ఏపీ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడంపై వైకాపా మహిళా నేత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ప్రజలు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారనీ, ఈ ఫలితాలు చాలా సంతృప్తినిచ్చాయని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా, ఎన్టీఆర్‌నే కాకుండా, ఆయన స్థాపించిన పార్టీని పతనం చేసి, రాజకీయ వ్యవస్థలను సర్వనాశనం చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి నిష్క్రమించాడన్న సంతోషాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పారు. ముగిసిన ఎన్నికల్లో టీడీపీకి కనీసం 50 లేదా 60 సీట్లు వచ్చివున్నట్టయితే చంద్రబాబు అనే వ్యక్తి మళ్లీ బతికివుండేవాడని, కానీ, ఇపుడు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇక నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
అదేసమయంలో తనకు వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి పదవులు అక్కర్లేదన్నారు. తన భర్త జీవించివున్న సమయంలోనే మంత్రి పదవులు తీసుకోవాలని ఒత్తిడి చేశారనీ, కానీ నేనుమాత్రం సున్నితంగా తిరస్కరించినట్టు లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ఆయన తండ్రిలా పాలన చేయాలన్నారు.
వైసీపీలో చేరిన తనను ఓ తల్లిలా జగన్ ఆదరించారన్నారు. ఏనాడూ తనకు పదవి కావాలని ఆయనను అడగలేదన్నార. 2014లో కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారని, ఆ తర్వాత వద్దులేమ్మా.. ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పారనీ, దీంతో తాను కూడా మిన్నకుండిపోయానని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు.