Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

China Population: చైనా జనాభా ఎందుకు తగ్గిపోతోంది? ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తున్నా ఎక్కువ మంది పిల్లల్ని ఎందుకు కనట్లేదు?

china population
, మంగళవారం, 7 జూన్ 2022 (15:42 IST)
ప్రపంచంలో అతి పెద్ద దేశం జనాభా తగ్గిపోతోంది. చైనా జనాభా ప్రపంచ జనాభాలో ఆరో వంతు కన్నా ఎక్కువగా ఉంటుంది. నాలుగు దశాబ్దాల్లో ఆ దేశ జనాభా 66 కోట్ల నుంచి 140 కోట్లకు పెరిగిపోయింది. కానీ ఈ ఏడాది తొలిసారిగా ఆ దేశ జనాభా సంఖ్య తగ్గబోతోంది. 1959-1961 మధ్య దేశాన్ని పీడించిన మహా దుర్భిక్షం తర్వాత చైనా జన సంఖ్య తగ్గటం ఇదే తొలిసారి. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాల ప్రకారం.. 2021లో ఆ దేశ జనాభా 141 కోట్ల 21 లక్షల 20 వేల నుంచి 141 కోట్ల 26 లక్షలకు మాత్రమే పెరిగింది. అంటే దశాబ్దం కిందట 80 లక్షలుగా వార్షిక జనాభా పెరుగుదల గత ఏడాది కేవలం 4 లక్షల 80 వేలకు పడిపోయింది.

 
కఠినమైన కోవిడ్ నియంత్రణ చర్యలు అమలులో ఉండటం వల్ల పిల్లలను కనడానికి ఇష్టపడకపోవటం.. గత ఏడాది జననాల తగ్గుదలకు ఒక కారణమైనప్పటికీ ఈ తగ్గుదల అంతకుముందు కొన్నేళ్లుగానూ కనిపిస్తోంది. 1980లలో చైనా సగటు జననాల రేటు (ఒక మహిళకు జననాలు) 2.6 గా ఉండేది. అప్పటి మరణాల రేటు 2.1 గా ఉండగా.. అంతకంటే ఎక్కువగానే జననాల రేటు ఉండేది. 1994 తరువాత జననాల రేటు 1.6 నుంచి 1.7 మధ్య ఉండేది. 2020 నాటికి అది 1.3కి, 2021 నాటికి 1.15కి పడిపోయింది. ఇతర దేశాలతో పోల్చిచూసినపుడు.. అమెరికా, ఆస్ట్రేలియాల్లో సగటు జననాల రేటు ఒక మహిళకు 1.6 జననాలుగా ఉంది. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న జపాన్‌లో ఈ రేటు 1.3గా ఉంది.

 
ఎక్కువ మంది పిల్లల్ని ఎందుకు కనట్లేదు?
జనాభా నియంత్రణ కోసం గతంలో ప్రవేశపెట్టిన ఒకే బిడ్డ విధానాన్ని చైనా 2016లో సడలించింది. ఇద్దరు బిడ్డలను కనేందుకు ప్రజలను అనుతించింది. అనంతరం 2021లో ముగ్గురు బిడ్డల విధానాన్ని ప్రవేశపెట్టి, పన్ను రాయితీలు, ప్రోత్సాహాలు ప్రకటించింది. అయినప్పటికీ చైనాలో జననాల రేటు పడిపోతూ వచ్చింది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నా కూడా చైనా మహిళలు పిల్లలను కనటానికి ఎందుకు ఇష్టపడటం లేదనే అంశంపై విభిన్న సూత్రీకరణలు ఉన్నాయి. జనం చిన్న కుటుంబాలకు అలవాటు పడటం ఒక కారణం కావచ్చు. జీవన వ్యయం పెరిగిపోతుండటం మరో కారణం కావచ్చు. వివాహ వయసు పెరుగుతుండటం వల్ల పిల్లలు కావాలనే కోరిక సన్నగిల్లటం కూడా ఒక కారణం కావచ్చునని కొందరు భావిస్తున్నారు.

