తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని ఉపయోగించారన్న దానిపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. ఈ కేసులో తితిదే మాజీ చైర్మన్, వైకాపా ప్రధాన కార్యదర్శకుల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి వద్ద సిట్ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో ఆయన ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదు. దీంతో సిట్ అధికారులు నిరుత్సాహంతో వెళ్లారు. అయితే, అవసరమైతే మరోమారు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి సిట్ అధికారులు స్పష్టం చేశారు.
అదేసమయంలో వైవీ సుబ్బారెడ్డి మాట మార్చారు. విచారణ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరించానని, కల్తీ నెయ్యి విషయంలో నిజానిజాలు తేలాలనే ఉద్దేశ్యంతోనే తానే సుప్రీంకోర్టును ఆశ్రయించానని గుర్తుచేశారు.
తనపై అవినీతి ప్రచారం చేయడం దారుణం. కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఉండగా నెయ్యిలో అవినీతి ఎందుకు చేస్తాను అని ఎదురు ప్రశ్నించారు. 2024 జూన్ నెలలో సరపరా అయిన నాలుగు నెయ్యి ట్యాంకు్లో జంతువుల కొవ్వు ఉందా లేక ఇతర నూనెలు కలిపారా అన్నది తేల్చాలని కోర్టు ఆదేశించిందని ఆయన గుర్తుచేశారు. భక్తుల విశ్వాసంతో తానెప్పుడూ ఆడుకోలేదన్నారు.
ఈ కేసులో ప్రచారంలో ఉన్న అప్పన్న అనే వ్యక్తి గత 2018 నుంచే తన వద్ద పీఏగా పని చేయడం లేదన్నారు. ఒకవేళ నెయ్యి సరఫరాదారుల నుంచి అతని ఖాతాలోకి లావాదేవీలు జరిగివుంటే అతనితో పాటు అతనికి సహకరించిన అధికారులపైనా విచారణ జరపాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.