Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13 ఏళ్ల బాలికకు 37 ఏళ్ల వ్యక్తితో పెళ్లి, హైదరాబాద్ పాతబస్తీలో 250 బాల్య వివాహాలు

Advertiesment
13 ఏళ్ల బాలికకు 37 ఏళ్ల వ్యక్తితో పెళ్లి, హైదరాబాద్ పాతబస్తీలో 250 బాల్య వివాహాలు
, సోమవారం, 4 జనవరి 2021 (14:02 IST)
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా దేశంలో మార్చి నెలాఖరులో లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. బాల్య వివాహాలు పెరిగాయి. లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్‌‌ పాతబస్తీ లోని 19 వాడల్లో 250 బాల్య వివాహాలు జరిగాయని షాహీన్ స్వచ్ఛంద సంస్థ చెప్పింది. వారు నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు బయట పడ్డాయని షాహీన్ సంస్థ నిర్వాహకురాలు జమీలా నిషంత్ బీబీసీకి తెలిపారు.

 
అయితే వివాహ వయస్సు గురించి అవగాహన ఉన్న ఆడపిల్లలు ఇంట్లో వారితో పోరాడి తమ వివాహాలను అడ్డుకున్నారని కూడా తెలిపారు. నషీమన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల ఓ బాలిక తనకు పెళ్లి చేయకుండా ఆపేందుకు పడిన ఇబ్బందుల గురీంచి బీబీసీకి వివరించారు. "ఇంట్లో ఆర్థికగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. నన్ను ఎనిమిదో తరగతిలోనే స్కూల్ కు పంపడం ఆపేశారు.

 
నేను గాజుల తయారి పని చేసుకుంటూ పదో తరగతి వరకు చదివాను. లాక్‌డౌన్ సమయంలో పెళ్ళి సంబంధం వచ్చింది. నేను పెళ్ళి చేసుకోనని మా అమ్మకు చెప్పాను. ఎంతో బతిమలాడాను... పోలీసు ఆఫీసర్ కావాలన్నది నా కల అని చెప్పాను. అయిన వినలేదు... లాక్‌డౌన్ కనుక తక్కువ ఖర్చులో పెళ్ళి అయిపోతుందన్నారు... మా నాన్న నన్ను కొట్టారు కూడా" అని తన ఇబ్బందుల్ని చెప్పుకొచ్చారు. పాతబస్తీలోని హసన్ నగర్, నషీమన్ నగర్, వాల్మికి నగర్, సిద్దికీ నగర్, పటేల్ నగర్, అమన్ నగర్, భవానీ నగర్ ప్రాంతాల్లో సర్వే చేసినట్టు జమీలా తెలిపారు.

 
ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలను పెద్ద వయసు వారికి ఇచ్చి జరిపిన వివాహాలు ఎక్కువ ఉన్నాయని ఆమె అన్నారు. "సులువుగా ఖర్చు లేకుండా పెళ్లి అయిపోతోంది కదా.... అప్పు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదన్న ఆలోచన... దానికి తోడు లాక్‌డౌన్‌తో ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. అనేక మంది ఉపాధి కోల్పోయారు....తినడానికి కూడా లేని పరిస్థితి కొందరిది...ఏప్రిల్ నుంచి మేము చేస్తున్న సహాయ కార్యక్రమాల్లో ఈ పరిస్థితి చూశాం.

 
ఈ పరిస్థితుల్లో ఆడపిల్ల పెళ్ళి సులువుగా ఖర్చు లేకుండా అయిపోతోందని కొందరు... ఆడపిల్ల భారం వదిలించుకునే ఆలోచనతో మరి కొందరు తమ పిల్లలకు బాల్య వివాహాలు చేశారు" అని ఆమె చెప్పారు.

 
13 ఏళ్ల బాలికు 37 ఏళ్ల వ్యక్తితో పెళ్లి
మే చివరి వారంలో 16 ఏళ్ల బాలికకు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి హైవేకు ఆనుకొని ఉన్న కండ్లకోయలో స్ధానిక అమ్మవారి గుడి లో వివాహం జరిగింది. గ్రామ పెద్దలే దగ్గరుండీ ఈ బాల్య వివాహం చేశారు. బాలిక కుటుంబం కొన్నేళ్ల క్రితం ఆంద్రప్రదేశ్ నుంచి పని కోసం తెలంగాణకు వలస వచ్చింది. వారంతా భవన నిర్మాణ కార్మికులు. పెళ్లి కొడుకు కూడా భవన నిర్మాణ కార్మికుడు.

