అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ దెబ్బకు తల్లడిల్లిపోతోంది. ప్రతి రోజూ లెక్కకు మించిన కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదేవిధంగా నమోదవుతున్నాయి. తాజాగా కరోనా మరణాల్లో ఇటలీని అమెరికా దాటేసింది.
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ లెక్కల ప్రకారం అమెరికాలో ఇప్పటివరకు 20 వేల మంది మరణించారు. ఇటలీలో తాజా లెక్కల ప్రకారం 19,468 మంది చనిపోయారు. శుక్రవారం రోజున ఒక్క రోజే అమెరికాలో రెండు వేల మంది చనిపోవడంతో ఇటలీ రికార్డును అధికమించిందని వర్శిటీ గణాంకాలు తెలిపాయి.
అయితే న్యూయార్క్‌లో మరణాల రేటు కొంత తగ్గినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కుమో తెలిపారు. గత 24 గంటల్లో 783 మంది చనిపోయినట్లు ఆయన చెప్పారు. కేవలం న్యూయార్క్‌లోనే సుమారు లక్షా 80 వేల పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. శ్రీమంతుల మహానగరంగా భావించిన న్యూయార్క్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా ఉంది.