భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రీడాకారిణి, వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యురాలు స్మృతి మంథాన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. తన చిరకాల ప్రియుడు, సంగీత దర్శకుడు, ఫిల్మ్ మేకర్ అయిన పలాష్ ముచ్చల్‌ను ఆమె వివాహం చేసుకోనున్నారు. వీరి వెళ్లి ఈ నెల 23వ తేదీన జరుగనున్నట్టు సమాచారం.
ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీ పక్కన స్మృతి, పలాష్‌లు నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చిన విషయం తెల్సిందే. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇది స్మృతికి బెస్ట్ ప్రీడ వెడ్డింగ్ గిఫ్ట్ అంటూ అభిమానులు సైతం ప్రశంసలు కురిపించారు.
ఈ నేపథ్యంలో స్మృతి మంథాన.. తనకు కాబోయే భర్త నుంచి సర్‌ప్రైజ్ ప్రపోజల్ అందుకుంది. మంథానకు కాబోయే భర్త పలాశ్ ముచ్చల్.. ఇటీవల వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతి మంధానకు మోకాళ్లపై నిలుచుని తన ప్రేమను వ్యక్తం చేశాడు. తర్వాత మంధాన కూడా అతణ్ని కౌగిలించుకుంది. అనంతరం ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వీడియోను పలాశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
కాగా, గత 2019లో వీరి ప్రేమకథ మొదలుకాగా, 2024 వరకు ఎంతో గోప్యంగా ఉంచారు. ఇపుడు వీరి బంధం పెళ్లిపీటల వరకు చేరింది. పెళ్ళికి ముందు స్మృతి తన సహచర క్రికెటర్లతో కలిసి ఒక సరదా వీడియోను విడుదల చేసింది. ఇందులో వారంతా లగే రహో మున్నాభాయ్ సినిమాలోని సమ్‌ఝో హో హీ గయా అనే పాటకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఆఖరులో తన ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని చూపిస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది.