Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Al Qaeda హెచ్చరిక: ‘మొహమ్మద్‌‌ ప్రవక్తను అవమానించే వ్యాఖ్యలు చేసిన వారిని చంపేస్తాం, ఆత్మాహుతి దాడులు చేస్తాం’

terrorist
, బుధవారం, 8 జూన్ 2022 (12:52 IST)
మొహమ్మద్‌‌ ప్రవక్తను ఎవరైనా అవమానిస్తే వారిపై హత్యలు, బాంబు పేలుళ్లతో దాడులు చేస్తామని అల్‌ఖైదా దక్షిణాసియా విభాగం హెచ్చరించింది. భారతదేశంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు.. మొహమ్మద్‌‌ ప్రవక్త గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా ఈ హెచ్చరికను జారీ చేసింది. అల్-ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్) అని చెప్పుకుంటున్న ఈ జిహాదీ సంస్థ.. జూన్ 7వ తేదీన తన వెబ్‌సైట్‌తో పాటు టెలిగ్రామ్, రాకెట్‌చాట్, చిర్ప్‌వైర్ సోషల్ మీడియా అకౌంట్లలో ఈ ప్రకటనను ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో విడుదల చేసింది.

 
''హిందుత్వ (హిందూ జాతీయవాద సిద్ధాంతం) వాదులు కొన్ని రోజుల కిందట మొహమ్మద్‌‌ ప్రవక్త గురించి, ఆయన భార్య ఐషా గురించి ఒక ఇండియన్ టీవీ చానల్‌లో అవమానిస్తూ దూషించారు'' అంటూ బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలను ఆ ప్రకటనలో ఉటంకించింది. ''ప్రపంచంలో సిగ్గు, లజ్జా లేకుండా మలినంగా మాట్లాడే ప్రతి ఒక్కరూ లక్ష్యంగా, ముఖ్యంగా భారతదేశాన్ని ఆక్రమించివున్న హిందుత్వ ఉగ్రవాదులను లక్ష్యంగా పెట్టుకుని మేం హత్యలు, ఆత్మాహుతి దాడులు చేస్తాం'' అని తీవ్రంగా హెచ్చరించింది.

 
ప్రవక్తను అవమానించే వారికి ఎలాంటి క్షమాభిక్ష కానీ వారి మీద ఎలాంటి కనికరం కానీ ఉండబోదని చెప్పింది. ఈ అంశాన్ని ఖండనలు, విచారాల మాటలతో పరిష్కరించటం సాధ్యం కాదని, హింసాత్మక చర్యలు, ఎదురుదాడులతోనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించింది. ''కషాయ (హిందూ జాతీయ) ఉగ్రవాదులు ఇప్పుడిక దిల్లీ, బాంబే, యూపీ, గుజరాత్‌లలో తమ అంతం కోసం నిరీక్షించాలి. వారికి వారి ఇళ్లలో కానీ వారి కట్టుదిట్టమైన సైనిక శిబిరాల్లో కానీ ఆశ్రయం దొరకదు'' అని బెదిరించింది.

 
భారతదేశంలో ఇస్లాం మతానికి, ముస్లింలకు తమను రక్షకులుగా చూపించుకోవటానికి ఈ సంస్థ ప్రయత్నించింది. ''ఘాజ్వా ఎ హింద్'' - ఇండియా కోసం యుద్ధంలో ముస్లింలు చివరికి భారతదేశాన్ని జయిస్తారంటూ మొహమ్మద్‌‌ ప్రవక్త జోస్యం చెప్పారంటూ ప్రచారంలో ఉన్న మాటలను ఉటంకించింది. బీజేపీకి చెందిన ఇద్దరు అధికార ప్రతినిధులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని చాలా మంది ముస్లింలు భావిస్తుండటం.. ఆ వ్యాఖ్యల పట్ల జిహాదిస్టులు సహా ముస్లింల నుంచి ఆగ్రహం, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏక్యూఐఎస్ ప్రకటన వెలువడింది.

 
అల్-ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్) నేపథ్యం, లక్ష్యం ఏంటి?
ప్రపంచ ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ అల్-ఖైదా దక్షిణాసియా విభాగమే అల్-ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్).
2014 సెప్టెంబర్‌లో దీనిని అల్-ఖైదా నాయకుడు అయ్‌మాన్ అల్ జవహరీ ప్రారంభించారు. దీనికి నాయకుడిగా ఆసిమ్ ఉమర్‌ను నియమించారు.
దక్షిణాసియా ప్రాంతంలో ఉన్న అన్ని జీహాదిస్టు మిలిటెంట్ గ్రూపులను ఐక్యం చేయడం, జీహాద్ జెండాను ఎగరేయడమే దీని లక్ష్యం.
ముఖ్యంగా భారత్, మియన్మాన్, బంగ్లాదేశ్‌ల్లో పోరాడాలని నిర్ణయించారు. బంగ్లాదేశ్‌లో కొన్ని శాఖలను కూడా ఈ గ్రూపు ఏర్పాటు చేసుకుంది.
ఏక్యూఐఎస్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా 2016లో అమెరికా ప్రకటించింది.
2019 అక్టోబర్‌లో అఫ్గానిస్తాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్సులో అమెరికా, అఫ్గాన్ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఒక ఆపరేషన్‌లో ఆసిమ్ ఉమర్ చనిపోయాడని వార్తలు వెలువడ్డాయి. కానీ, వీటిపై ఏక్యూఐఎస్ స్పందించలేదు.
ఈ మిలిటెంట్ గ్రూపు అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌ల్లో క్రియాశీలకంగా ఉంది. ఈ గ్రూపు నాయకులంతా అక్కడే తలదాచుకుంటున్నారని భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీస్ కస్టడీకి సామూహిక అత్యాచార కేసు నిందితుడు