ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈఎస్ఐ కార్పొరేషన్లో అక్రమాలపై విజిలెన్స్ విభాగం చేసిన విచారణ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ నివేదికలో ఈఎస్ఐ వైద్య విభాగానికి చెందిన ముగ్గురు అధికారుల పేర్లు కీలకంగా ఉండగా, దాంతో పాటు గత ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు పేరు ఉండడమే అందుకు కారణం. సుమారు 8 కోట్ల రూపాయల కాంట్రాక్టుకు సంబంధించి కేవలం మంత్రి లేఖ ఆధారంగా ఎంఓయు చేసుకోవడం వివాదానికి దారితీసింది.
కాగా, ఐదేళ్లలో సుమారు 151 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించి ప్రభుత్వానికి నష్టం చేశారని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. రూ.21 వేల కంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు వారి జీతం నుంచి కొంత, కంపెనీ కొంత, ప్రభుత్వం కొంత సొమ్ము జత చేయడం ద్వారా ప్రభుత్వమే హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుంది.
ఇదే ఈఎస్ఐ. దానికి సంబంధించి ముందుగా రాష్ట్రం ఖర్చు పెడితే, తరువాత ఈఎస్ఐ కార్పొరేషన్ వాటా డబ్బు రాష్ట్రానికి వస్తుంది. కార్మిక శాఖ పరిధిలో ఉండే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ అనే సంస్థ ఈ నిర్వహణ చూస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈఎస్ఐ కింద 4 ఆసుపత్రులు, 3 పరీక్షా కేంద్రాలు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొనుగోళ్లలో ఈ అక్రమాలు జరిగాయన్నది విజిలెన్స్ నివేదిక సారాంశం.
2014 - 2019 మధ్య ఐఎంఎస్ కి ముగ్గురు డైరెక్టర్లు పని చేశారు. ముగ్గురి హయాంలోనూ కొనుగోళ్లలో అక్రమాలు జరగాయన్నది విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వాదన. ఈ ముగ్గురి హయాంలో మొత్తం రూ. 975.79 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిగాయి. ఈ కొనుగోళ్లలో ఈఎస్ఐ పాటించాల్సిన నిబంధనలనూ, 2012 నాటి జీవో 51లోని నిబంధనలనూ పాటించలేదనీ, దాని వల్ల ఖజానా కోట్ల రూపాయల నష్టం చేశారని విజిలెన్స్ పేర్కొంది. వీటిలో డా. బి రవి కుమార్ హయాంలో రూ. 325.21 కోట్లు, డా. సి కె రమేశ్ కుమార్ హయాంలో రూ. 227.71 కోట్లు, డా. జి విజయ కుమార్ హయాంలో రూ. 435.85 కోట్ల కొనుగోళ్లు జరిగాయి.
విజిలెన్స్ నివేదికలో ఏం పేర్కొన్నారంటే..
ఈ ముగ్గురి హయాంలో మందులు కొనడానికి రూ.293 కోట్ల 51 లక్షలు కేటాయించగా, వారు ఏకంగా రూ.698 కోట్ల 36 లక్షల విలువైన మందులు కొన్నారు. అంటే అదనంగా రూ.404.86 కోట్లు ఖర్చు చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 సంవత్సరం వరకూ నాన్ రేట్ కాంట్రాక్టర్ల నుంచి రూ.89.58 కోట్ల మందులు కొన్నారు. ఈఎస్ఐలో ముందుగా నమోదైన రేట్ కాంట్రాక్టర్ల నుంచే మందులు కొనాలి. కానీ అలా జరగలేదు. నిజానికి ఇవే మందులు రేట్ కాంట్రాక్టర్ల నుంచి కొంటే రూ.38.56 కోట్లకే వచ్చుండేవి. అంటే, రూ.51.02 కోట్లు అదనంగా చెల్లించారు.
ల్యాబ్ కిట్లు రూ.237 కోట్లకు లెజెండ్ ఎంటర్‌ప్రైజెస్, అవంతర్ పెర్ఫార్మెన్సస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఓమ్ని మెడి అనే సంస్థల నుంచి కొన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా బయటి మార్కెట్ కంటే 36 శాతం అదనంగా, అంటే రూ.85 కోట్ల 32 లక్షల రూపాయల అధిక ధరకు కొన్నారు. ఓపెన్ టెండర్ కాకుండా నామినేషన్ పద్ధతిలో కొన్నారు. ఇక ల్యాబ్ సామాగ్రి కోసం కూడా నామినేషన్ పద్ధతిలో లెజెండ్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి రూ.2.45 లక్షలకు కొన్నారు. ఈ రెండింటికీ టెండర్లు వేయలేదు.
రూ.47.77 కోట్లతో సర్జికల్ ఐటెమ్స్ కూడా టెండర్ లేకుండా కొన్నారు. ఈఎస్ఐ సంస్థ 2018-19 సంవత్సరానికి నిర్ణయించిన రేట్ కాంట్రాక్టు కంటే ఇది రూ.10.43 కోట్లు అదనం. ఇక రూ.6 కోట్ల 62 లక్షలతో ఫర్నిచర్ కొన్నారు. అది మార్కెట్ ధర కంటే రూ.4 కోట్ల 63 లక్షలు ఎక్కువ. ఇది టెండర్లు లేకుండానే చేశారు.
