Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనావైరస్: ఇటలీని దాటేసిన అమెరికా, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇక్కడే

Advertiesment
కరోనావైరస్: ఇటలీని దాటేసిన అమెరికా, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇక్కడే
, సోమవారం, 13 ఏప్రియల్ 2020 (23:11 IST)
కరోనావైరస్ మరణాల విషయంలో అమెరికా ఇటలీని కూడా దాటేసింది. ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్-19 మరణాలు నమోదైన దేశంగా మారింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం కరోనావైరస్ కారణంగా అమెరికాలో ఇప్పటివరకూ 20,604 మంది ప్రాణాలు వదిలారు.

 
ఏ దేశంలోనూ లేనట్లుగా అమెరికాలో ఒకే రోజు 2వేల మంది కోవిడ్-19కు బలయ్యారు. తమ రాష్ట్రంలో మరణాల రేటు కాస్త స్థిరపడుతున్నట్లు కనిపిస్తోందని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్వూమో శనివారం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 783 మంది మరణించారని, గత కొన్ని రోజులుగా మరణాలు ఇదే స్థాయిలో ఉంటున్నాయని ఆయన చెప్పారు.

 
‘‘ఇప్పటివరకూ ఇదే అత్యధికం కాదు. మరణాల రేటు స్థిరపడుతుండటాన్ని మీరు చూడొచ్చు. కానీ, ఈ రేటు ఘోరంగా ఉంది’’ అని ఆయన అన్నారు. అమెరికాలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లకు న్యూయార్క్ కేంద్రంగా మారిపోయింది. మొత్తం దేశంలో 5.2 లక్షల ఇన్ఫెక్షన్లు నమోదైతే, అందులో 1.8 లక్షల కేసులు న్యూయార్క్ రాష్ట్రంలో నమోదైనవే.

 
దేశంలోని అన్ని రాష్ట్రాలూ కరోనావైరస్‌ను విపత్తుగా ప్రకటించాయి. మరోవైపు బ్రిటన్‌లో కొత్తగా 917 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 9,875కు చేరుకుంది. స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక రోజులో కొత్తగా 510 మంది మరణించినట్లు ప్రకటించింది. గత మూడు వారాల్లో ఇదే అత్యల్పం.

 
ఫ్రాన్స్, ఇటలీల్లో మరణాల సంఖ్య పెరిగింది. కానీ, ఇంటెన్సివ్ కేర్‌లో ఉండే రోగుల సంఖ్య మరోసారి తగ్గింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనావైరస్ కారణంగా లక్ష మందికి పైగా చనిపోయారు. ఇప్పటివరకు ఇటలీలో 19,468 మంది మరణించారని జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ పేర్కొంది.

 
అమెరికాలో ప్రస్తుతానికి దాదాపు 5.3 లక్షల మంది కరోనావైరస్ బాధితులు ఉన్నారు. దేశంలో కరోనావైరస్ కేసులు, మరణాల రేటు స్థిరపడిందని, తగ్గుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ విభాగం అధిపతి డాక్టర్ ఆంథోనీ ఫాసీ అన్నారు. అయితే సామాజిక దూరం పాటించడం లాంటి కట్టడి చర్యలను ఇప్పుడే ఆపకూడదని చెప్పారు.

 
సామాజిక దూరం పాటించడం గురించి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జారీ చేసిన సూచనలు ఏప్రిల్ 30 వరకూ అమల్లో ఉంటాయి. కరోనావైరస్ కారణంగా అమెరికా ప్రభుత్వం రెండు వైపులా ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఆరోగ్యంతో పాటు ఆర్థికంగానూ దేశాన్ని ఈ ఇన్ఫెక్షన్ దెబ్బకొడుతోంది. గత కొన్ని వారాల్లో 1.6 కోట్లకు పైగా మంది ఉద్యోగాలు కోల్పోయారు.

 
వాణిజ్య, వైద్య రంగానికి చెందిన ప్రముఖులతో కొత్త మండలిని ఏర్పాటు చేస్తానని, తిరిగి అమెరికాలో వ్యాపార కార్యకలాపాలు ఎప్పుడు మొదలుపెట్టాలన్నదానిపై నిర్ణయం తీసుకోవడంలో ఈ మండలి తనకు సహకరిస్తుందని ట్రంప్ చెప్పారు. తాను తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయం ఇదేనని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా పుణ్యం.. గంగమ్మ తల్లి పవిత్రమైంది.. ఎలాగంటే?