అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి గతేడాది సుప్రీంకోర్టు తీర్పునివ్వగా ఇప్పుడది నిజరూపం దాల్చబోతోంది. ఈ మహాకార్యానికి బుధవారం పునాది రాయి పడింది. రామమందిర పరిధిలోని కుబేర్ తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రుద్రాభిషేకంతో భూమిపూజ కార్యక్రమం ప్రారంభమైనట్టు శ్రీరామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది.
కరోనా వైరస్ కారణంగా ఈ కార్యక్రమానికి అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. బుధవారం ఉదయం రుద్రాభిషేకంతో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభమైనట్టు శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధికార ప్రతినిధి మహంత్ కమల్ నయన్ దాస్ తెలిపారు. శివుడికి రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్ని తాము అనుసరిస్తున్నామని తెలిపారు.
లంకపై దాడికి వెళ్లే ముందు రాముడు రుద్రాభిషేకంతో శివుణ్ని ప్రార్థించినట్టుగానే.. రామమందిర నిర్మాణాన్ని కూడా ప్రారంభించినట్టు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ తెలిపారు.
పురోహితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య రామాలయానికి పునాదులు వేశారు. మే 11న భూమిని చదును చేసే కార్యక్రమం మొదలవగా... ఆలయ నిర్మాణానికి ఇవాళ పునాది రాయిపడింది. లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన అయోధ్య రాముడి దర్శనం... సోమవారం నుంచి పునః ప్రారంభమైంది. యథావిధిగా దర్శనాలు కొనసాగుతున్నాయి.