తమలపాకు అనగానే తాంబూలం గుర్తుకు వస్తుంది. తమలపాకు తాంబూలానికే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్లు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఫైబర్... అంటే పీచు పదార్థం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుంది. తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు గమనించారు. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమ తొలగించి వాడుకోవాలి. తమలపాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
1. తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి.
2. చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది.
3. తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే క్షణికావేశాలు తగ్గుతాయి.
4. తమలపాకు రసాన్ని రెండు కళ్లల్లోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య తగ్గుతుంది.
5. గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది.
6. ఏ కారణం చేతనైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.
7. చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.
8. తమలపాకును తింటే శ్లేష్మం కరిగి పెద్ద మొత్తాల్లో స్రవిస్తుంది. దీంతో అరుగుదల తేలికగా జరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న వెంటనే ఆయాసం రాకుండా ఉంటుంది.
9. తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.
10. పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.
11. తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది. మొండి వ్రణం త్వరితగతిన మానాలంటే వ్రణం మీద తమలపాకును అమర్చి కట్టుకట్టుకోవాలి.
12. తమలపాకు రసాన్ని ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.