మందుల్లో రూ.51 కోట్ల 2 లక్షలూ, ల్యాబ్ కిట్లలో రూ.85 కోట్ల 32 లక్షలూ, సర్జికల్ ఐటెమ్స్‌లో రూ.10 కోట్ల 43 లక్షలూ, ఫర్నీచర్లలో రూ.4 కోట్ల 63 లక్షలూ మొత్తం కలపి రూ.151 కోట్ల 40 లక్షలు అదనంగా ఖర్చు చేశారు.
రాశి ఫార్మా, వీరేశ్ ఫార్మా సంస్థల పర్చేజ్ - సేల్ ఇన్‌వాయిస్‌ల మధ్య ఉన్న తేడా ప్రకారం చూస్తే రూ.5 కోట్ల 70 లక్షలు అదనంగా చెల్లించారు. ఇక రూ.9.50 కోట్ల మందుల ఆర్డర్లు పొందిన జెర్కాన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో ఫార్మాసిస్ట్‌గా ఉన్న కె.ధనలక్ష్మి కోడలు రావిళ్ల రవి తేజస్వి. ఈ సంస్థకు రమేశ్ కుమార్, విజయ కుమార్‌ల హయాంలో ఆర్డర్లు ఇచ్చారు. ఇక జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు ఇచ్చిన ఆర్డర్లలోనూ అవకతవకలు ఉన్నాయి. ప్రొడిజి సంస్థ నుంచి ఒక్కోటీ రూ.17 వేలు ఖరీదు చేసే బయో మెట్రిక్ మెషీన్లను ఒక్కోటీ రూ.70 వేల చొప్పున వంద మెషీన్లు కొన్నారని విజిలెన్స్ పేర్కొంది.
ఈ విచారణలో భాగంగా చాలా కొటేషన్లు మార్చేశారని స్పష్టమైంది. కొటేషన్ల కవర్లపై ఉన్న చేతిరాత ఈఎస్ఐ సిబ్బందివే ఉన్నాయంటున్నారు విజిలెన్స్ అధికారులు. పోనీ ఇదంతా చేసింది కార్మికులకు ఉపయోగపడిందా అంటే, అదీ లేదంటున్నారు అధికారులు. కొన్నవాటిలో చాలా మందులు, ఇతర పరికరాలు ఏడాదిగా ఉపయోగం లేకుండా పడున్నాయని విజిలెన్స్ చెబుతోంది. వీరు ఐపీసీలోని వివిధ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద నేరం చేశారు.
అచ్చెన్నాయుడు జోక్యం
టెలి హెల్త్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి పనులు ఇవ్వండి అని అప్పటి కార్మిక మంత్రి అచ్చెంనాయుడు ఒక లేఖ రాశారు. దీంతో అప్పటి ఐఎంఎస్ డైరెక్టర్ రమేశ్ కుమార్ ఆ లేఖ ఆధారంగా వారికి పనులు ఇచ్చేశారు. ఈసీజీ సేవలు, ఇంకా టోల్ ఫ్రీ సేవల కోసం వారికి నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారు. మార్కెట్లో సుమారు రూ. 200 కంటే ఎక్కువ ఖర్చుకాని ఈసీజీకి రూ.480 రూపాయలు చొప్పున ఆ సంస్థకు చెల్లించారు. ఇక ఎన్ని ఫోన్లు, ఎక్కడి నుంచి వచ్చాయన్న దాంతో సంబంధం లేకుండా కాల్ సెంటర్ బిల్లులు ఇచ్చేశారు. ఆ సంస్థకు రూ.8 కోట్లు చెల్లించారు. 2016 నవంబరులో మంత్రి అచ్చెన్నాయుడు టెలి హెల్త్ సర్వీసెస్ సంస్థ తరపున లేఖ ఇచ్చారు. అందులో స్పష్టంగా ఆ సంస్థతో ఎంఓయు కుదుర్చుకోండి అని రాసి ఉంది.
విచారణ జరిపించుకోవచ్చు - అచ్చెన్నాయుడు వివరణ
మొత్తం అవినీతి జరిగిన రూ.151 కోట్లలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడి భాగస్వామ్యం ఉందని వైయస్సార్సీపీ నాయకులు పి గౌతం రెడ్డి ఆరోపించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామనీ, ఎవర్నీ వదలిపెట్టబోమని ప్రస్తుత కార్మిక మంత్రి గుమ్మనూరి జయరాం మీడియా ముందు ప్రకటించారు.
అయితే తాను తెలంగాణలో జరిగినట్టే చేయమని అధికారులను ఆదేశించాననీ, తనకు అంతకుమించి ప్రమేయం లేదనీ అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. తాను ఇచ్చిన లేఖ ఆధారంగా పద్ధతులన్నీ చూసుకుని అమలు చేయాల్సింది అధికారులేనని అన్నారు. తనపై ఆరోపణల్ని ఆయన ఖండించారు. రికార్డులన్నీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయని, చూసుకోవాలని అన్నారు.