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆర్థిక వృద్ధి రేటును పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల అనేక చర్యలు ప్రకటించింది. వాహన రంగాన్ని ఆదుకొనేందుకు ప్యాకేజీ ప్రకటన, ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్ల మూలధనాన్ని సమకూర్చడం, గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు దిశగా చర్యలు ఈ జాబితాలో ఉన్నాయి.
పరిస్థితిని చక్కదిద్దడానికి ఈ చర్యలు సరిపోతాయా అనే ప్రశ్నకు సమాధానం కష్టమే. దేశ ఆర్థిక వ్యవస్థ తీరును అంచనా వేసేందుకు వాహన పరిశ్రమ వృద్ధిని ఒక సంకేతంగా భావిస్తుంటారు.
భారత వాహన రంగంలో ఇదే అత్యంత తీవ్రమైన పతనమని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపైనా తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.