 
బాలిక, ఆ యువకుడి మధ్య స్నేహం పెరిగింది. బాలిక కుటుంబ సభ్యులు వీరి స్నేహానికి అభ్యంతరం చెప్పారు. గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇద్దరి కుటుంబాల మధ్య రాజీ కుదిర్చిన గ్రామ పెద్దలు ఆ బాలికకు 23 ఏళ్ల ఆ అబ్బాయిని ఇచ్చి వివాహం చెయ్యాలని తీర్మానించారు. జూన్ 15 న తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారి పల్లి లో ఓ 13 ఏళ్ళ బాలికకు 37 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లల తండ్రితో వివాహం చేశారు. ఈ ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహాల కేసుల సంఖ్య పెరిగింది. జనవరి నెలలో మూడు బాల్య వివాహాల కేసులు నమోదు కాగా ఒక్క జూన్‌లోనే 18 కేసులు నమోదైనట్టు పోలీసు వర్గాలు బీబీసీ తెలుగుకి తెలిపాయి. తెలంగాణ షీ టీమ్స్ ఐజి స్వాతి లక్రా దీనిపై బీబీసీ తెలుగుతో మాట్లాడారు.

 
"కరోనాతో పాఠశాలలు మూతపడటంతో బడిలో ఉండాల్సిన ఆడపిల్లలు ఇంటికే పరిమితం కావడం దీనికి కారణం కావచ్చు" అని ఆమె అన్నారు. వాస్తవానికి అధికారుల దృష్టికి రాని కేసులు ఇంకా ఎక్కువే ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి సచ్ఛంద సంస్థలు. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ మధ్య లో 879 బాల్య వివాహాలను ఆపినట్టు చైల్డ్‌ లైన్ అనే స్వచ్ఛంద సంస్థ బీబీసీకి తెలిపింది. అందులో 204 కేసులు మార్చి 24 నుంచి మే 31 మధ్యలో జరిగినవే అని తెలంగాణ బాలల హక్కుల రక్షణ కమిషన్ చేర్మెన్ జే శ్రీనివాస్ తెలిపారు. ఇదే విషయమై దివ్య దిశ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఇసోడోర్‌ ఫిలిప్స్ బీబీసీ తెలుగుతో మాట్లాడారు.

 
"నల్గొండ, వనపర్తి, గద్వాల, నారాయణపేట, వరంగల్‌, ఖమ్మం, మహబూబ్ నగర్‌, వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలలో బాల్య వివాహ కేసులు ఎక్కువగా ఉన్నాయి" అని ఆయన అన్నారు. కరోనా విజృంభణను అరికట్టే ప్రయత్నంలో భాగంగా దేశంలో మార్చి నెలాఖరులో లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది.

 
"మహబూబ్ నగర్‌, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలలో వలస వెళ్లిన కూలీలు ఎక్కువ. లాక్‌డౌన్ తో చాలా మంది తమ గ్రామాలకు తిరిగి వచ్చేశారు. ఆర్థికంగా వెనుక బడ్డ వర్గాలు కావడం, భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్నారు" అని ఇసోడోర్‌ ఫిలిప్స్ బీబీసీకి చెప్పారు. మార్చి 16 నుండి పాఠశాలలు మూతపడ్డాయి. బడిలో ఉండాల్సిన పిల్లలు ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో వారి రక్షణ తల్లిదండ్రులకు సమస్యగా మారిందంటున్నారు నాగర్ కర్నూల్ బాలల రక్షణ అధికారి ఇంతియాజ్‌ రహీం.

 
నాగర్ కర్నూల్‌లో మార్చి నుంచి ఇప్పటి దాకా 28 బాల్య వివాహాలు ఆపినట్టు ఆయన తెలిపారు. లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కూడా నిలిచిపోయింది. ఐదు నెలలు అవుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రకటించ లేదు. ఈ పథకం కొనసాగింపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు బీబీసీ తెలుగుకి తెలిపాయి. బాల్య వివాహాలు పెరిగేందుకు ఇది కూడా ఒక కారణమన్నది నిపుణుల మాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగ్రవాదులను కొట్టిన చంపిన గ్రామస్థులు.. కానీ వాళ్లేం చేశారంటే?