అది 2006 జనవరి 29.. టెస్టు సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ వెళ్లింది. రెండు జట్ల మధ్య ముందు జరిగిన రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. దీంతో కరాచీలో జరుగుతున్న మూడో మ్యాచ్ గెలవడం రెండు జట్లకూ అనివార్యమైంది. ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ సిరీస్ వారిదే. ఆనాటి తొలి ఓవర్ గురించి నేటికీ కథలుగా చెప్పుకొంటారు.
ఎందుకంటే మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి ఇర్ఫాన్ పఠాన్ మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మార్చేశాడు. సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, మహమ్మద్ యూసుఫ్‌ల వికెట్లను ఇర్ఫాన్ పడగొట్టాడు. చాలా కీలక ఘట్టాలకు ఈ మ్యాచ్ వేదికైంది. అయితే, ఈ మ్యాచ్ మరోసారి ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. దీనికి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యలే కారణం. ఆ మ్యాచ్‌లో ఎలాగైనా భారత క్రికెట్ దిగ్గజం సచిత్ తెందుల్కర్‌ను తాను గాయపరచాలని చూసినట్లు తాజాగా షోయబ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది స్పందిస్తున్నారు.
షోయబ్ అఖ్తర్ ఏం చెప్పాడు
ఆనాటి మ్యాచ్‌పై స్పోర్ట్స్‌కీడా వెబ్‌సైట్‌తో షోయబ్ అఖ్తర్ మాట్లాడారు. నేను ఈ విషయం చెప్పడం ఇదే మొదటిసారి. ఆ రోజు సచిన్‌ను చంపేయాలని అనుకున్నాను. ఎలాగైనా అతడిని గాయపరచాలని భావించాను. అందుకే మొదట అతడి హెల్మెట్‌ను లక్ష్యంగా చేసుకున్నాను. నేను బాల్ విసిరిన వేగానికి అతడు చనిపోయాడని అనుకున్నాను. కానీ, ఆ బాల్‌ను అతడు బలంగా కొట్టి.. తలను కాపాడుకున్నాడు. ఆ తర్వాత కూడా అతడిని గాయపరిచేందుకు ప్రయత్నించాను అని షోయబ్ చెప్పాడు.
ఈ ఇంటర్వ్యూలో పాకిస్తానీ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్‌పై షోయబ్ అఖ్తర్ ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌పై ఆసిఫ్‌ను ఐసీసీ సస్పెండ్ చేసింది. ఆసిఫ్ లాంటి బౌలర్లను చాలా కొద్ది మందినే నేను చూశాను అని షోయబ్ వివరించారు. నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓడిపోయింది. దీంతో ఆ సిరీస్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సచిన్ వికెట్‌ను అబ్దుల్ రజాక్ పడగొట్టాడు. అప్పటికి సచిన్ 23 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో సచిన్ వికెట్‌ను ఆసిఫ్ తీశాడు. అప్పటికి సచిన్ స్కోర్ 26.
సోషల్ మీడియాలో ఏం అంటున్నారు?
షోయబ్ అఖ్తర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే షోయబ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు అంటుంటే.. ఆయన కేవలం బౌలింగ్ గురించే మాట్లాడారని, ఎవరినీ అవమానించే ఉద్దేశం ఆయనకు లేదని మరికొందరు అంటున్నారు. ఈ అంశంపై పునీత్ చిత్‌కారా అనే ట్విటర్ యూజర్ స్పందిస్తు.. షోయబ్ ఆడింది 200 మ్యాచ్‌లే.. కానీ ఆయన చెప్పే కథలు 30,000 అని వ్యాఖ్యానించారు.
ఇదివరకు కూడా సచిన్‌పై వ్యాఖ్యలు చేసి షోయబ్ అఖ్తర్ వివాదాలకు తెరతీశారు. రావల్‌పిండీ ఎక్స్‌ప్రెస్‌గా క్రికెట్ అభిమానులు పిలుచుకునే షోయబ్.. తన ఆత్మకథ కాంట్రవెర్సియల్లీ యువర్స్లోనూ సచిన్ గురించి ప్రస్తావించారు. ఫైసలాబాద్ పిచ్‌పై తన ఫాస్ట్ బాల్స్‌ను ఎదుర్కొనేందుకు సచిన్ భయపడేవాడని ఈ పుస్తకంలో షోయబ్ రాసుకొచ్చారు. సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్‌లు మ్యాచ్ విన్నర్లు కాదు. మ్యాచ్‌లు ఎలా గెలవాలో వారికి తెలియదు కూడా”అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించేందుకు సచిన్ నిరాకరించారు.
గత ఏడాది కూడా..
గత ఏడాది కూడా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని షోయబ్ వార్తల్లో నిలించారు. పాకిస్తాన్ ప్రభుత్వ ఛానెల్ పీటీవీలోని గేమ్ ఆన్ హై కార్యక్రమానికి ఆయన వెళ్లారు.
న్యూజీలాండ్‌పై పాకిస్తాన్ జట్టు గెలవడంతో షోలో చర్చ పెట్టారు. దీనిలో విదేశీ క్రికెట్ నిపుణులతోపాటు షోయబ్ కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నోమాన్ నియాజ్ చెప్పేది విననివ్వకుండా.. పాకిస్తానీ సూపర్ లీగ్ టీఎం లాహోర్ ఖలందర్స్‌పై షోయబ్ ప్రశంసలు కురిపించారు. షా అఫ్రీదీ, హైరిస్ రవుఫ్ లాంటి ప్లేయర్లు తన జట్టు నుంచే వచ్చారని ఆయన చెప్పారు. దీంతో నోమాన్ నియాజ్.. షోయబ్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. నేను ఇలా చెప్పాలని అనుకోవట్లేదు. కానీ, తప్పదు. మిమ్మల్ని మీరు తెలివైనవారని చెప్పుకోవాలని అనుకుంటే, మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చుఅని నియాజ్ వ్యాఖ్యానించారు.