 
అంతేకాకుండా.. చైనాలో పిల్లలను కనే వయసు మహిళల సంఖ్య ఆశించిన దానికన్నా తక్కువగా ఉంది. 1980 నుంచీ కేవలం ఒకే బిడ్డకు జన్మనివ్వటానికి పరిమితం కావటం వల్ల చాలా మంది దంపతులు మగపిల్లవాడు కావాలని కోరుకున్నారు. దీనివల్ల.. జననాల్లో 100 మంది బాలికలకు 106 మంది బాలురుగా (ప్రపంచంలో చాలా దేశాల్లో సాధారణ నిష్పత్తి ఇదే) ఉన్న లింగ నిష్పత్తి 120 మంది బాలురకు పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ నిష్పత్తి 100:130గా ఉంది. చైనా జనాభా వృద్ధి 60 ఏళ్ల కిందటి దుర్భిక్షం తర్వాత గత ఏడాది తొలిసారిగా అతి తక్కువకు పడిపోయింది. 1,000 మంది జనాభాకు కేవలం 0.34 మాత్రానికి పెరుగుదల రేటు నమోదైంది. నిజానికి షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ బృందం ఈ జనాభా వృద్ధి తరుగుదల ఈ ఏడాది ఉంటుందని.. 1,000 మందికి 0.49కి అది తగ్గుతుందని అంచనా వేసింది.

 
జనాభా వేగంగా తగ్గిపోతుందా?
ఈ మలుపు ఊహించన దానికన్నా ఒక దశాబ్దం ముందుగానే వచ్చేసింది. చైనా జనాభా 2029లో గరిష్ట స్థాయిలో 144 కోట్లకు పెరిగిపోతుందని చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అత్యంత తాజాగా 2019లో అంచనా వేసింది. ఆ తర్వాత 2031-32 సంవత్సరాల నాటికి కూడా ఈ పెరుగుదల కొనసాగుతుందని అప్పటికి గరిష్ట స్థాయిలో 146 కోట్లకు జనాభా సంఖ్య పెరుగుతుందని 2019 నాటి ఐక్యరాజ్యసమితి జనాభా అంచనాల నివేదిక లెక్కగట్టింది. 2021 నుంచి దేశ జనాభా ఏటా 1.1 శాతం చొప్పున తగ్గుతూ వస్తుందని.. 2100 సంవత్సరం నాటికి జనాభా ఇప్పటికన్నా సగానికి పైగా - మొత్తం 58.70 కోట్లకు తగ్గిపోతుందని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సైస్ బృందం అంచనా వేస్తోంది.

 
ఇప్పటికి 2030 నాటికి చైనా జననాల రేటు 1.15 నుంచి 1.1 శాతానికి పడిపోతుందని.. అది 2100 సంవత్సరం వరకూ అలాగే కొనసాగుతుందనే అంచనాలతో ఈ లెక్కలు వేశారు. జనాభా ఇంత వేగంగా తరిగిపోవటం చైనా ఆర్థిక వ్యవస్థ మీద భారీ ప్రభావం చూపుతుంది. చైనాలో పనిచేసే వయసు జనాభా 2014లో గరిష్ట స్థాయికి పెరిగిపోయింది. ఈ వయసు వారి జనాభా 2100 సంవత్సరానికి గరిష్ట స్థాయిలో మూడో వంతుకు తరిగిపోతుందని అంచనా. ఈ కాలంలో చైనాలో వయోవృద్ధుల జనాభా (65 సంవత్సరాలు, అంతకు మించిన వయసున్న వారు) క్రమంగా పెరుగుతూ వస్తుందని, 2080 నాటికి వృద్ధుల సంఖ్య.. పనిచేసే వయసు వారి సంఖ్యను మించిపోతుందని.. ఆ తర్వాత కూడా వృద్ధుల జనాభా పెరుగుదల కొనసాగుతుందని అంచనాలు వేశారు.

 
దీని అర్థం.. చైనాలో ప్రస్తుతం ప్రతి 20 మంది వృద్ధులకు మద్దతునివ్వటానికి 100 మంది పనిచేసే వయసు జనం ఉండగా.. 2100 నాటికి 100 మంది పనిచేసే వయసు వారు 120 మంది వృద్ధులకు మద్దతునివ్వాల్సి ఉంటుంది. చైనాలో పనిచేసే వయసు వారి సంఖ్య ప్రతి ఏటా 1.73 శాతం చొప్పున తరిగిపోతుండటం వల్ల.. దేశంలో ఉత్పాదకత వేగంగా ఆధునికీకరణ జరిగితే తప్ప ఆర్థికాభివృద్ధి మరింతగా తగ్గిపోయే పరిస్థితులు వస్తాయి. కార్మిక శక్తి వేగంగా పడిపోతుండటం వల్ల కార్మిక శక్తి ఖరీదు పెరిగిపోతుంది. ఫలితంగా తక్కువ లాభాలుండే, కార్మిక శక్తి ఎక్కువ అవసరమయ్యే తయారీ రంగం చైనా నుంచి బయటకు తరలిపోతుంది. కార్మిక శక్తి పుష్కలంగా లభించే వియత్నాం, బంగ్లాదేశ్, ఇండియా వంటి దేశాలకు ఆ తయారీ రంగం మళ్లుతుంది.

 
ఇప్పటికే.. వియత్నాంతో పోలిస్తే చైనాలో తయారీ రంగపు కార్మిక శక్తి ఖరీదు రెట్టింపుగా ఉంది. అదే సమయంలో.. పెరుగుతున్న వృద్ధ జనాభా అవసరాలను తీర్చటానికి చైనా తన ఉత్పాదక వనరుల్లో ఎక్కువ భాగాన్ని ఆరోగ్యం, వైద్య రంగాలకు మళ్లించాల్సి వస్తుంది. చైనా పెన్షన్ వ్యవస్థలో మార్పులు చేయకపోయినట్లయితే.. 2020 సంవత్సరంలో జీడీపీలో 4 శాతంగా ఉన్న ఆ దేశ పెన్షన్ చెల్లింపులు 2100 సంవత్సరానికి జీడీపీలో 20 శాతానికి పెరిగిపోతుందని.. ఆస్ట్రేలియాలోని విక్టోరియా యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఆఫ్ పాలసీ స్టడీస్ రూపొందించిన ఒక నమూనా సూచిస్తోంది.

 
చైనాకు వనరులను ఎగుమతులు చేసే ఆస్ట్రేలియా వంటి దేశాలు.. ఈ మార్పుల ఫలితంగా మున్ముందు చైనా వెలుపల తయారీదారులకు తన ఎగుమతులను మళ్లించాల్సిన అవసరం రావచ్చు. అలాగే చైనా నుంచి దిగుమతులు చేసుకునే అమెరికా వంటి దేశాలు క్రమంగా.. కొత్తగా ఆవిర్భవించే తాయారీ కేంద్రాలవైపు మళ్లాల్సి వస్తుంది. ఈ శతాబ్దం 'చైనా శతాబ్దం' అంటూ విశ్లేషణలు వస్తున్నప్పటికీ.. చైనా జనాభాకు సంబంధించిన ఈ అంచనాలు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండబోతున్నాయని చెప్తున్నాయి. రాబోయే దశాబ్దంలో చైనా జనాభాను మించిపోనున్న ఇండియా వంటి దేశాలు భవిష్యత్తులో ప్రబల ప్రభావం చూపబోతాయని సూచిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పామ్ - ఫేక్ ఖాతా లెక్కలు ఇవ్వాల్సిందే.. లేదంటే డీల్ క్యాన్సిల్ : ఎలాన్ మస్క్